చదువే ప్రధానం

Jun 11,2024 05:33 #feachers, #jeevana, #katha

రాము ఐదో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు రాము స్కూలు నుంచి ఇంటికి వస్తూనే అమ్మ చేతిలో గుప్పెడు చాక్‌పీస్‌లు పోశాడు. వాటిని చూస్తూనే రాము వాళ్ల అమ్మ గట్టిగా కోప్పడింది. ‘నీకు ఇవి ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించింది. దానికి రాము ‘క్లాసుకు వచ్చే ఉపాధ్యాయులు బోర్డు మీద పాఠాలు చెప్పిన తరువాత మిగిలిన చాక్‌పీస్‌లని అక్కడే వదిలేసి వెళ్తార’ని చెప్పాడు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ చాక్‌ పీసులు వదిలేయటం, మా స్నేహితులు పరిగెత్తికెళ్లి వాటిని తీసుకోవటం రోజూ జరుగుతుంది అమ్మా! నేను ఎంత ప్రయత్నించినా ఒక్క చాక్‌ పీసు కూడా ఇప్పటి వరకు దొరకలేదు. నా స్నేహితులే రోజూ తీసుకుంటున్నారు. ఈ రోజే నాకు దొరికాయి. వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి వస్తే.. నువ్వేమో ఇలా తిడుతున్నావు’ అని బుంగమూతి పెట్టాడు.
‘చూడు రాము, ఇదేదో గొప్ప ఘనకార్యం అనుకున్నావా! నువ్వు చేసింది మంచి పని కాదు. చాక్‌ పీసులు సాధించడం గొప్ప కాదు. మంచి మార్కులు సాధించి ఉన్నతంగా నిలవాలి. స్కూలుకి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలి. చాక్‌ పీసుల మీద చూపించే శ్రద్ధ పాఠాలపై చూపించాలి. పిల్లలు చదువులో పోటీపడాలి కానీ చాక్‌ పీసులు సంపాదించటంలో కాదు’ అని తల్లి రాముకి అర్థమయ్యేలా చెప్పింది.
తల్లి మాటలకు రాము ఆలోచనలో పడ్డాడు. ‘అమ్మా! నువ్వు చెప్పింది నిజమే. నేను తప్పు చేశాను. మరెప్పుడూ చాక్‌ పీసులు పట్టుకురాను. చదువుపై దృష్టి పెడతాను. శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఈ విషయం నా స్నేహితులకు కూడా చెబుతాను. వాళ్లల్లో కూడా మార్పు తెస్తాను’ అన్నాడు.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర.
9492309100.

➡️