సంక్రాంతి కళను ప్రతిబింబిస్తూ గంగిరెద్దుల కళాకారులు చేస్తున్న సందడి పలు గ్రామాల్లో కనిపిస్తోది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వీధుల్లో, ఊరి కూడళ్లలో గంగిరెద్దుల ప్రదర్శనలు అలరిస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చాలాచోట్ల ఈ సందడి కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంగిరెద్దు కళాకారుల కదలిక ఎక్కువగా ఉంది. పండగ వేళల్లో కళాకారులుగా తిరిగి, మామూలు సమయాల్లో దినసరి కూలీలుగా మారి వీరు జీవనం సాగిస్తున్నారు.
విజయవాడ సమీపాన గుణదలలో గంగిరెద్దుల కాలనీ ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న పలు కుటుంబాలు ఈ వృత్తిని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి, చిక్కవరం, బాపులపాడు మండలం రేపల్లె, ఎన్‌టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు, తిరువూరు ప్రాంతాల్లో గంగిరెడ్ల కుటుంబాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, ఎర్రబాలెం, ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం, పొందూరు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. అందులో కొన్ని కుటుంబాల వారు పండుగల సమయంలో గంగిరెద్దులను ఆడించటం, మిగతా రోజుల్లో ఉపాధి కూలి, పనులు, వ్యవసాయ పనులు, భవన నిర్మాణ కార్మికులుగా పనులు చేస్తున్నారు. మరికొందరు సొంత వ్యవసాయం, ఇంకొందరు కౌలు వ్యవసాయం చేస్తున్నారు. యువతలో చదువు తక్కువగానే ఉంది. చదువుకున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం పండుగ సమయంలో ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. తర్వాత తమ ఉపాధిలోకి మళ్లీ వెళ్లిపోతున్నారు.
వీరు ఎక్కువ సంచార జీవితాలు గడుపుతుండటం కారణంగా పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఓ మాదిరిగా చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతున్నారు. దీంతో, గతంతో పోలిస్తే కొత్తతరంలో చదువుకోవటం పెరుగుతోంది. అయితే, ప్రాథమిక విద్యతోనే ఎక్కువ మంది మానేస్తుండటంతో బాల కార్మికులుగా కూడా ఎక్కువమంది ఉంటున్నారు. తెంపల్లిలో సగం కుటుంబాలు వృత్తిలోనూ, మిగతా సగం రోజువారీ కూలీలుగానూ, ఇతర వ్యవసాయ, భవన నిర్మాణ రంగ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. పట్టణీకరణ, అపార్టుమెంట్ల సంస్క ృతి పెరగటంతో గంగిరెద్దు కళకు కూడా ఆదరణ తగ్గిపోతోంది. పల్లెటూళ్లలో ధాన్యం వస్తున్న తరుణంలో రైతులు ఎంతోకొంత ధనమో, ధాన్యం రూపంలో అందజేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో భవనాల్లో నుంచి బయటకు రావాల్సివుండటంతో పెద్దగా ఆదరణ ఉండటం లేదు. కానీ, సంక్రాంతి సందడిని ఆవిష్కరిస్తూ గంగిరెద్దుల ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. వివిధ సాంస్క ృతిక కార్యక్రమాల్లో, వివిధ సంస్థల ఉత్సవాల్లో తెలుగు సంస్క ృతికి ప్రతిబింబంగా గంగిరెద్దుల ప్రదర్శనకు అవకాశం దొరుకుతోంది. ఇది పాత కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వటమే కాదు; కొత్త వారు దీన్నొక ప్రదర్శన కళగా చేపట్టటానికీ ముందుకు వస్తున్నారు.
ఉద్యోగం చేస్తూనే … :- పంచిరెడ్డి కోటేశ్వరరావు, రాపాక, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా.
మాది జి.సిగడాం మండలం జగన్నాథవలస. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాలకు తిరుగుతూ రాపాకలో స్థిరపడ్డాం. నా వయస్సు 26 సంవత్సరాలు. డిగ్రీ బికాం కంప్యూటర్స్ చదివా. అపోలో ఫార్మశీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. సంక్రాంతి సమయంలో మా కుటుంబాలతో కలిసి నేను కూడా గంగిరెద్దులను ఆడించటానికి వెళ్తున్నాను. మా బృందంలో పంచిరెడ్డి సింహాచలం, ధనకొండ అప్పన్న, యడ్ల అప్పలస్వామి, ధనకొండ అప్పన్న, ధనకొండ వీరాస్వామి, పంచిరెడ్డి శేషు, పల్లి చిన్నారావు, యడ్ల అప్పలస్వామి తదితరులు ఉన్నారు. ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి గంగిరెద్దులను ఆడించి వస్తున్నాం.
బతుకు దెరువుకోసం… : మాదల శ్రీను (గుర్రాల మేస్త్రీ),ఆవుల రంగారావు, తెంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.69 లక్షల మంది మా వృత్తిదారులు ఉన్నారు. పండుగల సమయంలో గంగిరెద్దులను ఆడిస్తూ జీవితాలను సాగిస్తున్నాం. మిగతా రోజుల్లో ఉపాధి కూలి పనులు, వ్యవసాయ కూతి పనులు చేసి, జీవిస్తున్నాం. పిల్లలు చదువుకునే అవకాశం తక్కువగానే ఉంది. సంచార జాతిగా మమ్మల్ని ఎస్‌టి జాబితాలో చేర్చితే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
సినిమాల్లో పాటలు పాడా … :- బాడ సూరన్న, భైరి సారంగపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా.
‘సిత్తరా సిరపడు… సిత్తరాల సిరపడు… పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు… చిత్తరాల సిరపడు.. ఊరారా ఒగ్గేసినా ఉడంపట్టు ఒగ్గడు… బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే… బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే.. కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో…’ అంటూ సాగిన పాటను పాడింది నేనే. ఆ సినిమాలో పాట పాడేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవకాశం కల్పించారు. ఆ తర్వాత మరో ఎనిమిది సినిమాల్లో పాడారు. మిషన్ 20, దగ్ధం, వీరగున్నమ్మ, అక్షరం తదితర సినిమాల్లో పాడిన పాటలకు మంచి స్పందనే వచ్చింది.
అర్ధరాత్రి వరకూ ప్రదర్శనలు : పెద్దిబోయిన సుబ్బారావు, మాదాసు అంజయ్య
ఉదయం ఊళ్లకు వెళ్లి ఇంటింటికీ తిరుగుతుంటాం. రాత్రి 7 గంటలకు ఊళ్లల్లోని సెంటర్లలో గంగిరెద్దుల ఆటలు ఆడుతాం. ఒక్కోసారి అర్ధరాత్రి 12 వరకూ కూడా మా ప్రదర్శనలు సాగుతాయి. దాతలు ఎంతోకొంత డబ్బులు ముట్టచెబుతారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ధాన్యం ఇవ్వటం లేదు.
పండుగ రోజుల్లోనే … : నడ్డి వెంకటేశ్వరరావు, గన్నవరం మండలం
పండుగ రోజుల్లోనే మాకు ఆదరణ ఉంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతరత్రా సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కొంత డబ్బులు ఇస్తుండటంతో మేము కూడా సంతోషంగా అక్కడ ప్రదర్శనలు ఇస్తున్నాం. అలాంటి అవకాశాలు వస్తున్నప్పుడు కొత్త తరం యువకులు కూడా పాల్గొంటున్నారు.
– యడవల్లి శ్రీనివాసరావు