ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఉన్న మనతోపాటుగా ప్రపంచమంతా ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో సతమతమవుతున్నాం. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఇలా కారణాలేమైనా వాటిని అందుకునే క్రమంలో పిల్లల పట్ల ఒకింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూనే ఉన్నాం. వాళ్లే స్వయం శక్తితో ఎదుగుతారనే భరోసా కావొచ్చు. ప్రతిదీ నేర్చుకుంటారనే నమ్మకమైనా ఉండొచ్చు. ఇంటిల్లిపాదీ ఇలా ఉరుకులు పరుగులు తీస్తున్న క్రమంలో పిల్లల చదువు, పెంపకం, ఆరోగ్యం ఇలా అనేక అంశాలు ప్రభావితం అవుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు బిజీగా గడుతున్న సమయంలో పిల్లలు మొబైల్‌ఫోన్లకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారుతున్నారు.
ఏదో కొద్దిసేపైతే ఫర్వాలేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్లతో వాళ్లు కూడా గడిపేస్తుండటం నేడు అన్నిచోట్లా చూస్తున్నాం. ఫోన్ లేదా టీవీలకు పిల్లలు అతుక్కుపోవటం కొంచెం ఆందోళన కల్గించే విషయమే. ఫలితంగా రొటీన్ పనుల చట్రంలో ఇరుక్కుపోయి స్థూలకాయులు, మందమతులుగా పిల్లలు మారిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఎవ్వరినీ నిందించాల్సిన అవసరం లేదు.
నేటి రోజుల్లో ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం తెలిసిందే. లేనిపక్షంలో కుటుంబ జీవనం గడవటం కష్టమవుతోంది. ఈ క్రమంలో పిల్లల పెంపకం విషయంలోనూ కాసింత ఓపిగ్గా తల్లిదండ్రులు కొంత శ్రద్ధ తీసుకుని వారిని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తాము బిజీగా ఉంటున్నామనే పేరుతో పిల్లల పెంపకం, వారి జీవన విధానాన్ని గాలికొదిలేస్తే ఆ ప్రభావం వారి పెంపకం, వృద్ధి, వికాసంపై కూడా పడుతుంది. ప్రతిరోజూ ఎంతోకొంత సమయం పిల్లలకు కేటాయిస్తే వారి ఇబ్బందులు, సమాజపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, చదువుపరంగా కావాల్సిన అవసరతలు తెలుసుకుని పరిష్కరించటానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవుల్లో తమ పిల్లల ఆసక్తులను తెలుసుకుని, గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదోఒక కొత్త నైపుణ్యాలను నేర్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది.
నైతిక విలువలు : పిల్లలకు నీతికథలు, సూక్తులు, జాతీయాలు, మంచీచెడు గురించిన విచక్షణ గురించి సవివరంగా తెలియజేయాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? కుటుంబంలోని పెద్దల పట్ల ఎలా ఉండాలనేది తెలియజేయాలి.
స్వయంగా నేర్చుకోవాలి : చిన్న కుటుంబాలు కావటంతో సమయంలేక పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నాం. వారు యాంత్రిక జీవితానికి అలవాటు పడుతున్నారు. స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉండటం లేదు. యానిమేటెట్ లోకమే నిజమనుకునే పరిస్థితి ఉంది. ఇలా కాకుండా వారితో మమేకమై కొత్త విషయాలు నేర్పించాలి.
సృజనాత్మకత : పిల్లల్లో ఆల్‌రౌండ్ అభివృద్ధి చెందాలంటే వారి వయస్సుకు సరిపడినంత ఆలోచనా శక్తిని పెంపొందించాలి. తార్కికంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. సృజనాత్మకను తట్టి లేపాలి. కష్టం, సుఖం, లాభం, నష్టం, ఆనందం, దు:ఖం, గెలుపు, ఓటములు అనే నిజ జీవితాన్ని పరిచయం చేయాలి.
బాధ్యతను గుర్తుచేయాలి : కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల పాత్రల గురించి తెలియజేయాలి. వారి పట్ల ఎలా నడుచుకోవాలో వివరించాలి. క్రమశిక్షణగా ఉంటే ఒనగూరే ప్రయోజనాలు, లోపిస్తే వచ్చే దుష్పరిణామాలు తెలపాలి. ఏరోజు పాఠాలు అదేరోజు చదివేయటం, హోంవర్కులు పూర్తిచేయటం వంటివి ప్రోత్సహించాలి. దైనందిన కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించకుండా చూడాలి.
విచక్షణ పెంపొందించాలి : జీవితం అంటే అన్ని కల గలిపిన నిజ ప్రపంచమని పిల్లలకు తెలియజేయాలి. బయటా లేదా ఇంట్లో ఉన్న పెద్దవారితో పిల్లలను మాట్లాడించాలి. తద్వారా పిల్లలు జ్ఞానవంతులు అవటమే కాకుండా భాషా సంపదను కూడా వృద్ధి చెందించే వారవుతారు.
మానసిక వికాసం : పిల్లలు నేడు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో మేథా సంపత్తిలోపం ఒకటి. దీని కోసం ఆటలు ఆడించాలి. చదరంగం (చెస్), చిన్న చిన్న గణిత ప్రశ్నల సాధన, ఏక చలరాశిలో సమీకరణల సాధన, చతుర్విద ప్రక్రియల మీద సాధన, గణన సామర్థ్యం అత్యంత ఆవశ్యమైంది. వీటిని నేర్పటం ద్వారా పిల్లలో ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది.
తార్కికశక్తి పెరుగుదల : పిల్లలకు తర్కపరమైన జ్ఞానాన్ని వృద్ధి చెందేలా కృషిచేయాలి. సుడోకో, పదకేళి, పద చదరాలు, సంఖ్యా చదరాలు, పొడువు, విడుపులను నేర్పించటం ద్వారా వారికి తార్కిపరమైన ఆలోచనాశక్తి పెరుగుతుంది. తద్వారా జీవితంలో ఎదురయ్యే ఎంత పెద్ద సమస్యకైనా తార్కిక ఆలోచనా శక్తి దాని ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
వృర్థాలతో పరికరాలు : ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులతో అందమైన కళాకృతులను రూపొందించటం నేర్పించాలి. పగిలిన గాజులతో దండలుగా తయారుచేయడం, చరవాణిలకు స్టాండులను తయారు చేయటం, అట్టముక్కలతో చిన్న ఆకారాలను గణిత నమూనాలను చేయించటం మంచిది.
ఉద్వేగాల నియంత్రణ : జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి ప్రధానంగా మన పిల్లల చేత వైకుంఠపాళీ ఆటను ఆడించటం మంచిది. తద్వారా వారికి గెలుపు ఓటములపై అవగాహన, కష్టం ఎదురైనప్పుడు నిలదొక్కుకోగలిగిన శక్తి, నష్టం ఎదురైనప్పుడు తట్టుకునే ధైర్యం, జీవితంలో ఏదైనా సాధించాలనే ఆసక్తి పెంపొందుతుంది.
శ్రమించే అలవాటు : శ్రమ జీవనాన్ని చిన్నతనం నుంచి అలవాటుగా మార్చాలి. పది సంవత్సరాల దగ్గర పడిన పిల్లలకు వారి దైనందిన కార్యక్రమాలను వారే చేసుకునేలా ప్రోత్సహించాలి. కౌమార దశలోని పిల్లలను అవసరమైతే బయట పనులకు పంపించటం ద్వారా మంచిచెడూ విచక్షణ తెలుస్తుంది. బయట పనులకు పంపటానికి వీలుకాని సందర్భంలో ఇంట్లో తోట పెంపకం పనులనైనా నేర్పాలి. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతోపాటుగా ప్రకృతిలో మమేకమవుతారు.
కళలపై ఆసక్తి : సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, కవిత్వం, శిల్పనిర్మాణం వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి. చక్కని దస్తూరి కోసం చేతిరాత నేర్పించటం, పఠన అవగాహనపై చందమామ, ఇతర కథలను చదివించటం మేలు.
స్వీయ రక్షణ : స్వీయ రక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పించటం ద్వారా మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటి క్లాసులకు సైతం హాజరుకావొచ్చు.1
– పగిడిపల్లి లక్ష్మీనిరంజన్ కుమార్,
ఎమ్మెస్సీ, ఎంఇడి, గణిత అధ్యాపకులు,
చనుబ్బండ, చాట్రాయి మండలం, ఏలూరు జిల్లా.
సెల్ : 81797 47947