రేగుచెట్టు స్నేహం

Mar 14,2024 08:00 #feature, #jeevana

సలిల ఆ రోజే ఆ స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరింది. వాళ్ల నాన్నగారికి ఆ ఊరికి బదిలీ కావడంతో ఆ ఊరు వచ్చి మూడు రోజులే అయ్యింది. స్కూలు అయిపోయాక ఇంటికెళుతూ ఆమె దృష్టి అనుకోకుండా ఓ ఇంటి వెనకాల వున్న ఒక రేగుచెట్టు మీద పడింది. వత్తుగా ఆకులతో బుజ్జిగా ఇంచుమించు తనంత ఎత్తులోనే వున్న ఆ చెట్టుని చూస్తూనే సలిలకి ఎందుకో చాలా ఇష్టం కలిగింది. దాని దగ్గర ఆగి, దాని ఆకుల్ని వేళ్లతో వీణ తీగెల్ని మీటినట్టు సుతారంగా తాకింది. దానికి ‘బై’ చెప్పి అక్కడి నుండి కదిలింది. ఆ రోజు నుండి ఎంత హడావుడిలో వున్నా కనీసం కళ్లతో అయినా ఆ చెట్టుని పలకరిస్తుంది సలిల.
ఒకసారి చాలా రోజుల నుండి ఎండలు విరగ కాస్తున్నాయి. చాలా మొక్కలు వాడిన ఆకులతో దీనంగా కనిపిస్తున్నాయి. ఓ రోజు సలిల తన స్కూలు బ్యాగులో వున్న నీళ్లసీసాలో తాగగా మిగిలిపోయిన నీళ్లని రేగుచెట్టు మొదట్లో వేసింది. కొన్ని చుక్కల్ని దాని ఆకుల మీద చిలకరించింది. ఆ చెట్టు పులకరించినట్టు చిరుగాలికి చిత్రంగా కదిలింది. దాన్ని చూసి సలిలకి ఎంతో సంతోషం కలిగింది.
రోజు రోజుకి ఆ మొక్క అంటే సలిలకి ఇష్టం పెరిగిపోయింది. సలిలతో పాటు రేగుచెట్టూ ఎదుగుతోంది. ఇప్పుడు సలిల ఇంటర్‌కి వచ్చింది. నాన్నగారు ఆమెని విజయవాడలో ఓ కాలేజీలో చేర్పించారు. చదువు కాలేజీలో. వసతి హాస్టల్‌లో. ఇక వేరే ప్రపంచం లేదు. సలిలకి అప్పుడప్పుడూ రేగుచెట్టు గుర్తుకొచ్చేది. సెలవులకి ఇంటికొచ్చి నప్పుడు, పని గట్టుకుని వెళ్లి కొంతసేపు ఆ చెట్టును చూసి వచ్చేది. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయి. ప్రవేశ పరీక్షలో కూడా మంచి ర్యాంకు వచ్చి ఖరగ్‌పూర్‌ ఐ.ఐ.టి.లో చేరింది సలిల.
ఇప్పుడు చదువు పూర్తి అయ్యి, ఇటలీలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన రూం కిటికీ నుండి చూస్తే ఎన్నో అందమైన చెట్లు కనిపిస్తాయి. కాని తన చిన్ననాటి ఆ ముళ్ల రేగుచెట్టు గుర్తుకొస్తూనే వుంటుంది సలిలకి.
ఓ సంవత్సరం సంక్రాంతి పండక్కి సెలవుపెట్టి ఇంటికొచ్చింది సలిల. స్కూటీని తీసుకొని ‘రైరు’మని రేగుచెట్టు దగ్గరికి వెళ్లిపోయింది. దానితో బోలెడు ఊసులాడింది. చెట్టు నిండా రేగుపళ్లు. కొన్ని కోసుకుని ఇష్టంగా తింది. కొంతసేపయ్యాక వెనుదిరిగింది. అక్కడి నుండి కదిలే లోగా ఆ చెట్టుతో సెల్ఫీ దిగింది. దాన్ని హోమ్‌ స్క్రీన్‌గా పెట్టుకుంది. విదేశంలో తన ఒంటరితనపు దిగులును దాన్ని చూస్తూ జయిస్తుంది. ఆ ఫోటోను చూస్తుంటే ఆమెకు ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. అమ్మా, నాన్నలతో స్వంత ఊళ్లో ఉన్నట్టు అనిపిస్తుంది.

– ఎస్‌. హనుమంతరావు
8897815656

➡️