చిలకల రాజ్యంలో హరితం అనే పిల్ల చిలుక తల్లితో కలిసి ఉండేది. హరితం చిన్నది కాబట్టి ఎక్కడికీ ఒంటరిగా వెళ్లొద్దని తల్లి చిలుక చెప్పేది. హరితానికి మాత్రం ఆకాశంలో ఎగురుతూ, ప్రపంచాన్ని చూడాలని కోరిక ఉండేది.
ఒకసారి తల్లి ఆహారం కోసం వెళ్లినప్పుడు హరితానికి ఆకాశంలో ఎగిరి రావాలన్న బుద్ధి పుట్టింది. అనుకున్న వెంటనే చెట్టు మీద నుంచి ఎగురుతూ వెళ్లింది. వాళ్లుండే అడవి దాటగానే పెద్ద పర్వతం కనబడితే అక్కడకు వెళ్లింది. దగ్గరలో కనబడిన పెద్ద నది మీదుగా ఎగిరింది. ఎగురుకుంటూ ప్రకృతిని చూస్తుంటే దానికెంతో సంతోషం కలిగింది. అలా చాలా సేపు ఎక్కడెక్కడో ఎగిరింది హరితం. ఇన్నాళ్లూ గొప్ప అందాలను చూడకుండా ఆపేసిన తల్లి మీద హరితానికి కోపం వచ్చింది కూడా.
అలా చాలా సేపు ఎగిరిన హరితానికి క్రమంగా రెక్కల్లో సత్తువ తగ్గి, నొప్పి మొదలైంది. రెక్కలు కదపలేకపోవడంతో గాలి వాటున కిందకు పడిపోసాగింది. అలా జారిపోతూ చుట్టూ చూస్తుంటే మేఘాలు తప్ప దారి కనబడలేదు. దానికి భయం వేసింది.
‘ఒక్కత్తనే వెళ్ళొద్దని అమ్మ చెప్పినా వినకుండా వచ్చి ప్రమాదంలో పడ్డాను. తిరిగి ఇంటికి వెళ్లగలనో లేదో’ అనుకుంది. దానికి ఏడుపు వచ్చింది. అంతలో మరో పెద్ద పక్షి ఎదురుగా వస్తూ హరితాన్ని చూసింది. పడిపోతున్న హరితాన్ని పట్టుకుని తన మీద కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మ నాకు తెలుసు. అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను. భయపడకుండా నా మీద కూర్చో. చిన్నపిల్లవే కదా. ఒక్కత్తివే ఎక్కడి కెళ్ళావు?’ అని అడిగిందా పక్షి.
జరిగిందంతా చెప్పింది హరితం. ‘అమ్మకి చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. నేను కాబట్టి సరిపోయింది. మరేదైనా పక్షికో, జంతువుకో దొరికితే నిన్ను కొరుక్కు తినేసేవి. ఇంకెప్పుడూ అమ్మకి తెలియకుండా ఎక్కడికీ వెళ్లకు’ అంది. హరితాన్ని క్షేమంగా తల్లి దగ్గరకు చేర్చి వెళ్లిపోయిందా పక్షి.
అమ్మని చూడగానే హరితానికి ఏడుపొచ్చింది. తల్లి చిలుక కూడా పిల్లకేమైందో అని బెంగపడుతూనే ఉంది. అది కూడా పిల్ల చిలుకని చూసి ఏడ్చి రెక్కల్లో పొదువుకుంది. అమ్మ స్పర్శ తగలగానే హరితానికి భయం పోయి హాయిగా అనిపించింది.
పెద్దల మాట వినకపోతే ప్రమాదంలో పడతామని పిల్ల చిలుకకి అప్పుడు తెలిసొచ్చింది. అప్పటి నుంచి అమ్మ చెప్పినట్టే చేసేది హరితం.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు,
94907 99203.