అనగనగా ఒక అడవిలో గులాబీ మొక్క వికసించింది. అది అక్కడ ఉన్న అన్ని మొక్కల కన్నా అందంగా ఉండేది. అడవిలో ఉన్న అన్ని మొక్కలూ గులాబీని జాగ్రత్తగా చూసుకునేవి. అందరూ తనని గొప్పగా చూస్తుంటే గులాబీ మొక్కకు భలే సంతోషంగా ఉండేది. ఒక రోజు ఒక పర్యాటకుడు అడవిని సందర్శించడానికి వచ్చాడు. అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ, అడవి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడే గడ్డి మొక్కల మధ్య ఉన్న గులాబీని చూసాడు. వెంటనే దాని దగ్గరికి వెళ్లి, ‘నువ్వు ఇంత అందంగా ఉన్నావు. నువ్వసలు ఈ అడవిలో ఉండవలసినదానివి కాదు. పట్టణ సౌందర్యం మధ్య నీలాంటి వాళ్లు ఉంటే ఎంతో గౌరవం, మర్యాద ఉంటాయి’ అని చెప్పాడు. బాటసారి మాటలకు గులాబీ ఉప్పొంగిపోయింది. ఇంతలో మళ్లీ బాటసారి గులాబీతో ఇలా అన్నాడు. ‘నేను రేపు మళ్లీ వస్తాను. పట్టణానికి తీసకెళతాను. అక్కడ చూద్దువు గాని, నీ గొప్పతనం’. అని చెప్పాడు.
అతను వెళ్ళగానే మిగతా మొక్కలు గులాబీతో ఇలా అన్నాయి. ‘నువ్వు అతనితో కలిసి పట్టణానికి వెళ్లొద్దు. ఆ పట్టణపు గాలిలో నువ్వు బతకలేవు. అతను నీకు మాయమాటలు చెప్పి నిన్ను ఏమార్చాలి అని అనుకుంటున్నాడు’ అని ఎన్నో విధాలుగా నచ్చచెప్పాయి’. అయినా గులాబీ మాట వినలేదు. పట్టణానికి వెళ్లడానికే సిద్ధపడింది. మరుసటి రోజు బాటసారి గులాబీ మొక్క దగ్గరకు వచ్చాడు. వేర్లతో సహా పీకి, పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. పట్టణం చేరేసరికి గులాబీ మొక్క పూర్తిగా వాడిపోయింది. దీంతో, ఆ మొక్కను బయట విసిరేసాడు. ”అయ్యో … నా మిత్రుల మాట వినకపోతినే!” అని లోలోపల కుమిలి పోయింది గులాబీ మొక్క!
సీతా సాయి సుహృత,
8వ తరగతి, మాడుగుల, అనకాపల్లి జిల్లా.