హాయిగా నవ్వుకుందాం!

Apr 19,2024 05:03 #chinnari, #feachers, #jeevana, #Kavitha

మొహానికి అందం ఆనందం
హాయిగా నవ్వుతూ ఉందాం
హహహ అంటూ ఎప్పుడూ
చిరకాలం కమ్మగా జీవిద్దాం!

నవ్వే మనిషికి ఆరోగ్యం
ఆనందమే జీవిత సౌభాగ్యం
నలుగురితో కలిసి నవ్వేద్దాం
ఆయువును పెంచుకుందాం!

మమకారానికి నిలువుటద్దం
నవ్వే తరగని పరిమళం
కాంతికి నవ్వే చెరగని చిహ్నం
అందానికి వెలుతురే ఆనందం!

పకపక నవ్వుతూ గడిపేస్తాం
హాస్య కథలను చదివేద్దాం
నవ్వుల దృశ్యాల్ని చూసేద్దాం
కాసేపు లోకాన విహరిద్దాం!

కార్టూన్‌ బొమ్మలు గీసేద్దాం
సంతోషాలను కలిపేద్దాం
జోకులు మస్తుగా వేసుకుందాం
పగలబడి మరీ నవ్వేద్దాం!

చక్కని మెరుపే కదా ఈ హాస్యం
పదుగురు మెచ్చిన హావభావం
నవ్వే ఆకర్షణకు నిజ రూపం
ఆ నవ్వే మనిషికి ప్రేమానురాగం!

ముసి ముసి నవ్వులు నవ్వేద్దాం
ఆహా ఓహౌ అంటూ అలరిద్దాం
అందరం కలిసి జీవిద్దాం
మనసుకు హాయిని కలిగిద్దాం

నవ్వుల పోటీ పెట్టుకుందాం
చమత్కార మాటలు వల్లిద్దాం
తలలో బరువుని దింపేద్దాం
తేలిక పడుతూ పయనిద్దాం!

నవ్వుతో స్నేహాన్ని పండిద్దాం
నలుగురి మదిలో నిలిచిపోదాం
చిలిపి జ్ఞాపకాలను నెమరు వేద్దాం
నవ్వుల పువ్వుల్ని వెదజల్లేద్దాం!

ఆనందమే జీవన సౌందర్యం
నవ్వే జీవిత సుఖ మధురం
కలకాలం నవ్వుతూ వుందాం
ఆయుస్సును పెంపొందిద్దాం!

– నరెద్దుల రాజారెడ్డి,
96660 16636.

➡️