మనీషా ‘బ్రేక్‌’ చేసింది…

Jul 14,2024 23:26 #Afghanistan, #Olympics

తాలిబన్లు వేసిన బాంబుదాడి నుండి వెంట్రుకవాసిలో తప్పించుకుని ఆప్ఘన్‌ నుండి పాకిస్తాన్‌కు చేరుకుంది 18 ఏళ్ల మనీషా. ఆమెతోటే తన పదేళ్ల చిట్టి తమ్ముడు కూడా ఉన్నాడు. ‘మనం ఇక్కడ ఉండగలమా? నాకు అనుమానంగానే ఉంది’ అని విచారం నిండిన కళ్లతో అక్కని అమాయకంగా అడిగాడు తమ్ముడు. ‘మనం తప్పకుండా సాధిస్తాం’ అని తమ్ముడి చెయ్యి గట్టిగా నొక్కి చెప్పింది అక్క. ‘ఏదైనా సాధించేవరకు ఇక్కడి నుండి వెనక్కి వెళ్లేదిలేదు’ అని మనసులో తమ్ముడికి గట్టిగా మాట కూడా ఇచ్చేసింది ఆ రోజు.. ఇప్పుడు అదే జరిగింది. వచ్చే నెలలో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆప్ఘన్‌ తొలి మహిళా బ్రేక్‌ డ్యాన్సర్‌గా చరిత్ర సృష్టించింది.

‘అమ్మని వదిలేసి వచ్చిన మేము ఇద్దరమే మిగిలాం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తమ్ముడికి నేను అక్కగా కాదు.. అమ్మలా ఉండాలని మా అమ్మ చెప్పింది. అమ్మ మాట నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను’ అంటోన్న మనీషా, తాలిబన్‌ పాలన రాకముందు ఆప్ఘన్‌లో ఓ డ్యాన్స్‌ ట్రూప్‌లో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేది. 55 మంది పురుషులున్న డ్యాన్స్‌ బృందంలో మనీషా ఒక్కత్తే అమ్మాయి. అంత స్వేచ్ఛ నుండి ఒక్కసారిగా విద్య, ఉపాధి వంటి మౌలిక వసతులకు కూడా అర్హత లేని స్థితికి వచ్చేసింది. తను ఒక్కత్తే కాదు, చుట్టూ ఉన్న సమాజం కూడా తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉంది. ఆ పరిస్థితుల్లో ఊహించని పరిణామంగా మనీషా ఇంటికి కూతవేటు దూరంలో తాలిబన్లు బాంబు దాడికి దిగారు.
‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మొదట మేము పాకిస్తాన్‌ చేరుకున్నాం. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో 2022లో స్పెయిన్‌కి వచ్చాం. తమ్ముడు, నేను బతకాలంటే ఏదొక పని కావాలి. అప్పుడే ఒక సెలూన్‌లో పని దొరికింది. అక్కడే నా సహోద్యోగుల ద్వారా స్పానిష్‌ మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్లల్లో ఒకరు నా డ్యాన్స్‌ హాబీని తెలుసుకున్నారు. ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. స్పెయిన్‌ ప్రజలకు నా డ్యాన్స్‌ని పరిచయం చేశారు. ఆ స్నేహితుడి వల్లే ఒలింపిక్స్‌ కోసం పనిచేసే రెఫ్యూజీ టీమ్‌ మేనేజర్‌ నా గురించి తెలుసుకున్నారు’ అని తన ప్రయాణం గురించి మనీషా చెబుతోంది.
స్పెయిన్‌లో ఇచ్చిన డ్యాన్స్‌ ప్రదర్శనల్లో మనీషా తన స్వదేశీ వస్త్రాలంకరణతోనే చేసేది. ‘ఇలా చేయడం అమ్మకు ఎంతో ఇష్టం. ఒంటరి మహిళగా అమ్మే మమ్మల్ని పెంచింది. ఎన్నో కష్టాలు పడింది. నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనేది. అలాంటి అమ్మ కళ్లల్లో ఆనందం చూడాలంటే నేను, నా దేశ దుస్తులతోనే డ్యాన్స్‌ చేయాలనుకున్నాను. అదే జరిగింది. స్పెయిన్‌కి వచ్చిన ఇన్నేళ్ల తరువాత అంటే మూణ్ణెళ్ల క్రితమే అమ్మ నా దగ్గరకు వచ్చింది. ఆమె, అమ్మ మాత్రమే కాదు.. తను నాకు నాన్న, బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా’ అని మనీషా తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పింది.
‘ఒకప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు, ‘ఆడపిల్లవి, ఆ కుప్పిగంతులు ఏంటి? అని ఎద్దేవా చేశారు. ఈ రోజు నన్ను, అమ్మని ఎంతో ప్రశంసిస్తున్నారు’ అంటున్న మనీషా బంగారు పతకం గెలవడం కోసం ఒలింపిక్స్‌కి వెళ్లడం లేదు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ విజయశిఖరాలు అధిరోహించే వారి ప్రతినిధిగా వెళుతోంది. ఆమె సాధించిన ఈ విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

➡️