హాస్యం పేరుతో అవహేళన వద్దు..

హాస్యం.. మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి. కొంత పాజిటివిటీని పెంచాలి. అంతేగాని ఎబ్బెట్టుగా ఉండడం, వెగటు పుట్టించడం చేయకూడదు. ఎదుటి వారిని దూషిస్తేనో, దుర్భాషలాడితేనో హాస్యం పుట్టదు. కానీ నేటి సినిమాల్లో హాస్యం పేరుతో హద్దులు దాటుతున్నారు. ద్వంద్వార్థాలు, బాడీ షేమింగ్‌ చేయడం, లావు, సన్నం, నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు ఇలా ఒకటా రెండా.. వీటన్నింటితో పాటు హాస్యం పండించేందుకు వైకల్యబాధితులను కించపర్చడం, వైకల్యాన్ని అపహాస్యంగా చూపించడం ఎప్పటి నుండో చేస్తున్నారు. అయితే ఇదంతా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ, ఆయా సినిమాలకు క్లీన్‌ చీట్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు అధికారులు. ఈ ధోరణికి చెంపపెట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. హాస్యం పేరుతో వైకల్యబాధితులను కించపర్చడం సబబు కాదని హెచ్చరించింది.

సినిమా ప్రభావంత మాధ్యమం. సమాజాన్ని చైతన్యం చేయడంలో సినిమాకి ప్రత్యేకమైన స్థానం. అటువంటి సినిమాల్లో ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే విషయాలు ప్రముఖంగా చర్చించాలి. కానీ మనకు తెలిసిన, చూసిన ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా హాస్యప్రధాన చిత్రాల్లో బాడీషేమింగ్‌ చేస్తూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. ‘కితకితలు’ సినిమాలో కథానాయిక అధికబరువుని హాస్యానికి ప్రధాన వనరుగా ఉపయోగించారు. పెళ్లిచూపుల నుండి పెళ్లి తంతు, ఆపై సినిమా ఆద్యంతం, ఆ పాత్రపై హీరో నరేష్‌, క్యారక్టర్‌ ఆర్టిస్టు కృష్ణ భగవాన్‌ ఎన్నో సెటైర్లు, విమర్శలు చేస్తారు. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘జీరో సైజ్‌’ సినిమాలో కూడా ఆమె అధికబరువుని అపహాస్యం చేసే పాత్రలు తన చుట్టూ కనపడతాయి. ఇక అల్లరి నరేష్‌ ‘లడ్డు బాబు’ చిత్రంలోనైతే చిన్న పిల్లలతో ఆ పాత్రను గేలి చేయడం, అవమానించడం చూపిస్తారు. ఇలా బాడీ షేమింగ్‌ గురించి ఆయా సినిమాల్లో హాస్యం పేరుతో వెగటు పుట్టించారు. పిల్లలతో ఆ పాత్రలను ఏడింపించడం చూస్తుంటే ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు.

అంతేకాదు, కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిన ప్రతి సినిమాలో ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరిని నల్లగానో, పొట్టిగానో చూపించి, ఆ పాత్ర చుట్టూ హాస్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బంతి, బాలు, నల్లోడు, పొట్టోడు, సోడా కళ్లోడు ఇలా ఒకటి, రెండు కాదు, సవాలక్ష పేర్లతో ఆయా వ్యక్తులను పిలిపిస్తారు. ‘స్టాలిన్‌’ చిత్రంలో సునీల్‌ పాత్రతో ఆ ప్రయోగమే చేశారు. శరీరాన్ని, రంగుని ఎద్దేవచేస్తూ హాస్యం పుట్టించే ప్రయత్నం చేశారు. ‘ఎవడిగోల వాడిదే’ సినిమాలో కొన్ని పాత్రలను వాళ్ల ఒంటితీరుని బట్టి పిలుస్తూ అవమానించేలా సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి పాత్రలు సినిమాల్లో అనేకం. ఈ ప్రయోగాలు వెగటు పుట్టిస్తాయే కానీ హాస్యాన్ని పండించవు.

అలాగే వైకల్యబాధితుల వైకల్యాన్ని ఎత్తి చూపడం, వైకల్యం పేరుతో కించపరుస్తూ మాట్లాడడం కూడా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అగ్ర కథానాయకుడు వైకల్య పాత్రల్లో నటిస్తే ఒకింత తక్కువగా, చిన్న చిన్న ఆర్టిస్టులతో ఆ పాత్రలు వేయిస్తే అత్యంత జుగుప్సగా సంభాషణలు రాస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌చరణ్‌ చెవిటి పాత్ర, ‘ఊపిరి’ సినిమాలో చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రలో నాగార్జున, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో రవితేజ, ‘నీవెవరో’ చిత్రంలో ఆదిపినిశెట్టి, ‘అంధగాడు’ చిత్రంలో రాజ్‌తరుణ్‌ని అంధ పాత్రల్లో చూపించినప్పుడు హీరోయిజంగా ఈ పాత్రలను తీర్చిదిద్దారు. అదే చిన్న చిన్న ఆర్టిస్టులు ఆ పాత్రలు చేసినప్పుడు వైకల్యాన్ని ఎత్తి చూపుతూ సంభాషణలు రాస్తారు. ఎత్తు తక్కువగా ఉండే సునీల్‌శెట్టి, వేణుమాధవ్‌, వీరయ్య, బొద్దుగా ఉండే విద్యుల్లేఖ, గీతాసింగ్‌, కళ్లు చిదంబరం, ఐరన్‌ లెగ్‌ శాస్త్రి, కల్పనారారు తదితరులను ఆయా పాత్రల్లో చూపించినప్పుడు చాలా హేయమైన హాస్యాన్ని చిత్రీకరించారు.

ఇంకా కాళ్లు, చేతులు లేని పాత్రలను సినిమాల్లో చూపించేటప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉన్నట్లు చిత్రీకరిస్తారు. కర్ర సాయంతో నడిచే పాత్రలు, చేతుల్లేని వ్యక్తులు, మంచానికే పరిమితమైన వారిపై చిత్రీకరించే సన్నివేశాలు చాలా హృద్యంగా చూపిస్తారు. వైకల్య బాధితులు అంటే హేళన చేయడానికో, జాలి చూపించడానికో అన్నట్లుగా ఆయా పాత్రలు ఉంటాయి. దీనిపైనే ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.

ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అవగాహన ఉండాలని చెప్పింది. వైకల్య బాధితుల వైద్య పరిస్థితిని వాస్తవాలకు దగ్గరగా చూపించాలని, వక్రీకరించకూడదని స్పష్టం చేసింది. వైకల్యబాధితులపై చిత్రించే సన్నివేశాల్లో వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించాలని సూచించింది. వైకల్య బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను మాత్రమే కాక, వారు సాధించిన విజయాలు, ప్రతిభ, సమాజానికి, దేశానికి వారు చేసిన సేవను చూపించాలని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పుడే ఎందుకు? ఏమని? స్పందించారు..
2023లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘ఆంఖ్‌ మిచోలి’లో కొన్ని సన్నివేశాలు వైకల్యబాధితులను కించపర్చేలా ఉన్నాయని, నిపున్‌ మల్హోత్రా అనే వైకల్యబాధిత కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ‘సినిమాల్లో పాత్రలను సృష్టించే సమయంలోనే రూపకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. వైకల్యబాధితులను ఉద్దేశిస్తూ మాట్లాడే భాష విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల’ని సూచించింది. మందబుద్ది, వికలాంగుడు వంటి పదాలను వాడకూడదని చెప్పింది. వైకల్యబాధితులపై సన్నివేశాలు చిత్రించేటప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలే కాకుండా, వారి ప్రతిభ, విజయం, సమాజానికి చేసే సేవలను చూపించాలి. ఆయా మాధ్యమాల్లో వైకల్యం ఉన్న వ్యక్తులను కించపరిచే, అగౌరపరిచేలా హాస్యం ఉండకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, అవయవాలు సరిగ్గా ఎదగని, మానసిక ఆరోగ్యం కోల్పోయిన వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది. వారు సాధించిన ఎన్నో విజయాలు చూస్తున్నాం. అయినా సినిమా వంటి మాధ్యమాల్లో వారిని, వారి స్థితిని అవమానించి చూపడం, తక్కువ చేసి చెప్పడం ఆమోదయోగ్యం కాదు. దేశం యావత్‌ ఈ తీర్పుపై చర్చించేలా, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో వెలువడిన ఈ తీర్పు స్వాగతించదగ్గది.

➡️