‘హిందీ పరిశ్రమలోని చాలామంది ప్రభుత్వానికి అమ్ముడు పోయారు. అందుకే వారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడరు. నేను ఏదైనా సూటిగానే మాట్లాడతా. రాజకీయ విషయాలపై నా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతుంటా. ఒకవేళ నాతో వర్క్ చేస్తే..భవిష్యత్తులో మాకు సమస్యలు వస్తాయని కొందరు భావించి ఉండొచ్చు. అందుకేనేమో నాకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. అయినా తగ్గేదేమీ లేదు. ఇలాంటివి చాలా పరిస్థితులు చూశా. విషయం ఏదైనా స్పష్టంగా నా గళం విప్పాలనే భావనతో ఉన్నా. ప్రభుత్వం ఏదైనా సరే…చర్చలను అణచివేస్తోంది. మరో విషయం ఏమిటంటే…ఒక విషయంపై మాట్లాడాలా? లేదా? అనేది నటీనటులపై ఆధారపడివుంటుంది. సినిమాల మేకింగ్ విషయంలో వారి కంటూ ఒక అవగాహన ఉండాలి. ఆ సినిమాను విడుదల చేయటానికి కూడా పోరాటం చేయాల్సి వుంటుంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఎందుకు మాట్లాడరంటే…ఇండిస్టీలోని సగంమంది నటీనటులు అమ్ముడుపోయారు. మరికొంతమందికి మాట్లాడే ధైర్యం లేదు. నా మిత్రుడు ఒకరు ఇదే విషయాన్ని చెప్పారు. నీకు ధైర్యం ఉంది. అందుకే నువ్వు మాట్లాడుతున్నావ్..నాకు అంత ధైర్యం లేదు’ అన్నాడు. అతడి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేరాలు చేసిన వారినైనా చరిత్ర వదిలేస్తుందేమో కానీ, మౌనంగా కూర్చున్న వారిని మాత్రం విడిచిపెట్టదు.’ అని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. విషయం ఏదైనా ఆయన దేశ రాజకీయాలపై తరచూ తన అభిప్రాయాలను విస్పష్టంగా ప్రకటిస్తుంటారు. పాలకుల అప్రజాస్వామిక విధానాలపై తన ఎక్స్ వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పై విధంగా మాట్లాడారు.
