వేసవి ఎండలతో అనేక రుగ్మతలు వ్యాపిస్తుండటం సహజం. డీ హైడ్రేషన్ నుంచి ఫుడ్ పాయిజనింగ్ వరకూ కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయి. పరిశుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. తరచుగా చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించటం మర్చిపోవద్దు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటం చాలా అవసరం. వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వివరాలు ఇవిగో …
వడదెబ్బ (సన్‌స్ట్రోక్) : ఎండలో ఇష్టానుసారంగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా, అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చెమట పట్టకపోవటం, కాళ్ళూ చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహకోల్పోవటం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబర్చాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం ఉత్తమం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, గ్లూకోజ్ డి వంటివి తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్ ఫౌడర్ లేదా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి.
విషాహారం (ఫుడ్‌పాయిజనింగ్) : ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు వేసవిలో సాధారణం. ఇవి ఎక్కువగా హానికారక బ్యాక్టీరియా, పరాన్నజీవుల వల్ల వస్తాయి. అధిక వేడికారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే బాగా ఉడికించాలి. వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినటం ముఖ్యం. మసాలాలతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి.
కంటి ఇన్ఫెక్షన్ : ఈ కాలంలో కనిపించే కొన్ని సాధారణ కంటి వ్యాధుల్లో కంటి వాపు, అలెర్జీ, కంజక్టివైటిస్ ఉంటాయి. తగినంత విశ్రాంతి కళ్లకు ఇవ్వాలి. వాటిపై ఒత్తిడి తగ్గించాలి. మీ కళ్ళు, ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి. ఎండలో బయటకు వెళ్తే కళ్లజోడు వాడటం మంచిది. సమస్యలు వస్తే డాక్టరు సిఫారసు మేరకు ఐడ్రాప్స్, మందులు వాడాలి.
చర్మ సమస్యలు : సూర్యుడి అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు, స్వేద గ్రంథులు మూసుకుపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చెమట వల్ల మచ్చలు, దురద మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండా లంటే వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్లు వంటివి కూడా ఉపయోగించొచ్చు. వాడిన దుస్తులను ఉతక్కుండా మళ్లీ వాడకూడదు. చెమట ఎక్కువగా పడుతున్నం దున స్నానం రెండుమూడు సార్లు చేయొచ్చు. శరీరానికి గాలి తగిలేలా వదులైన, చెమట పీల్చే కాటన్ దుస్తులు ధరించటం మేలు.
అతిసార : ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరోచనలు సాధారణం. కలుషిత ఆహారం తినటం, నీరు తాగటం, మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి. అతిసారం నుంచి దూరంగా ఉండటానికి నీటిని మరిగించిన తర్వాత మాత్రమే తాగటం అలవాటుగా చేసుకోవాలి. కూరగాయలను ముక్కలుగా చేయటానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి. ఇళ్లల్లో ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. పాడైనవి కాకుండా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం మేలు.
చికెన్‌పాక్స్ : చికెన్‌పాక్స్ (అమ్మోరు) చాలా సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపురంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లల్లో తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది సోకినప్పుడు బయటకు తిరగకుండా ఇంట్లో ఉండటమే మేలు. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. త్వరగా తగ్గే వీలుంది.
తట్టు : మీజిల్స్ మరో సాధారణ వేసవి వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సో వైరస్ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి. మందులు వాడితే తగ్గిపోతుంది.
కామెర్లు : నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది హైపటైటిస్ ఎ వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషిత మైన ఆహారం, నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది.
టైఫాయిడ్ : జ్వరం వస్తే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసు కోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. కలుషిత ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తికి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్ వస్తే బలహీనత, ఆకలిలేకపోవటం, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
గవదబిళ్ళలు : వేసవి వ్యాధుల్లో గవదబిళ్లలు అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథివాపు, కండరాలనొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి.
తలనొప్పి : అధిక ఉష్ణోగ్రతలతో తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. వేడి వల్ల వచ్చే తలనొప్పి శరీరం వేడికి ప్రతి స్పందించటం వల్ల కూడా వస్తుంది.
పైన పేర్కొన్న వ్యాధులకు అధునాతనమైన మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టరు సలహా మేరకు వాటిని ఉపయోగిస్తే అవి నియంత్రణలోకి వస్తాయి.
ఈ చిట్కాలు పాటించండి
– తరచూ మంచినీరు, నిమ్మకాయ ద్రావణంతోపాటుగా ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి
– నారింజ, దానిమ్మ వంటి పండ్లను తినాలి
– మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లకండి
– క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
సూర్యకాంతికి గురి కావడాన్ని తగ్గించండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం వంటి కార్యక్రమాలను చేయండి.
– కళ్ల సంరక్షణ కోసం కూలింగ్ గ్లాసులు పెట్టుకోవాలి
– లేతరంగు, తేలికైన వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి
– బ్యాక్టీరియాతో ఉండే స్ట్రీట్‌ఫుడ్ తినొద్దు
– ప్యాకింగ్ చేసిన పండ్లు, కూరగాయలు తీసుకోవద్దు
– పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచండి.
– ఆల్కాహాల్, కెఫైన్ తీసుకోవద్దు
– కూల్‌డ్రింక్స్ తాగొద్దు.
– డాక్టర్ జి.అర్చన మాధురి, ఎంబిబిఎస్, ఎండి డివిఎల్, డెర్మటాలజిస్ట్,
కాస్మోటిక్ కేర్ స్పెషలిస్ట్,
విజయవాడ