శాలిపేట గ్రామంలో రామయ్య, వీరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారిద్దరూ పాతిక సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఇద్దరూ గ్రామాల్లో తిరిగి బట్టల వ్యాపారం చేస్తున్నారు. శాలిపేటకు కొద్ది దూరంలో ఉన్న సిరిపురం టౌనుకు వెళ్లి బట్టలు కొనుక్కొని పొరుగు ఊర్లకు కలిసి వెళ్లి బట్టలు అమ్మేవారు. బట్టలు అమ్మగా వచ్చిన లాభం చెరి సగం పంచుకునేవారు.
పాతికేళ్లుగా వారిద్దరి స్నేహాన్ని చూసి టౌన్‌లోని బట్టల దుకాణం యజమాని సుందరం ఆశ్చర్యపోయేవాడు. ఒకసారి రామయ్య, వీరయ్యల స్నేహం ఎంత బలమైనదో తెలుసుకోవాలని అనుకున్నాడు. రోజూ ఒకే గ్రామం వెళ్లే వాళ్లని, ఆ రోజు వేరే వేరే గ్రామాలకు పంపాడు. రామయ్యకు దారిలో వెళ్తుండగా కొంత బంగారం దొరికింది. వీరయ్యకు కూడా దారిలో కొంత డబ్బు దొరికింది. వాటిని తీసుకుని గ్రామాలకు వెళ్లి, వ్యాపారం చేశాక తిరిగి ఇద్దరు తమ ఊరికి వెళ్లే దారిలో కలిసారు.
ఒక దగ్గర ఆగి నీళ్లు తాగాలని బావి దగ్గరికి ఒక్కొక్కరుగా వెళ్లారు. రామయ్య తనకు దొరికిన బంగారంలో సగం వీరయ్య సంచిలో వీరయ్యకి తెలి యకుండా వేశాడు. వీరయ్య కూడా తనకి దొరికిన డబ్బులలో సగం రామయ్య సంచిలో రామయ్యకి తెలియకుండా వేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బంగారం, డబ్బు వేసుకుని ఇంటికి వెళ్లారు. రాత్రి తమ సంచిలో బంగారం, డబ్బులు చూసుకుని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మిత్రులు ఇద్దరికీ ఒకరికి బంగారం ఒకరికి, డబ్బు దొరికిందని గ్రహించారు. మరుసటి రోజు ఈ విషయం దుకాణం యజమాని సుందరానికి చెప్పారు.
‘మీకు బంగారం, డబ్బు దారిలో దొరికేలా చేసింది నేనే, మీరు వాటిని పంచుకున్న తీరు అమోఘం. మీ ఇద్దరి స్నేహానికి గుర్తుగా వాటిని మీరే దాచుకోమ’ని సుందరం చెప్పాడు. రామయ్య, వీరయ్య జీవితాంతం స్నేహం చేస్తూ, దాచిన సొమ్ములో అవసరమైన సందర్భంలో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు.
– ఉండ్రాళ్ళ రాజేశం, సిద్దిపేట,
99669 46084.