పశ్చాత్తాపం

Apr 16,2025 03:14

పచ్చాపచ్చని చెట్టు మీద
పిచ్చుకల గుంపు వాలింది
ఆకలితో అవి అలమటిస్తూ
అటు ఇటు ఆబగ చూసాయి

పక్కనేగల వరిచేనును చూసి
పిచ్చుకలెంతో మురిసాయి
నిగనిగలాడే వరి కంకులు చూసి
అవి ఎంతో ముచ్చటపడ్డాయి

చూసిందే తడవుగా పిచ్చుకలు
వరి పైరుపై గుంపుగ వాలాయి
కంకులు కరకర కొరికితింటు
అవి పైరును ధ్వంసం చేశాయి

ధ్వంసమైన వరి పైరును చూసి
రైతు లబోదిబోమని అరిచాడు
పిచ్చుక గుంపును తరిమేసాక
కసితో అతడొక పథకం పన్నాడు

పిచ్చుకల పని పట్టాలనుకుని
వెంటనే ఒక వల తెచ్చాడు
వరి చేను పైన వల పరిచాడు
చెట్టెనుక నక్కి కూర్చున్నాడు

ఎప్పటిలాగే పిచ్చుక లన్నీ
గుంపుగా అక్కడికొచ్చాయి
వలను చూడక సంతోషంతో
ఒక ఉదుటున చేనుపై వాలాయి

వాలిందే తడవుగ పిచ్చుకలు
కొన్ని వలలో చిక్కుకుపోయాయి
భయంతో కొన్ని పిచ్చుకలేమో
పలాయనం చిత్తగించాయి

వలలో చిక్కిన పిచ్చుకల గని
రైతు పరుగున వచ్చాడు
పిచ్చుకలొక్కొక్కటిగా తీసి
ఒక పంజరంలొ బంధించాడు

పంజరంలోని పిచ్చుకలన్నీ
ఆందోళన చెందుతు అరిచాయి
ఏం చేయాలో అర్థం కాక
బావురుమంటూ ఏడ్చాయి

రైతు చేతిలో చావు తప్పదని
ఎంతగానొ చింతించాయి
తమ తప్పును నేరుగ ఒప్పుకొని
రైతును క్షమించమన్నాయి

ఎవరి బాధైన ఒకటేనంటు
రైతు హెచ్చరిక చేసాడు
చేను పాడైన విషయం తెలిపి
బాధతో కన్నీరు కార్చాడు

రైతు బాధ గుర్తించిన పిచ్చుకలు
తమ పొరపాటును గ్రహించాయి
మాట్లాడక మౌనం దాల్చాయి
కడు దీనంగ తలలు దించాయి

పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమని
రైతన్న మనసులో తలచాడు
పిచ్చుకలన్నిటిని ఒక్కొక్కటిగా
పంజరం నుండి వదిలాడు

అపాయం తప్పిన పిచ్చుకలు
ఎంతో సంతసమొందాయి
రైతుకు కృతజ్ఞతలు చెప్పి అవి
తుర్రుమంటు ఎగిరిపోయాయి

తప్పులు జరగడం సహజం
పొరపాటు గ్రహించుట ముఖ్యం
పశ్చాత్తాపం ప్రకటించడమే
సమస్యకు చక్కని పరిష్కారం!

– నాగరాజు కామర్సు,
దుబ్బాక,సిద్ధిపేట,
92480 93580.

➡️