మామిడి మనిషి

Apr 11,2025 05:59 #feachers, #Jeevana Stories, #Mango Man

చెట్లను ప్రేమించే వాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. వాటిని పెంచే క్రమంలో పూలు, పళ్ల గురించి ఎంతో అనుభవం గడిస్తారు. వాటికిచ్చే ఎరువులు, రసాయనాలపై శాస్త్రవేత్తల్లా పెద్ద రీసెర్చ్‌ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఈ చెట్ల ప్రేమికులంతా ఉత్తరప్రదేశ్‌కి చెందిన కరీముల్లా గురించి తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా మామిడికాయలు విరివిగా దొరికే ఈ వేసవికాలంలో ఆయన పరిచయం అవసరం. కరీముల్లా తనకి ఎంతో ఇష్టమైన మామిడిచెట్లపై చేసిన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపాయి. ‘భారతదేశ మామిడి మనిషి’గా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయన పేరు లిఖించబడింది. 7వ తరగతి కూడా పాసవ్వని వ్యక్తి ఒకే మామిడి చెట్టుకు ఏకంగా 300 రకాల మామిడి పళ్లను కాయించడం వెనుక చేసిన కృషికి గాను భారతప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ బిరుదుతో కూడా సత్కరించింది.

కరీముల్లా చేసిన ప్రయోగాలు చూసినవారెవరైనా ఆయన పెద్ద శాస్త్రవేత్త అనుకోవడం ఖాయం. వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేసిన ఘనత కరీముల్లా సొంతం. అయితే కరీముల్లాని ఎవరైనా ప్రశంసలతో ముంచెత్తుతుంటే చాలా వినయంగా వాటిని తిరస్కరిస్తాడు. విజయాల గురించి మాట్లాడొద్దంటూనే భూసారం, వరదలు, అంటుకట్టడం, ప్రేమ గురించి అవిశ్రాంతంగా మాట్లాడతాడు.

84 ఏళ్ల కరీముల్లా 6 దశాబ్దాలుగా తాతముత్తాతల నుండి వచ్చిన వ్యవసాయ భూమిలో పనిచేస్తున్నాడు. చెట్లతో ఆయనకున్న ప్రేమ గురించి ఇలా చెబుతున్నాడు. ‘7వ తరగతి ఫెయిల్‌ అయ్యాక, తాతతో పాటు పొలంలో పనిచేసేవాడ్ని. అప్పటి నుండి ఇక్కడే నా దినచర్య మొదలయ్యేది. ప్రస్తుతం వయసురీత్యా నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ నా చెట్టు గురించి చెప్పడానికి మాత్రం వెనుకాడను. ఈ చెట్టుకి, నాకు మధ్య ఉన్న బంధం అపారమైన ప్రేమతో ముడిపడింది. ఈ చెట్టు నా జీవితకాల జ్ఞాపకాలను కలిగివుంది. ఈ చెట్టును చూడడానికి, దీనికి కాస్తున్న రకరకాల మామిడి పండ్లను అధ్యయనం చేయడానికి ప్రజలు ఇక్కడికి రావాలి. నేనున్నా, లేకపోయినా నా తరువాత తరం వారు ఇలాంటి ప్రయోగాలు మున్ముందు మరిన్ని చేయాలి. ఎందుకంటే ఈ చెట్టుకి కాసే ప్రతి కాయ దాని ప్రత్యేక లక్షణాలను కలిగివుంటుంది’ అని ఆయన ఎంతో గర్వంగా చెబుతున్నారు.
మొదటిసారి 1957లో పురాతన పద్ధతిలో అంటుకట్టడాన్ని కరీముల్లా ప్రారంభించారు. ‘మొదటిసారి ప్రయోగం, ఫలితం రాకముందే బెడిసికొట్టింది. ఆ ఏడాది అధిక వర్షాల వల్ల తోటలోకి నీరు చేరి ప్రయోగం విఫలమైంద’ని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పుడే వర్షాల వల్ల పంట నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఇంకోసారి భూమిలో సారం తగ్గడం వల్ల మేలైన జాతి వృక్షాలు కూడా సంవృద్ధిగా ఫలాలు ఇవ్వకపోవడం గుర్తించారు. భూసారం పెరిగే చర్యలు తీసుకున్నారు. ఇలా తన అనుభవాల నుంచి ఎన్నో ప్రయోగాలు చేసిన కరీముల్లా ‘వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఏమాత్రం తీసిపోర’ని ఆయన్ని బాగా తెలిసినవారు అంటారు.

రకరకాల ప్రయోగాల తర్వాత 1987లో కరీముల్లా మరోసారి రకరకాల మామిడిచెట్లకు అంటుకట్టి విజయం సాధించారు. అలా ఆయన అంటుకట్టడం ప్రారంభించిన ఓ చెట్టు రకరకాల ప్రయోగాలకు నెలవైంది. 125 ఏళ్ల ఆ చెట్టు ఇప్పటికీ ఆ తోటలో ఉంది. ఆ చెట్టు గురించి కరీముల్లా ఎంతో గొప్పగా చెబుతారు. ‘ఈ చెట్టు నా తాతల కాలం నాటిది. నా మొదటి ప్రయోగం ఈ చెట్టుమీదే చేశాను. ఎన్నో ప్రయోగాల తరువాత దీని ప్రతి కొమ్మ రకరకాల రంగుల్లో, రుచుల్లో మామిడిపండ్లను ఇస్తుంది. ఇదంతా సాధించడం ఒక్కరోజులో జరగలేదు. దీని వెనుక ఎంతో నిరీక్షణ ఉంది’ అని కరీముల్లా ఆ చెట్టును ప్రేమగా తడుతూ చెప్పారు.

‘మీ జీవిత కాలంలో ఎన్ని చెట్లను పెంచారు?’ అని ఎవరైనా అంటే కరీముల్లా దగ్గర సమాధానం దొరకదు. ఎందుకంటే తన జీవితకాలంలో చెట్లను పెంచడమే విధిగా చేశారు కానీ, లెక్కపెట్టడం ఆయన ఎప్పుడూ చేయలేదు. ప్రస్తుతం కరీముల్లా కొడుకు నజీముల్లా ఖాన్‌ (57) తోటపనులు చూసుకుంటున్నారు. వయోభారంతో సతమతమవుతున్నా కరీముల్లా రోజుకో సారైనా తోటలోకి వస్తుంటారని ఆయన చెబుతున్నాడు. ‘నాన్నకు సాయంగా తోటలోకి వచ్చిన నేను ఇప్పుడు పూర్తికాలం బాధ్యతలు తీసుకున్నాను. ఇదంతా ఈ తోటపై నాన్న పెంచుకున్న ప్రేమే’ అంటాడు నవ్వుతూ నజీముల్లా.

రకరకాల మామిడి పండ్లు పెంచడమే కాదు, వాటికి ప్రముఖుల పేర్లు కూడా పెడతాడు కరీముల్లా. అలా ఈ చెట్టుకు కాసిన పండ్లలో సచిన్‌ టెండూల్కర్‌, ఐశ్యర్యరారు, నరేంద్రమోడీ, అమితాబ్‌ బచ్చన్‌, అనార్కలి వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. అల్ఫోన్సో, లంగ్రా, కేసర్‌, దశేరి, చౌన్సా వంటి రకాలు ఆ తోటలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఒక్కో ప్రయోగం ఫలసాయం రావడానికి సుమారు 10 నుంచి 12 ఏళ్లు పడుతుందని ఈ తండ్రీ కొడుకులు చెబుతున్నారు. అంతకాలం ఓపిగ్గా ఎదురుచూడడం, ప్రయోగం విఫలమైతే మళ్లీ ప్రయత్నించడం వెనుక కరీముల్లా కృషి నిరంతరమైనది.

కరీముల్లా చేసిన ఈ ప్రయోగాలు చూసేందుకు ఈ తోటకి దేశవిదేశాల ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. కొంతమంది వీటిపై అధ్యయనం చేస్తారు. కరీముల్లా దగ్గర పాఠాలు నేర్చుకుంటారు. అయితే ‘గురువును నేను కాదు.. ఈ చెట్లే గురువులు’ అని కరీముల్లా చాలా వినయంగా వారికి చెబుతారు.

➡️