చిన్న ప్రయత్నం.. పెద్ద ఫలితం…

Jun 10,2024 05:55 #feachers, #jeevana

చిన్న చిన్న పనుల నుండే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయని చాలా తక్కువ మంది భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు అకుల్‌ బిశ్వాస్‌. పశ్చిమ బెంగాల్‌లోని సుందరబాన్‌ ద్వీపం తరచూ ప్రకృతి ప్రకోపాలకు తీర ప్రాంతాలకు అతలాకుతలమైపోతుంటుంది. వరదలను తట్టుకునే, నది కోతను నియంత్రించే శక్తివంతమైన నేల అక్కడ కనపించదు. దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. సాగు చేసే భూమి ఉన్నా, వరదల భయంతో చాలామంది ఇతర రాష్ట్రాలకు వలసపోతుంటారు. ఈ పరిస్థితిలోనే మార్పు తేవాలని అకుల్‌ సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా తీరం వెంబడి మడ అడవిని సృష్టించాడు. రెండు దశాబ్దాల క్రితం శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో మొదట అతడికి తోడుగా వచ్చింది చాలా తక్కువ మందే. కానీ ఇప్పుడు 2 వందల మందికి పైగా మహిళలు భాగస్వామ్యమయ్యారు. ‘ఝర్ఖాలి సాబూజ్‌ బహిని’ (జెఎస్‌బి) పేరుతో ఈ మిషన్‌ను ముందుకు నడిపిస్తున్న అకుల్‌ ముందుచూపుకు ఇప్పుడక్కడ ప్రతి ఒక్కరూ శభాష్‌ అంటున్నారు. చూపు లేకపోయినా ఎంతో దూరదృష్టితో ప్రకృతి ప్రకోపానికి అడ్డుకట్ట వేసిన అకుల్‌ ఆ ప్రాంతంలో సాగించిన విశేష కృషి గురించి తెలుసుకుందాం.
ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణా జిల్లా సుందర్‌బాన్‌ ప్రాంతంలోని ఝర్ఖాలీ గ్రామ మహిళలు మడ చెట్ల విత్తనాలను సేకరించేందుకు ప్రయాణమవుతారు. వాటిని నర్సరీకి చేర్చడం, మట్టి సంచుల్లో నింపడం వారి దినచర్య. మూడు నెలల తరువాత ఆ విత్తనాలు మోకాలు ఎత్తు వరకు పెరుగుతాయి. ఇక అప్పటి నుండి జెఎస్‌బి వాలంటీర్లు ప్రతి మొక్కను తీర ప్రాంతం వెంబడి ఉన్న తమ ఇంటి చుట్టుపక్కల నాటుకుంటూ వెళతారు.
అక్టోబరు నుంచి జనవరి మధ్య కాలంలో రోజుకు రెండు గంటలపాటు ఆ మొక్కలు నాటుతారు. ‘అలా ఒక్కో మహిళ, 200 నుండి 250 మొక్కలు నాటుతాం’ అని చెబుతోంది 45 ఏళ్ల కల్పనా సర్దార్‌. కల్పన పర్యావరణ కార్యకర్తగా 2021 నుండి జెఎస్‌బిలో భాగమైంది. అప్పటి నుండి వేల కొలది మొక్కలను స్వయంగా నాటింది.
జెఎస్‌బిలో భాగమైన 200 మంది వాలంటీర్లకి ఇదే దినచర్య. ఇప్పుడు ఈ వాలంటీర్లు సుందర్‌బాన్‌ వ్యాప్తంగా 23 జిల్లాల్లో తమ సేవలను విస్తరించారు. ‘వరదలు, ప్రకృతి ప్రకోపాల నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవాలంటే ఇది తప్పితే మాకు వేరే మార్గం లేదు. మొదట అకుల్‌ ఒక్కరే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మేమెవరమూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని ఫలితం గురించి అకుల్‌ మాకు బాగా వివరించారు. అప్పటి నుండి ఈ పని నుండి వెనుకడుగు వేయలేదు’ అని తన అనుభవాన్ని కల్పన చెబుతోంది.
‘ద్వీప ప్రాంతమైన సుందర్‌బాన్‌లో తక్కువ వృక్ష సంపద ఉన్న చోట వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తుఫాను గాలుల తీవ్రత కూడా ఇక్కడ ఎక్కువే. ఇది గమనించిన నేను ఈ ప్రాంత వాసుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలనుకున్నాను. మొదట్లో ఎవరూ రాకపోయినా దశాబ్దం తరువాత నుండి ఈ ప్రాంతం నుండి వందల స ంఖ్యల్లో పర్యావరణ ప్రేమికులు ముందుకువచ్చారు’ అని అకుల్‌ తన ప్రయాణం గురించి వివరించారు.


సుందర్బాన్‌ ప్రాంత ప్రకృతి దృశ్యం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక నీటి వనరులు ఉంటాయి. చుట్టూ సముద్ర నీటితో నిండి ఉండే అందమైన ఈ ద్వీపంలో ఏడాది పొడుగునా, సముద్ర ఆటు, పోట్లు, తుఫానులు, భారీ వర్షపాతం వల్ల తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. పైగా ఇటీవలి కాలంలో వాతావరణంలో వచ్చిన విపరీత మార్పుల వల్ల ఈ్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత బాగా పెరిగింది. అనేక ద్వీపాలు ఇప్పటికే నీటి అడుగున మునిగిపోయాయి. ఈ ముప్పు నుండి సుందరబాన్‌ని రక్షించేందుకు అకుల్‌ చేసిన ఈ చిన్న ప్రయత్నం, ఇప్పుడు పెద్ద ఫలితాలను తెచ్చిపెడుతోంది.
2021లో సుందర్‌బాన్‌ని అతలాకుతలం చేసిన యాస్‌ తుపాన్‌ ఝార్ఖలీ తీర ప్రాంత వాసులని మాత్రం నిరాశ్రయులని చేయలేదు. ఈ ప్రాంతంలో నది కోతకు గురవ్వకుండా జెఎస్‌బి వాలంటీర్లు సంరక్షించిన వృక్ష సంపద వారిని కాపాడింది. ఇప్పుడీ మహిళలు తమ ప్రాంతంలోనే వ్యవసాయం చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ ప్రయోజనాలను దగ్గర నుండీ పరిశీలిస్తున్న ఇతర గ్రామస్తులు కూడా తమ ప్రాంతంలో వృక్ష సంపద పెంచేందుకు ముందుకు వస్తున్నారు. ‘నేను చేసిన ఓ చిన్న ప్రయత్నం, పెద్ద ప్రయోజనాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంద’ని అకుల్‌ చెబుతున్నప్పుడు తమ కోసం, తమ ప్రయోజనాల కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేసే ఔత్సాహికులు స్ఫురణకు వస్తారు.

➡️