ప్రపంచవ్యాప్తంగా నేడు విస్తరిస్తున్న వ్యాధుల్లో డయాబెటిక్ (మధుమేహం) లేదా షుగర్ ఒకటి. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గించే అంశం. ప్రపంచవ్యాప్తంగా 2021 గణాంకాల ప్రకారం 53.7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండగా ఆ సంఖ్య 2045 నాటికి 78.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశంలో ఈ సంఖ్య సుమారు 7.7 కోట్ల నుంచి 12.5 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధి నియంత్రణకు అవగాహనకు మించిన మందు లేదు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి వ్యాధి బారినపడకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి.
ప్రస్తుత జీవన శైలి కారణంగా వ్యాధులు పెరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడటం ఆందోళన కల్గిస్తోంది. కాలుష్యం మధుమేహంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వ్యాధి ప్రారంభంలోనే గుర్తించి చికిత్సలు మొదలు పెడితే త్వరగానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే ఆలస్యం చేస్తే నియంత్రణ కూడా ఆలస్యంగానే అవుతుంది. అనుమానాలను పక్కనపెట్టేసి అవగాహనతో ముందుకు సాగితే మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
సరిపడా ఆహారాన్ని తీసుకోవాలి
మధుమేహం వచ్చిందని తినే ఆహారాన్ని పూర్తిగా తగ్గించేయొద్దు. ఆహారం పూర్తిగా మానెయ్యటం సబబు కానే కాదు. మధుమేహం వచ్చినా సరే, ఎవరైనా గానీ ఆరోగ్యకరమైన, సమతులాహారం తీసుకోవాలి. ఆహారంలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయల వంటివన్నీ సమద్ధిగా ఉండేలా చూసుకోవాలి. నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం. అవసరమైతే పోషకాహార నిపుణుల సలహా మేరకే ఆహార నియమాలు పాటించాలి.
సాధారణంగా మధుమేహం వచ్చిన తర్వాత మొదటి పదేళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. దీంతో చాలామంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. నాకేం సమస్యల్లేవని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతుంటారు.
కిడ్నీ సమస్యలు
మధుమేహ దుష్ప్రభావాల కారణంగా పదేళ్లకల్లా కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. దాన్ని గుర్తించిన ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే కిడ్నీ మార్పిడి తర్వాత కూడా ఎక్కువ కాలం బతికే అవకాశాలు తక్కువ. కాబట్టి ఇతరత్రా సమస్యలు, లక్షణాలు లేవు కదా అని రక్తంలో గ్లూకోజును ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చెయ్యటం వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి వలన కలిగే ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి చూస్తే దీనిని ఒక ప్రజారోగ్య సమస్యగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ జబ్బు ఉందని తెలియకుండా ఆరోగ్యంగా ఉన్నామని భ్రమిస్తూ ఉన్నవారు తమ లక్షణాలను గమనించి, విధిగా పరీక్ష చేయించుకునొని చికిత్స ప్రారంభించేలా చర్యలు ఉండాలి.
చెప్పుకునేందుకు ఇబ్బంది
మందుల పట్ల, ఇన్సులిన్ పట్ల రకరకాల అపోహలు పెంచుకుని చిట్కా వైద్యాలకు మారటం వంటివన్నీ చేస్తూ చేజేతులా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అపోహల వల్ల మన సమాజంలో కొందరు తమకు ‘మధుమేహం వచ్చిందని’ బయటకు చెప్పుకోవాలంటేనే ఇబ్బందికర వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లల వంటివారు చాలా ఇక్కట్ల పాలవుతున్నారు.
వివాహాల విషయంలో కూడా- మధుమేహం ఉన్న ఆడపిల్లల విషయంలో ఎలాంటి అపోహలూ పెట్టుకోవాల్సిన పని లేదు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ఇప్పుడు ఇన్సులిన్‌తో సహా సమర్థమైన మందులున్నాయి. దాన్ని నియంత్రణలో పెట్టుకుంటే దాంపత్య జీవితం విషయంలోగానీ, సంతానం విషయంలోగానీ ఎలాంటి సమస్యలూ ఉండవు. మధ్య తరగతి వారు ఇలాంటి అనుమానాల్లోంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే మందుల కంటే పసర్లు, కషాయాలు, పొడుల వంటివే ఉత్తమమనీ, వాటితో దుష్ప్రభావాలు ఉండవనీ.. ఇలాంటి అపోహల నుంచి బయటపడటం మంచిది.
మందులు వాడాల్సిందే…
చాలామంది మధుమేహులు రక్తంలో గ్లూకోజు ఒక్కటే చూసుకుంటూ.. ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్, హైబీపీ వంటివేమీ పట్టించుకోవటం లేదు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు నియంత్రణలోనే ఉంటున్నా కూడా (అంటే పరగడుపున రక్తంలో గ్లూకోజు 125 కంటే తక్కువగానే ఉంటున్నా కూడా)… వీళ్లకు రక్తంలో కొలెస్ట్రాల్, ట్క్రెగ్లిజరైడ్లు, హైబీపీ వంటివి ఎక్కువ ఉంటే మధుమేహం కారణంగా వచ్చే దుష్ప్రభావాలన్నీ ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజు మాత్రమే తగ్గించుకుంటే సరిపోదని గుర్తించాలి. నిజానికి మధుమేహులు రక్తంలో గ్లూకోజుతో పాటు- వూబకాయం, హైబీపీ, కొలెస్ట్రాల్, ట్క్రెగ్లిజరైడ్లు.. ఈ నాలుగింటినీ కూడా కచ్చితంగా పట్టించుకోవాలి. వీటిలో హైబీపీ, కొలెస్ట్రాల్, ట్క్రెగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే వాటికి కచ్చితంగా మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది.
వయోబేధం లేనేలేదు
వయోబేధం లేకుండా సంక్రమిస్తున్న షుగర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో గ్లూకోస్ ఎక్కువగా ఉండటం వల్ల నీరసంగా ఉండటం, బరువు తగ్గినీర సంగా ఉండటం, బరువు తగ్గిపోవటం, అతి మూత్రం వంటి సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా రక్తనాళాల గోడలు త్వరితంగా పెళుసు బారతాయి. దానివల్ల కొవ్వు పదార్ధాలు అడ్డుపడి రక్తనాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. త్వరితగతిన ముసలితనం ఆవరిస్తుంది కూడా.
నియంత్రణకు ఇవి పాటించండి
– ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
– జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి
– ఎక్కువగా ఒకేసారి తినకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తినటం మేలు
– ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి
– ప్రశాంతంగా ఉండటాన్ని అలవర్చుకోవాలి
– ప్రతి చిన్న విషయానికి భయపడటం, టెన్షన్ పడకుండా ఉండాలి
– ప్రాణాయామం, యోగా చేయడం కూడా మంచిదే
– మందులు మానివేయకుండా ఖచ్చితంగా వాడాలి
శ్రీ పస్తులు, ఉపవాసాలకు దూరంగా ఉండాలి
శ్రీ వ్యాధి నియంత్రణ తీరుపై తరచుగా పరీక్ష చేయించుకోవాలి
శ్రీ పాదాలకు రక్షణ ఉంచుకోవాలి. చెప్పులు లేకుండా నడవరాదు
– డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి,
చైర్మన్, విజిఆర్ డయాబెటిక్స్ ఆసుపత్రి, విజయవాడ. సెల్ : 93467 96260