‘ప్రత్యేక’ క్రికెటర్‌.. కెప్టెన్‌ అమీర్‌..

Feb 20,2024 10:39 #feachers

పడి లేచే కెరటాన్ని చూసి జీవిత పాఠాలు నేర్చుకుంటారు చాలా మంది. అయితే వారిలో కొందరే ఆ కెరటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎగబాకుతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తి ఆ కోవలోకే చెందుతాడు. భారత పారా క్రికెట్‌లో జమ్మూకాశ్మీర్‌ టీమ్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అమీర్‌ హుస్సేన్‌. అమీర్‌ ఎనిమిదేళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులూ పోగొట్టుకున్నాడు. ‘చేతులు లేని పిల్లవాడు ఎలా జీవిస్తాడు. వైద్యం చేయించుకునేందుకు మీ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇక నుంచి మీ అబ్బాయి అవిటివాడుగా జీవించాల్సిందే…’ అంటూ ఇరుగుపొరుగు వారు, బంధువులు ఆ కుటుంబానికి భరోసా కంటే భయాన్ని కలిగించారు. అమీర్‌ కుటుంబం ధైర్యం కోల్పోలేదు. తమ బిడ్డ ఏదో సాధిస్తాడని అప్పుడు వారు అనుకోలేదు. కానీ ఆ బిడ్డ అందరిలా బతకగలడని మాత్రం నమ్మారు. వైకల్యంతో కుదేలవ్వకుండా అండగా నిలబడ్డారు.

‘ఏడేళ్లప్పుడు గల్లీ క్రికెట్‌ ఆడేవాడిని. అప్పటి నుండే ఆటపై ఎంతో మక్కువ పెంచుకున్నాను. కానీ అనుకోని ప్రమాదం నా కలలను తలకిందులు చేసింది. మూడేళ్లు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఇంటికి తిరిగివస్తే ఎన్నో జాలి చూపులు నాకు ఎదురయ్యాయి. అంత సానుభూతిని నేను భరించలేకపోయాను. వైకల్యం కంటే వాళ్లు నాపై చూపించే జాలి, దయ చాలా భయంకరంగా ఉండేవి’ అని తన చిన్ననాటి అనుభవాన్ని అమీర్‌ గుర్తుచేసుకున్నాడు.

‘ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకునేవారు. నానమ్మ ఎంతో గారాబం చేసేది. నాలో ధైర్యం నింపేది. చికిత్స తరువాత స్కూలుకు వెళ్లాను. అక్కడ నుంచే వివక్ష ఎదురైంది. నన్ను దూరంగా కూర్చొబెట్టేవారు. నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. అయితే ఆ వివక్ష తరగతి గది నాలుగు గోడలకే పరిమితం కాలేదు. సమాజం మొత్తం నన్ను అలాగే చూసింది. ఆ విషయం అర్థం కావడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. ఇంత వేదనలో కూడా నేను నా ఆటను విడిచిపెట్టలేదు. అదే ఇప్పుడు నాకు ఇంత గౌరవం తెచ్చిపెట్టింది’ అని చెబుతాడు అమీర్‌. తన అభిమాన క్రికెటర్‌.. సచిన్‌ టెండుల్కర్‌. తన జీవితంలో ఊహించని సంఘటనగా 2016లో టెండూల్కర్‌ సంతకం చేసిన బ్యాట్‌ అమీర్‌కి బహుమతిగా అందింది. ‘ఆ క్షణం నా కళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. సంతోషంతో మాట పెగల్లేదు. క్రికెట్‌ ఆట నేర్చుకోవడం కోసం నేను పడ్డ కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోయింది’ అని నాటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు.

కాళ్లతో బౌలింగ్‌ చేయడం, తల, మెడకు మధ్యలో బ్యాటు ఉంచి బంతిని కొట్టడం ఆషామాషీ విషయం కాదు. కానీ అమీర్‌ అది సాధించాడు. ఎంతో బాధ అనుభవించాడు. ఎక్కువ సమయం తల ఒకపక్కకు ఆన్చి ఉంచడం వల్ల విపరీతమైన నొప్పి వచ్చేది. మెడ వాచిపోయి రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. అయినా వెనుకడుగు వేయలేదు. తెల్లారి మళ్లీ ప్రాక్టీస్‌ చేసేవాడు. ఆ కఠోర సాధనే అమీర్‌ని ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది.

‘2013 నుంచి జాతీయపోటీల్లో పాల్గొంటున్నాను. బంగ్లాదేశ్‌, నేపాల్‌, దుబారు వంటి చోట్ల మెరుగైన ఆట కనబర్చాను. దేశంలో కూడా ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా నా ప్రతిభకు పట్టం కట్టేవారే కనిపించారు. ఎక్కడా నా వైకల్యాన్ని గుర్తు చేసినవారు లేరు’ అని గర్వంగా చెబుతున్న అమీర్‌ తన పనులు తానే చేసుకుంటారు.టీ కప్పుతో టీ తాగుతారు. పుస్తకాలు చదువుతారు. రాస్తారు. షేవింగ్‌, వాషింగ్‌, ఫోను వినియోగం వంటి పర్సనల్‌ పనులు కూడా స్వయంగా తానే చేసుకుంటారు.

‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై కొంచెం శ్రద్ద పెడితే మామూలు వ్యక్తుల్లాగే వాళ్లు కూడా అన్ని పనులూ చేసుకోగలుగుతారు. అద్భుతాలూ సాధిస్తారు. నిరాశతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఓటమిని ఎప్పుడూ అంగీకరించకండి. మీ లక్ష్యాలను నెరవేర్చుకునే వరకు అంకితభావంతో పనిచేయండి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు’ అంటున్న అమీర్‌ లాంటి స్ఫూర్తివంత వ్యక్తులు ఎంతోమందికి ఆదర్శం.

➡️