ఎండకాలంలో చాలామంది చల్లటి నీళ్లు తాగడానికి కుండని ఉపయోగిస్తారు. మట్టిలో ఉండే మినరల్స్ నీళ్లలో చేరతాయి. కాబట్టి కుండ నీళ్లు ఆరోగ్యకరం అని కూడా భావిస్తారు. అయితే, దీని వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బాగా కడగాలి
కుండ కొన్న తర్వాత మొదటిసారి ఉపయోగానికి ముందు బాగా కడగాలి. మట్టికుండలు పొరలు పొరలుగా ఉంటాయి. కాబట్టి, వాటిని నిల్వ చేయడం, రవాణా చేసే క్రమంలో దుమ్ము, బ్యాక్టీరియాల్లాంటివి పేరుకుని ఉండే అవకాశం ఉంది.
ఎలా కడగాలి?
– ముందుగా కుండను లోపలా బయటా శుభ్రంగా కడిగి, కొన్ని గంటలపాటు మంచినీళ్లతో నింపి పెట్టాలి. దీంతో ఏవైనా ధూళి కణాలు ఉంటే వదిలిపోతాయి.
– ఆ తర్వాత మెత్తటి బ్రష్ కానీ, కొబ్బరి పీచును కానీ ఉపయోగించి వేడినీటితో సున్నితంగా కడగాలి. కుండ శుభ్రపడే వరకు ఇలా చేయాలి. సబ్బు లాంటివి వాడొద్దు.
– ఇక రోజూ ఉపయోగించేటప్పుడు కూడా వారానికి ఓసారైనా కడగాలి. లేకుంటే కుండలో నాచు, మురికి పేరుకుపోతాయి.
మూసి ఉంచాలి
కుండకు సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గాలి ప్రసరించి నీళ్లను చల్లబరుస్తుంది. అయితే, రంధ్రాల ద్వారా దుమ్ము, కీటకాలు, బ్యాక్టీరియా లాంటివి ప్రవేశించే వీలుంది. కాబట్టి కుండను ఎప్పుడూ మూసి ఉంచాలి.
ఏం చేయాలి?
– కుండ పైభాగాన్ని మూతపెట్టి ఉంచాలి.
– ఒకవేళ బట్టను కప్పి ఉంచేట్లయితే దాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ ఉండాలి.
– కుండను పరిశుభ్రమైన చల్లటి ప్రదేశంలో పెట్టాలి. సూర్యకాంతి, దుమ్మూధూళి పడకుండా చూసుకోవాలి.
– కుండలోపల తడిగా ఉంటుంది కాబట్టి, ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ ఉండకపోతే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
ఎప్పుడు మార్చాలి?
– ప్రతి 24 గంటలకోసారి నీళ్లు మారుస్తూ ఉండాలి.
– కుండలో కొంతమేరకు నీళ్లు ఉంటే మిగిలిన భాగం నింపకూడదు. అవి అయిపోయాకే మళ్లీ నీళ్లు పోయాలి.
– వానకాలం, తేమగా ఉండే సమయాల్లో కుండను తరచుగా కడుగుతూ ఉండాలి. లేకపోతే బూజు ఏర్పడుతుంది.
నేలపై ఉంచొద్దు.
– కుండను నేరుగా నేలపైనే ఉంచకూడదు. నేల సరిగ్గా లేకపోతే కుండ పగిలిపోవచ్చు. పైగా కుండలో నీళ్లు నేలమీద ఉండే దుమ్ము, బ్యాక్టీరియాతో కలుషితం కావొచ్చు. కుండను చెక్క, ప్లాస్టిక్, మెటల్ స్టాండ్ మీద ఉంచాలి.