ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఎక్కడైనా అవినీతిని ఉపేక్షించకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే, అది వ్యవస్థలన్నింట్లో జొరబడి ప్రజలకు హాని చేస్తుంది. చాలామందికి అది తెలిసినా మిన్నకుండిపోతారు. ‘మాకెందుకులే’ అని రాజీపడిపోతారు. కానీ.. యూరప్ ఖండంలోని సెర్బియా దేశంలో ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దేశం యావత్ ఒక్కతాటిపైకి వచ్చింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అసలు ఏం జరిగింది?
సెర్బియా చాలా చిన్న దేశం. కోటి లోపు జనాభానే ఉంటారు. 20వ శతాబ్దం వరకు యుగోస్లేవియా భూభాగంలో కలిసి ఉంది. 2008 నుండి స్వతంత్ర హోదాని పొందింది. 2023 జనగణన ప్రకారం సెర్బియా జనాభా 66.2 లక్షలు.
నవంబరు 1న సెర్బియా దేశంలోని ‘నోవీ సాడ్’ రైల్వే స్టేషనులో ఓ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్టేషను రూఫ్ విరిగిపడి అక్కడికక్కడే 14 మంది చనిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకు చికిత్స పొందుతూ మరొకరు బలయ్యారు. వారంతా 6 నుంచి 74 ఏళ్ల లోపు వారు. ఈ ఘటనకు బాధ్యులుగా పరిగణించి ప్రభుత్వం గంటల వ్యవధిలో 13 మందిని అరెస్టు చేసింది. వారిలో ఆ శాఖ మంత్రి కూడా ఉన్నారు. అయితే విచారణ చేసిన తరువాత వారంతా బెయిల్‌పై బయటికి వచ్చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు, ప్రభుత్వ తప్పిదాన్ని, దోషులను వెనకేసుకొచ్చిన వైనాన్ని తేలిగ్గా తీసుకోలేదు. నిర్మాణరంగంలో తిష్టవేసిన అవినీతిని రాజ్యమే పెంచి పోషిస్తోందని కళ్లెర్రజేశారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చారు.
డిసెంబరు 22న ప్రజల పోరాటం తారస్థాయికి చేరుకుంది. ‘నోవీ సాడ్’ రైల్వే స్టేషనుకు నిరసనకారులు చేరుకున్నారు. రాత్రి సమయంలో ఫోన్ల లైట్లతో వీధులన్నీ వెలుగులు విరజిమ్ముతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్షుడు ‘వ్యూసిక్ దొంగ’ అని నినదించారు. ‘మీరు దీనికి సమాధానం చెప్పాలి’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. పిల్లలతో సహా బాధితుల ఫొటోలను ప్రదర్శన ముందు భాగంలో ఉంచారు. ‘మేమింకా రూఫ్ కిందే ఉన్నాం’ అని బిగ్గరగా అరిచారు. ‘మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి’ అని ఎర్ర రంగు పులుముకున్న చేతులను చూపించారు. ‘రాజీనామాలు, జైలు, అరెస్టు’ నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది.
‘అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామ’ని గుమికూడిన వారందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఆ నిరసనకారుల్లో సాధారణ పౌరులే కాదు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సెర్బియా పాపులర్ నటీనటులు, సాహిత్యకారులు ఉన్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఆ రోజు నిరసనలు జరిగాయి.
నిరసనలను నిలిపివేయాలని పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. యువతకు విద్యా, ఉపాధిలో తాయిలాలు ప్రకటించారు. ప్రజానీకానికి సంక్షేమ పథకాల ఎర వేశారు. అవన్నీ నీటిమీద రాతలేనని, ఏ ఒక్కటీ ఆచరణ వీలుకాదని గ్రహించిన యావత్ దేశప్రజానీకం ఆదివారం రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. సంఘటన జరిగిన రోజు నుండి ఏడు వారాలుగా ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం యూనివర్శీటీ విద్యార్థులంతా సుప్రీం కోర్టు వెలుపల నిరసనలు చేశారు. మరణించిన వారి సంస్మరణార్థం 15 నిమిషాల పాటు ట్రాఫిక్‌ని స్తంభింపజేశారు.
అవినీతికి వ్యతిరేకంగా లక్షలమంది నిరసనల్లో పాల్గొనడం సెర్బియా చరిత్రలోనే మొదటిసారి అని మీడియా అభివర్ణించింది. ఒక చిన్న దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శం.