జీవిత పాఠాల తొలి గురువు అమ్మ

May 11,2025 03:04 #'Amma', #Jeevana Stories, #mother

అమితమైన ప్రేమ.
అంతులేని అనురాగం..
అలుపెరగని ఓర్పు…
అద్భుతమైన స్నేహం….
అపురూపమైన కావ్యం…..
అరుదైన రూపం అమ్మ……
అమ్మ.. పేరులోని ప్రేమని… పిలుపులోని మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ప్రేమను వర్ణించటం సామాన్యం కాదు. ఆమె త్యాగం అనన్యసామాన్యం. అందుకే ‘అమ్మలేకపోతే జననం లేదు.. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు’ కంటిపాపలా కాపాడే ప్రతి బిడ్డకీ జన్మనిచ్చిన అమ్మలకు మదర్స్‌ డే శుభాకాంక్షలు.

పాఠ్య పుస్తకాల్లో పాఠాలను టీచర్లు నేర్పితే.. జీవిత పాఠాలను నేర్పేది మాత్రం అమ్మే. అందుకే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మే తొలి గురువు. బాల్యంలో పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ… అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ… ఆమె చేస్తున్న ప్రతి పనీ గమనిస్తూ ఉంటారు. తామూ ఆ పని చేయాలని ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. బిడ్డ ఆసక్తి గమనించి గురువులా నేర్పుతుంది. అప్పుడే మనకు తెలియకుండానే ఆమె తొలిగురువైంది. వేలు పట్టుకుని నడక నేర్పుతుంది. చంక నెత్తుకుని లోకాన్ని చూపుతుంది. అమ్మ.. అత్త.. మామ.. తాత.. అంటూ మాటలు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి తల్లీ చిన్ననాటి నుంచి తమ బిడ్డ మానసిక పరిజ్ఞానానికి బాటలు వేస్తుంది. మనుషులను, పరిసరాలను, జీవితాలను.. అన్నింటినీ, అందరినీ చదవటం నేర్పిస్తుంది.

పెంపకంలో మార్పులు
పిల్లలు ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్లతోనే చూస్తారు. తల్లిని అనుకరిస్తూ.. అమ్మ ఎటు వెళ్తే అటు వెళ్లాలని తొలి అడుగులు వేస్తారు. అలా బిడ్డల మొదటి ప్రయత్నానికి అమ్మే తొలి గురువు. తన ఒడిలో కూర్చోబెట్టుకుని… బిడ్డ తొలి పలుకులకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. బాల్యంలో ఎన్నో కొత్త విషయాలు ప్రయత్నించే క్రమంలో ఎదురుదెబ్బలు తగలటం సహజం. అలా అని అక్కడే ఆగిపోనీయకుండా జీవితంపై ఆశ కల్పిస్తూ ధైర్యం చెబుతుంది. కిందపడిన ప్రతిసారీ లేచి నడవమని ప్రోత్సహిస్తుంది. చేయిపట్టుకుని నడక నేర్పిస్తుంది. పెద్దయ్యేంతవరకూ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బలమైన వ్యక్తిగా మార్చేందుకు నిరంతరం కృషిచేస్తుంది. ఈ క్రమంలో తన జీవితంలో ఎన్నో త్యాగాలకు సిద్ధపడుతుంది. కుటుంబం, సమాజం, వృత్తి, ఉద్యోగుల్లో ఉండే అమ్మలు ఆయా విభాగాల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొంటూనే ధైర్యంగా తమ పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదిరాళ్లు వేస్తున్నారు. ఇప్పుడు అంతా చిన్న కుటుంబాలుగా మారిపోవటంతో వృత్తి, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే పిల్లల పెంపకాన్ని ఎంచక్కా బాధ్యతగా నెరవేరుస్తున్నారు.

మంచిబుద్ధులు నేర్పుతూ..
పిల్లలకు ఊహ తెలిసే సమయంలో చిన్న చిన్న కథలు, చందమామ కథలు, రాజుల కథలు, హాస్య కథలు వంటివి చెబుతూ వాటి నుంచి మంచీ చెడూ తారతమ్యాలను బోధిస్తుంటారు. అన్నం తినకపోయినా, అల్లరి చేసినా, అలిగినా, ఏడ్చినా, సామ దాన బేధ దండోపాయాలతో బిడ్డను దారిలో పెడుతుంది. ఇంకాస్త మొరాయిస్తే రెండు దెబ్బలు తగిలిస్తుంది. ఇంటికి అతిథులు, బంధువులు, ఇతరుల వచ్చిన సమయంలో ఎలా మసులుకోవాలో చెబుతుంది. క్రమశిక్షణను నేర్పిస్తుంది. మంచి పద్ధతులు ఒంటబట్టేలా చేస్తుంది. బంధువులు, ఇరుగుపొరుగు వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలు, గౌరవాన్ని చూపిస్తూ బంధాలను తెలియజేస్తూ పాటించేలా చూస్తుంది.

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ
చిన్నప్పుడు ఆటలు, పాటలు, పరిగెత్తినప్పుడు దెబ్బతగలగానే బిడ్డ నోటి నుంచి వచ్చే తొలిపదం ‘అమ్మా!’ అనే. అలాగే స్నేహితులతో గొడవొస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాధ చెప్పుకునేది అమ్మతోనే. ఎందుకంటే అమ్మే… న్యాయమూర్తిలా మారి ఎవరిది తప్పో చెప్పి పిల్లల కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించి, స్నేహం చెదరనీయకుండా చేసే నేర్పరి. ప్రతి విషయాన్నీ అవతలివాళ్ల వైపు నుంచి కూడా చూడాలంటుంది. శత్రువుల కన్నా స్నేహితులే మిన్న అంటూ కలుపుకుపోయే స్వభావాన్ని అలవరుస్తుంది. మంచిపనిచేశామని చెబితే మెచ్చుకుంటూ.. ముద్దుతో తొలి కానుక ఇస్తూ, ఇష్టమైనది వండిపెట్టి ప్రోత్సహించేది కూడా అమ్మే. స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లల దగ్గర కూర్చొని ఓ గైడ్‌లా హోంవర్క్‌ చేయిస్తుంది. మార్కులు తక్కువొస్తే ‘తర్వాత మంచిగా ప్రయత్నించు’ అని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. నిరుత్సాహపడితే చేయి అందించి నిలబెడుతుంది. తప్పుదారిలో నడిస్తే.. కఠినమైన స్వరంతో మందలిస్తుంది. భవిష్యత్తులో మంచిబాటలో నడిచేలా పునాదులు వేస్తుంది. చిన్న చిన్న విషయాలకు భయపడుతున్న సందర్భాల్లో గుండెలకు హత్తుకుని ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.

స్నేహితురాలిగా …
పిల్లలు యుక్త వయస్సులో అమ్మే స్నేహితురాలిగా మారి అర్థం చేసుకుంటుంది. మనసు బాగోనప్పుడు మంచి మాటలు చెప్పి ఓదార్చుతుంది. ధైర్యాన్నిస్తుంది. సామాజిక, మానవతా విలువలకు దారిచూపుతుంది. లక్ష్య సాధనకు పట్టుదలే తొలిమెట్టు అని నేర్పిస్తుంది. పెళ్లయినా జీవితంలో ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది అమ్మే. అమ్మతో మాట్లాడాక ఇచ్చిన సలహాకి మన ఆలోచన జోడిస్తే పరిష్కారం కనబడుతుంది. ఎలా ముందుకెళ్లాలో బోధ పడుతుంది. పెద్దయ్యామనీ, జీవితంలో స్థిరపడ్డామనీ, పెళ్లి పేరుతో వేరు కుటుంబంలో ఉంటున్నామనీ కనిపెంచిన అమ్మనాన్నలను దూరం పెట్టొద్దు. వారిని కంటికి రెప్పలా కాపాడుదాం. వృద్ధాప్యంలో వారికి చేదోడు వాదోడుగా నిలిచి అమ్మ రుణాన్ని తీర్చుకుందాం. తమ బిడ్డల జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న అమ్మలకు అభినందనలు.

➡️