కనువిప్పు

Nov 28,2024 03:18 #feachers, #Jeevana Stories, #katha

సింగన్నదొరపాలెం గ్రామంలో శీనయ్య అనే ఆసామి నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తెలుపు, నలుపు రంగుల్లో ఉండే రెండు కోడిపుంజులు కూడా అతని దగ్గర ఉన్నాయి. నల్ల కోడిపుంజుకి శీనయ్య అంటే ఎంతో ఇష్టం. రోజూ శీనయ్య మంచం దగ్గర పడుకునేది. తెల్లారేసరికి కొక్కొరోకొ అంటూ శీనయ్యను నిద్రలేపేది.
ఒకరోజు గ్రామదేవత కోటమ్మ తల్లి మొక్కు విషయం శీనయ్యకు గుర్తుకు వచ్చింది. ఆ తరువాత ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టి నల్ల కోడిపుంజును పట్టుకుని సైకిలుపై కోటమ్మ తల్లి గుడికి బయలు దేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఛాతీలో నొప్పిరావడంతో సైకిల్‌ అదుపు తప్పి తుప్పల్లో పడిపోయాడు. వంటిమీద తెలివి లేదు. కోడిపుంజు శీనయ్య దగ్గరికి వచ్చి చూసింది, అరిచింది అయినా కదలక పోయేసరికి రోడ్డు మీద నిలబడి కొక్కొరోకో అంటూ ఏకధాటిగా అరవసాగింది. దారంట పోతున్నవారు విని ‘ఇది శీనయ్య కోడిపుంజులా ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది?’ అనుకుంటూ దగ్గరికి వెళ్లి చూశారు. తుప్పల్లో తెలివి తప్పి పడివున్న శీనయ్య వాళ్లకి కనిపించాడు. వాళ్లంతా కలసి శీనయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కోడిపుంజు కూడా వదలకుండా వాళ్ల వెంటే వెళ్ళింది. వైద్యుడు చికిత్స ప్రారంభించి ‘మీరు సకాలంలో తీసుకురాబట్టి ఇతడికి ప్రాణాపాయం తప్పింది’ అన్నాడు.
కాసేపటికి శీనయ్యకు తెలివి వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా కిటికీలో నల్ల కోడిపుంజు మసగ్గా కనిపించింది. ‘మొక్కుబడి పేరుతో నిన్ను బలి ఇవ్వాలి అనుకున్నాను. కానీ నువ్వు అమితమైన ప్రేమతో నన్ను బతికించావు. నువ్వు మూగజీవివి, నేను మూర్ఖుడిని’ అని తల్చు కుంటూ కుమిలిపోయాడు. అతడి కళ్లంట నీళ్ళు ధారాపాతంగా కారాయి. అతడి ఆరోగ్యం కుదుట పడటంతో మర్నాడు శీనయ్యను ఇంటికి తీసుకు వచ్చారు. ఆ రోజు తరువాత శీనయ్య ఇంకెప్పుడూ మొక్కుబడి గురించి ఆలోచించలేదు. కోడి పుంజులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️