కుందేలు తెలివి

May 6,2024 04:00 #balala katha, #feachers, #jeevana

అడవిలోని అన్ని జంతువులు కుందేళ్లు మహా తెలివిగలవి అని మెచ్చుకోవడం సింహం చెవిన పడింది. వాటి తెలివి ఏ పాటిదో పరీక్షించాలనుకుని ఓ కుందేలుని తన నివాసానికి రమ్మని కబురు పెట్టింది సింహం. మృగరాజు కబురు వినగానే కుందేలు భయపడిపోయింది. ఎందుకు రమ్మందో అనుకుని సింహం గుహలోకి వెళ్ళింది. ఓ సింహాసనం మీద అది కూర్చొని ఉంది.
కుందేలును చూడగానే సింహం భీకరంగా గర్జించింది. ‘రా నీ తెలివి ఏపాటిదో చూస్తా. ఇప్పుడు నువ్వు ఈ గుహ నుంచి ఎలా తప్పించుకుంటావో చెప్పు’ అని సింహాసనం దిగి, గుహ ద్వారం మూ సివేసింది. కుందేలు బిక్కు బిక్కుమనుకుంటూ ఆలోచనలో పడింది. దాన్ని చూసి సింహం వికటాట్టహాసం చేసింది.
ఒక పక్క భయంతో వణికిపోతున్నా, ఎక్కడా దాన్ని వ్యక్తపరచకుండా నిబ్బరంగా కూర్చొన్న కుందేలు, ‘మృగరాజా నీ గుహ ముందు ఏదో శబ్దం వినపడుతోంది చూశారా?’ అంది. దానికి సింహం నవ్వి ‘నా గుహ ముందు శబ్దమా’ అని అంటుండగా, కుందేలు కల్పించుకుని ‘అదిగో వినపడుతోంది, మీ గర్జన దానితో కలిసిపోయింది. మీ గుహలోకి రావడానికి ఎన్ని గుండెలు ఉండాలి, మీ నవ్వు, మీ గర్జన సామాన్యమా’ అంటూ పొగిడింది. ఆ పొగడ్తకు పొంగి పాయింది సింహం. ‘నా గుహ ముందే శబ్దాలా’ అనుకుంటూ గుహ ద్వారం తెరచింది. దానికోసమే ఎదురుచూస్తున్న కుందేలు గుహ ద్వారం దాటి బయటికి వెళ్లి, ‘ఏ శబ్దాలు లేవు, ఆపద నుండి తప్పించుకునేందుకు నేనే అలా చెప్పాను’ అంటూ తుర్రు మంది.

– కనుమ ఎల్లారెడ్డి, ఆస్టిన్‌, టెక్సస్‌ స్టేట్‌,
అమెరికా, 93915 23027.

➡️