ఆటంకాలెన్నున్నా ఆటల్లో మేటి!

‘విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు.. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు..’ అంటూ పెద్దలు చెప్పిన సూక్తి ఈ సిక్కోలు
యువకెరటానికి వర్తిస్తుంది.

ఆ యువకుడిది నిరుపేద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు… వికలాంగుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటల్లో రాణించటం అంత సులువేమీ కాదు. కానీ, ఎంతో కఠోర శ్రమతో అతడు సాధించాడు. ఆ విజయం వెనుక నిరంతర శ్రమ… అనేక త్యాగాలు.. ఎన్నో కట్టుదిట్టమైన నిర్ణయాలు దాగున్నాయి. అనేక అడ్డంకులను అధిగమనించి వాలీబాల్‌, బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో ఈ సిక్కోలు యువకుడు ఉప్పెనలా దూసుకొచ్చాడు. అతడే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి వెంకట రమణ. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ పారా బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
వెంకటరమణ తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి మత్స్యకారులు. చేపలవేటే వీరి జీవనాధారం. చిన్నతనంలో పోలియో బారిన పడటంతో వెంకట రమణ కుడికాలు వంకరపోయింది. అయినప్పటికీ ఆటలపై మక్కువతో చిన్నప్పటినుంచీ అలుపెరగని సాధన చేశాడు. ఇంటర్‌ చదువు పూర్తి కాగానే డీపీఈడీ చేసి వ్యాయామోపాధ్యాయుడిగా ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలని తపన పడ్డారు. క్రికెట్‌, వాలీబాల్‌, రన్నింగ్‌ క్రీడల్లో చాలా నైపుణ్యం సంపాదించాడు. ప్రాథమిక పాఠశాల దశ నుంచే ఆటలపై ఇష్టంతో వాటిలో ప్రావీణ్యం కోసం నిరంతరం శ్రమించాడు. ప్రస్తుతం రణస్థలం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ వాలీబాల్‌ శిక్షకుడు కళ్లేపల్లి హరికృష్ణ వద్ద శిక్షణ పొందాడు. మెళకువలను నేర్చుకుని పట్టు సాధించారు. ప్రపంచ పారా బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మే 28 నుంచి జూన్‌ ఐదో తేదీ వరకూ చైనాలో జరిగిన పోటీల్లో భారత్‌ జట్టు ద్వితీయ స్థానంలో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు పారా ఒలింపిక్స్‌, పారా సూపర్‌ సిక్స్‌ వాలీబాల్‌ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు.

జాతీయ పోటీల్లో రాణింపు

  •  విశాఖపట్టణంలో జరిగిన పారా సిటింగ్‌ వాలీబాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో వెంకట రమణ పాల్గొన్న జట్టు ద్వితీయ స్థానం సాధించింది.
  •  డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం తరపున సౌత్‌ ఇండియా యూనివర్శిటీ వాలీబాల్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు.
  •  సకలాంగులతో రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో ద్వితీయస్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
  •  విశాఖపట్టణంలో నిర్వహించిన పారా రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో 100 మీటర్లు ఫ్రైస్టైల్‌, 50 మీటర్లు బ్యాక్‌ స్ట్రోక్‌ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు.
  •  రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్‌లో 100 మీటర్లు, జావెలిన్‌ త్రో క్రీడాంశాల్లో తృతీయ స్థానం పొందాడు.

అప్పు చేసి .. చైనాకు
చైనాలో జరిగే పోటీలకు ఎంపికైనా అక్కడికి వెళ్లటానికి వెంకట రమణ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.3 లక్షలు అప్పు తెచ్చారు. చైనాలో జరిగిన పోటీలకు వెళ్లి రావటానికి రూ.3 లక్షల వరకూ ఖర్చయ్యింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం అందలేదు. పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేక అప్పుచేసి పోటీలకు తల్లిదండ్రులు పంపించారు. అక్కడకు వెళ్లిన వెంకట రమణ సత్తా చాటాడు. వాస్తవంగా 2023 పోటీల్లోనే పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులే తరుముకొచ్చాయి. అందుకే వెళ్లలేదు. ఈ ఏడాది తల్లిదండ్రులు తలతాకట్టు పెట్టయినా పంపిస్తామని చెప్పి డబ్బులు పోగుచేయటంతో వెళ్లాడు.

ప్రోత్సాహం లేక…
ప్రోత్సాహం లేక రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎందరో నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి రావటం లేదు. ఆర్థిక కష్టాలు వేధిస్తుండటంతో పలువురు అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. అలాంటి వారికి దాతలు, ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే దేశం తలెత్తుకునేలా విజయాలు సాధిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.

పతకాలు సాధిస్తా : మైలపల్లి వెంకటరమణ
నా జీవితంలో పేదరికం కారణంగా అనేక అవకాశాలను కోల్పోయాను. నా తల్లిదండ్రులు నాపై ఉన్న నమ్మకంతో చైనాలో పోటీలకు వెళ్లాను. ఆత్మవిశ్వాసంతో జట్టుగా విజయాన్ని సాధించాం. కళ్లేపల్లి హరికృష్ణ నాకు మంచి శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశానికి మరిన్ని పతకాలను తీసుకురావటానికి కృషిచేస్తా.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️