రేపటి తరానికి వెలుగులం

Dec 5,2024 03:30 #generation, #Light, #tomorrow's

పిల్లలం మేము మేటి పిల్లలం
రేపటి తరానికి వెలుగు రేఖలం
విజ్ఞానపు దారుల్లో పయనిస్తాం
అజ్ఞానం తొలగిస్తూ వెలుగుతాం

చాచా నెహ్రూ సన్నిధి విద్యార్థులం
చదువులోన రాణించే పౌరులం
సంస్కారమే మాకున్న స్నేహం
మమకారం రుచి చూసిన పిల్లలం

ఆటల్లో నేటి మేటి విజయులం
సమభావన గల మంచి మిత్రులం
గురువులంటే విలువనిచ్చె జ్ఞానులం
వారి పాదాలకు ప్రణమిల్లే యోగ్యులం

తల్లి తండ్రి ఆశయాన్ని నిలుపుతాం
వారి మాట జవదాటక అడుగేస్తాం
తోటి వారి మంచి కోరి కదులుతాం
లోకానికి మేలు చేస్తూ మసలుతాం

రేపటి పౌరులుగా ఎదుగుతాం
రేపటి తరం బాగుకై శ్రమిస్తాం
ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకేగుతాం
ఉత్తమ విద్యార్థి దశకు చేరుతాం

టెక్నాలజీతోనే చేయి కలుపుతాం
టెక్నికల్‌గా ఎంతో విస్తరించుతాం
నేటివిటీ కాలంతో జతకట్టి నడుస్తాం
అంతా మంచే జరగాలని కోరుతాం

పాఠశాల శుభ్రతకే పట్టం గడతాం
పాఠాలను శ్రద్ధగా చదివి పాసవుతాం
పుస్తకాలపై మక్కువ పెంచుకుంటాం
విజ్ఞానానికి జోరుగా పదును పెడతాం

అక్షరక్షరం కలిపి వాక్యం నిర్మిస్తాం
పదం పదం కలిపి మంచి పాట రాస్తాం
నీతి కథలు చదివి చక్కగా జీవిస్తాం
బాలగేయాలతో ఉల్లాసం కలిగి వుంటాం

పొడుపు కథలు విప్పుతూ ఆనందిస్తాం
చరిత్ర చదివి లోకజ్ఞానం పొందుతాం
చక్కని మార్గంలో జీవితాన్ని నడుపుతాం

బుడుగులం మేము బుజ్జాయిలం
బుల్లి బుల్లి అడుగులేస్తూ కదుల్తాం
తీయని మాటలతో అలరిస్తూ వుంటాం
చదువులమ్మ సన్నిధిలో ఓలలాడుతాం

– నరెద్దుల రాజారెడ్డి,
96660 16636.

➡️