ఊబకాయం.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్యల్లో ఒకటి. దీనిపై ప్రఖ్యాత హెల్త్ మ్యాగజైన్ ‘సైన్స్ డైరెక్ట్’లో తాజాగా ఓ పత్రం ప్రచురించారు. దీని ప్రకారం, ఊబకాయం కారణాలు జీవసంబంధమైనవి, సామాజికమైనవి. జెండర్ ఆధారంగా వీటిల్లో గణనీయ మార్పులు ఉండొచ్చు. మహిళల్లో సహజంగా పురుషుల కంటే శరీర కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది పునరుత్పత్తి సామర్థ్యానికి సంబంధించినంత వరకు మేలు చేస్తుంది. అదే బరువు సమస్య వచ్చేసరికి సవాలుగా మారుతోంది.
మహిళల్లో యుక్త వయసు, గర్భం దాల్చడం, మోనోపాజ్ దశల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు విపరీతంగా ఉంటాయి. ఈ కారణంగా పొట్ట, నడుం కిందిభాగాన అధిక కొవ్వు పేరుకుపోతుంది. ఈ అంశాలపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ విశాఖ శివదాసాని ఇలా చెబుతున్నారు : ‘ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడంతో బాల్య దశ నుండే హార్మోన్లలో అసమతుల్యత ప్రారంభమౌతోంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫ్రక్టోజ్‌తో నిండిపోయిన చిప్స్, కూల్‌డ్రింక్స్, క్యాన్డ్ జ్యూస్‌లను ప్రతిరోజూ తీసుకుంటున్నారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీ, ఇతర హార్మోన్ల అసమతుల్యతకి దారితీస్తుంది. దీంతో 11 – 12 ఏళ్ల మధ్యలో యుక్తవయసుకు ముందే పిల్లలకు మొటిమలు, బరువు పెరగడం, బొడ్డు చుట్టూ కొవ్వు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఎండోక్రినాలజిస్ట్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించి మూల కారణాన్ని పరిష్కరించాలి’ అని ఆమె నొక్కిచెప్పారు. ఇన్సులిన్ (హార్మోన్) స్థాయిల్లో మార్పులు, థైరాయిడ్ పనిచేయకపోవడం, రాత్రిపూట కార్పోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవాలని కోరిక పుట్టడం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు సంకేతాలని ఆమె చెప్పారు. ‘ఇన్సులిన్ నిరంతరం అనేక జీవచర్యల్లో పాల్గొంటుంది. థైరాయిడ్, కార్టిసాల్ సమస్యలు ఉంటే అవి ఇన్సులిన్‌ని ప్రభావితం చేస్తాయి. అది క్రమేణా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.’ అని శివదాసాని చెబుతున్నారు.
వయసు సంబంధిత హార్మోన్ల మార్పులు
పోషకాహార నిపుణులు, క్రానిక్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ దీప్తా నాగ్‌పాల్ హార్మోన్ల మార్పుల గురించి ఇలా చెబుతున్నారు : ”సాధారణంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో అనేక కీలక జీవక్రియ మార్పులు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఈ వయసు మహిళల్లో కండర ద్రవ్యరాశి క్షీణించడం ప్రాథమిక అంశం. ఇది సహజంగానే జీవక్రియని నెమ్మదింపజేస్తుంది. ఈస్ట్రోజెన్ సాధారణంగా కొవ్వును సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. దాని స్థాయి పడిపోతున్నప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.”
”రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. క్రమేణా ఇన్సులిన్ రెసిస్టెన్సీ మరింత దిగజారితే, అది రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. ఫలితంగా టైప్ 2 మధుమేహం, ఊబకాయం, జీవక్రియ రుగ్మత ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్సీ సంభవించినప్పుడు ఇన్సులిన్‌ని ఉపయోగించగల శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. సాధారణంగా శక్తి కోసం చక్కెరను గ్రహించడంలో సహాయపడే ఇన్సులిన్, తక్కువ ప్రభావవంతంగా ఉండిపోతుంది. క్రమంగా ఇది కొవ్వు క్షీణతకి బదులుగా నిల్వకి ప్రోత్సహిస్తుంది. కాబట్టి 35 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం హార్మోన్ స్థాయిలు తనిఖీ చేసుకోవాలి.”
గట్ పనితీరు ముఖ్యం
‘నోటి నుండి పెద్ద ప్రేగు వరకు జీర్ణక్రియని కలిగివున్న గట్ సరిగ్గా పనిచేయకపోతే లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లు దెబ్బతింటాయి. ఫలితంగా ఆకలి పెరగడం, ఎంత తిన్నా వెలితిగా అనిపించడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఇన్సులిన్ రెసిస్టెన్సీకి దారితీస్తుంది. గట్ ఆరోగ్యం దెబ్బతినడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పేగు పొర దెబ్బతిని హానికర పదార్థాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. హైపోథైరాయిడిజం వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పరిస్థితి బరువు పెరగడానికి ముడిపడి ఉంటుంద’ని శివదాసాని చెబుతున్నారు.
ఉపవాసం మంచిదా?
’30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు అడపాదడపా ఉపవాసాలు చేయడం మంచిదే. అయితే వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసుకుని ఉపవాసం ఉండాలి. పునరుత్పత్తి వయసులోని మహిళలు ఎక్కువగా ఉపవాసాలు చేస్తే అది సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. థైరాయిడ్ ఉన్న వ్యక్తులు ఉపవాసం చేయకపోవడమే మంచిద’ని శివదాసాని అంటున్నారు.
బరువు నియంత్రణ ఎలా?
– బరువు నియంత్రణ సాధించాలంటే మంచి జీవనశైలిని పాటించాలి. ఉదయం పూట ఆహారంలో గింజలు, గుడ్లు, చికెన్, పెరుగు, పెసర మొలకలు వంటి ప్రోటీన్ చేర్చాలి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రమంగా ఉంచి, జీవక్రియను పెంచుతాయి.
– ఒమేగా-3 ఉండే మంచి కొవ్వు ఆహారాలు తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బిస్కెట్లు, ప్యాక్‌చేసిన ఆహారాల్లో ఉండే కొవ్వు మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది.
– ఉదయం పూట కాఫీ, చాక్లెట్లు తీసుకుంటే అందులో ఉండే కెఫిన్ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తుంది. ఫలితంగా జీవక్రియ దెబ్బతినొచ్చు. కూల్‌డ్రింక్స్, తియ్యని ఇతర ద్రవాలను దూరం పెట్టాలి. సహజ చక్కెర అని తేనె, మాపుల్ సిరప్ వంటివి తీసుకోవడం కూడా అంత మంచిది కాదు.
– విపరీత వ్యాయామం చేయకూడదు. పరిమితికి మించి నడక, మెట్లు ఎక్కడం వంటివి కండరాల శక్తిని తగ్గిస్తాయి.
– నిద్రపోవడంలో ఎప్పుడూ రాజీపడొద్దు. తగినంత విశ్రాంతి లేకపోతే హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది.
– ఒత్తిడిని అధిగమించడం అన్నింటిలోకెల్లా ముఖ్యం. హార్మోన్ల అసమతుల్యత లేదా ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉందో లేదో తెలుసుకోవడానికి సాధారణ రక్త పరీక్ష సహాయపడుతుంది.