సీసాల్లో మొక్కలు

Apr 14,2025 05:57 #feachers, #jeevana, #Plants in bottles

ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులతో ఫ్యాను వేసుకోవాలంటే భయం. కరెంటు బిల్లుతో ఏసీ ఆన్‌ చేయాలంటే గుబులు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు పెంచుకుంటే భలే ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అయితే నగరాల్లో అంత స్థలమున్న ఇళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. మిద్దె తోట పెంచేవాళ్లని పక్కని పెడితే చిన్న చిన్న సందుల్లో, ఇరుకు గదుల్లో ఉండే వాళ్లకి అసలు మొక్కలు పెంచే అవకాశం లేదా? అంటే ఉంది అని చెప్పొచ్చు. ఈ వేసవిలోనే ఎంచక్కా మీ ఇంట్లో ఇలా ప్రయత్నించండి. ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.
ఇంట్లో వాడిపారేసిన ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు మీ ఇంటి తోటకి బాగా ఉపయోగపడతాయి. వీటి కోసం ప్రత్యేకంగా స్థలం అవసరం లేదు. ఇంట్లో గోడకి కాస్త ఎండతగిలేలా ఉన్న చోట పెట్టుకుంటే చాలు. ఆ వెసులుబాటు కూడా లేకపోతే అడ్డంగా ఒక కర్రకి వ్రేలాడదీసుకోవచ్చు.
గోడకి లేదా కర్రకి మీకు నచ్చిన పద్ధతిలో వీటిని అమర్చుకొని ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు వంటి వాటిని చక్కగా పెంచుకోవచ్చు.
ముందుగా వాటర్‌ బాటిళ్లని శుభ్రంగా కడగాలి. వాటిపై ఉన్న లేబుళ్లను కూడా తీసేయాలి. బాటిల్‌ని అడ్డంగా పడుకోబెట్టి ఒక వైపు కాస్తంత వెడల్పులో దీర్ఘచతురస్రాకారంగా కత్తిరించుకోవాలి. రెండవ భాగంలో మేకును వేడి చేసి చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి.
ఇలా తయారుచేసుకున్న సీసాలను తాళ్లతో గట్టిగా రెండుపక్కలా పట్టివుంచేలా కట్టుకోవాలి. అన్ని సీసాలు ఇలానే సిద్ధం చేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన తీరుగా గోడకి లేదా కర్రకి సెట్‌ చేసుకోవాలి. తాళ్లని బలంగా కట్టడం మాత్రం మర్చిపోవద్దు.
ఇప్పుడు ఈ సీసాల్లో మట్టి పోయాలి. కాసిన్ని నీళ్లు పోసి మట్టిని తడపాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదని గుర్తుంచుకోవాలి. ఈ మట్టిలో విత్తనాలు వేసి, రోజుకు 3 లేదా 4 గంటలు సూర్యరశ్మి పడేలా చూడాలి.
ఇలా చేస్తే కొన్ని రోజులకే విత్తనాలు మొలకెత్తుతాయి. అందమైన పచ్చని తోట తయారవుతుంది. మొక్కలపై నుండి వచ్చే గాలి వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. సెలవుల్లో ఇంటికే పరిమితమైన పిల్లలకు ఈ మొక్కల సంరక్షణ అప్పగించి చూడండి. పిల్లల్లో వచ్చిన మార్పు గమనించండి. ఒకే దెబ్బకి రెండు ప్రయోజనాలు అంటే ఇదేమరి!

➡️