మహిళల జీవితాల్లో మెనోపాజ్ ఇదొక దశ. స్త్రీలలో పునరుత్పత్తి వయస్సు అయిపోయిందనటానికి ఇదొక సంకేతం. ఈ దశలోకి వచ్చిన వారు ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండటం ద్వారా వయసుతోపాటు వచ్చే శారీరక మార్పులను గమనించటం ద్వారా ఈ దశను సులభంగా దాటొచ్చు. ఈ దశలో వచ్చే మార్పులపై సమగ్రమైన అవగాహన ఉండటం ద్వారా వచ్చే సమస్యలను సులువుగా ఎదుర్కొనవచ్చు.
12 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకు రుతుక్రమం వస్తుంది. అక్కడి నుంచి 50 ఏళ్ల మహిళలు వరకూ ప్రతినెలా రుతుక్రమం (పీరియడ్స్) వస్తుంటాయి. ఆ తర్వాత అవి ఆగిపోవటాన్ని ‘మెనోపాజ్’గా పిలుస్తుంటారు. ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల అండాలు ప్రాథమిక రూపంలో ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ ఈ నిల్వలు తగ్గిపోతుంటాయి. రుతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతినెలా కొన్ని అండాలు విడుదలవుతూ మెనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. వీటితోపాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. మరో రెండేళ్లలో మెనోపాజ్ దశకు వెళ్తామనే క్రమంలోనే శరీరంలో మార్పులు మొదలవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగా తగ్గుతుంది. శారీరక మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటాయి. దాంతో మెనోపాజ్ దశకు చేరుకుంటారు. సాధారణంగా 48 నుంచి 55 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ చోటుచేసుకుంటుందని అంచనా.
అయితే సగటు వయస్సుగా 51 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. మెనోపాజ్ మరీ 40 కంటే ముందే వస్తే దానిని ‘ప్రికాషియస్ మెనోపాజ్’ అని అంటారు.
ఈ లక్షణాలు కనిపిస్తాయి…
– రుతుక్రమంలో ముందూ, వెనుకా రావటం
– శరీర భాగాలకు చెమటలు పట్టి చాలా వేడిగా ఉండటం
– నిద్రలోనూ విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి మెళకువ రావటం
– దినచర్యల్లో అనూహ్యంగా చిరాకు, కోపం, అసహనం
– గుండె దడ రావటం, వేగంగా కొట్టుకోవటం
క్రమం తప్పిందా?
మెనోపాజ్‌కు ఒకటి లేదా రెండేళ్ల ముందు నుంచే నెలసరి క్రమం తప్పుతుండటాన్ని గమనించొచ్చు. త్వరగానూ, ఆలస్యంగా రెండు, మూడు నెలలకొకసారి వస్తూ ఉంటుంది. రక్తస్రావం కూడా మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా అస్తవ్యస్తంగా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి రెండు, మూడు నెలల పాటు ఏకధాటిగా రాకపోతే గర్భం వచ్చిందని కొంతమంది భయపడుతుంటారు. ఇలాంటి ఏమైనా తేడాలున్నప్పుడు డాక్టరును సంప్రదించి సూచనలు పాటించటం మేలు.
మూత్ర వ్యవస్థపై తీవ్ర ప్రభావం
మెనోపాజ్ ప్రభావం మూత్ర వ్యవస్థ, జననేంద్రియాలపైన కూడా పడుతుంది. దీనికిముందు వరకు యోని, మూత్రనాళం, మూత్రకోశాల్లో ఈస్ట్రోజెన్ రిసెప్టర్లు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అప్పుడు ఆ కణజాలం బలహీనమై, పొడిబారిపోతుంది. అదే అసౌకర్యానికి, మంటకు దారితీస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి వంటివి సాధారణంగా వస్తుంటాయి. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవటం, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గటం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఎముక లోపల కాల్షియం, విటమిన్ డి నిల్వలు తగ్గి అవి బలహీనంగా మారతాయి. క్రమంగా ఎముకలు గుల్లబారి మెత్తగా తయారవుతాయి. ఒళ్లంతా నొప్పులుగా అనిపించటం, చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు కావటం లాంటివి ఆస్టియోపొరోసిస్‌ను సూచిస్తాయి. ఎముకల సాంద్రత తగ్గకుండా ఈస్ట్రోజెన్‌తోపాటు క్యాల్షియం, విటమిన్ డి తీసుకోవాలి. ఎముకల బలాన్ని పెంచే మందులను డాక్టరు సలహా మేరకు వాడాలి.
మెనోపాజ్ … జాగ్రత్తలు అవసరం
మెనోపాజ్ దశలో అజాగ్రత్తగా ఉంటే ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈస్ట్రోజెన్‌కి నాడీ వ్యవస్థను కాపాడే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ స్థాయి తగ్గుతుందో సమస్య మొదలవుతుంది. కండరాలు కూడా బలహీనమైపోతాయి. స్త్రీలలో గుండెపోటు చాలా అరుదుగా కనిపిస్తుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులతోపాటు స్త్రీలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మోనోపాజ్‌కు ముందు వరకూ ఈస్ట్రోజెన్ గుండెను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాబైఏళ్లు దాటిన తర్వాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వల్ల అవి సన్నగా మారిపోతాయి. ఈ దశలోని మహిళలు అసహనంతో ఉంటుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులు వారితో సంమయనంగా వ్యవహరించాలి.
క్రమబద్ధమైన జీవితం.. పౌష్టికాహారం
ఈ దశలోని మహిళలు కచ్చితంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం అరగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. విటమిన్ డి అందుతుంది. కాల్షియం పెంచే డ్రైఫ్రూట్స్, ఆహార పదార్థాలను తీసుకోవాలి. శరీరానికి అవసరమైన నిద్రను పోవాలి. ఒత్తిడి లేని క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి. సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయాన్ని తగ్గించుకుని శారీరక శ్రమను పెంచుకోవాలి. ధ్యానానికి ఎంతోకొంత సమయాన్ని కేటాయించటం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడిపేందుకు ప్రయత్నించాలి. అతి ఆలోచనలు, ఒత్తిడులను క్రమంగా తగ్గించుకోవాలి. శరీరానికి పౌష్టికాహారాన్ని అందించేలా సోయా చిక్కుడు, చిక్కుడు, గుడ్లు, చేపలు తినాలి. మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవటం ఎంతో శ్రేయస్కరం. కప్పు పాలతో డ్రైఫ్రూట్స్ అన్నీ కాకుండా రోజుకొక రకాన్ని తీసుకోవటం మంచిది. వంటల్లో నూనెల వినియోగాన్ని బాగా తగ్గించుకోవాలి. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి. 5 నుంచి 6 గ్లాసుల వరకూ మంచినీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరినీరు, ఫ్రూట్‌జ్యూస్ వంటివి తీసుకోవాలి.
– డాక్టర్ కోలా విజయకుమారి,
ఎండి (ఆయుర్వేదం)
ప్రసూతి స్త్రీ రోగ విభాగం అధిపతి,
డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి,
విజయవాడ.
94901 06269.