పాలకూర కట్ట

Apr 13,2025 02:25 #feachers, #Jeevana Stories, #katha

‘రవీ! ఈ ఇరవై రూపాయలతో కూరగాయల మార్కెట్‌కు వెళ్లి పాలకూర తీసుకురావా?’ అని వంటింట్లో నుంచి రవి అమ్మ చెప్పింది. ‘అలాగే అమ్మా!’ అని రవి చేతి సంచి తీసుకుని మార్కెట్‌కు వెళ్ళాడు. ఎప్పుడూ ఆకుకూరలు కొనే కొట్టు వద్ద అవ్వకు బదులు ఒక అమ్మాయి ఉంది. రవి ఆ అమ్మాయి దగ్గర పాలకూర కొని ఇంటికి వచ్చాడు.
‘రవీ! ఏంటి ఈ పాలకూర కట్టకు కట్టిన తాడులో ఎనభై రూపాయలు ఉన్నాయి’ అని అంది రవి అమ్మ. ‘నాకు తెలియదమ్మా! ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఆ డబ్బు ఇలా ఇవ్వు. మార్కెటుకు వెళ్ళి వస్తాను’ అని పరుగు తీశాడు రవి. అక్కడ అమ్మాయికి బదులు అవ్వ ఉంది. ‘అవ్వా! ఇందాక ఇక్కడ ఉన్న అమ్మాయికి ఇరవై రూపాయలు ఇచ్చి పాలకూర తీసుకెళ్లాను. ఆ ఆకు కూరకు కట్టిన తాడులో ఈ ఎనభై రూపాయలు ఉన్నాయి’ అని అవ్వకు ఇచ్చాడు.
‘బాబూ ఇందాక ఒక సార్‌! పాలకూర తీసుకుని వంద రూపాయల నోటు ఇచ్చారు. అప్పటికి నా వద్ద చిల్లర లేదు. ఆయన మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. కాసేపటికి నాకు చిల్లర వచ్చింది. నా మానవరాలికి ఆ సార్‌ వస్తే ఈ కట్ట ఇవ్వు అని డబ్బులు కట్టిన ఆకు కూర కట్టను చూపించి, టిఫిన్‌ తిందామని వెళ్ళాను. ఈ లోగా పొరపాటు జరిగింది. డబ్బు తెచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం నాయనా! నువ్వు చల్లగా ఉండాలి’ అంది అవ్వ.
ఇంటికి వెళ్ళిన రవి స్కూలుకి వెళ్లాడు. మూడో పీరియడ్‌లో తరగతి గదికి వచ్చిన తెలుగు మాస్టారు ‘పిల్లలూ ఈ రోజు ఒక తమాషా జరిగింది. నేను ఆకుకూర కొనడానికి వెళ్ళాను’ అని మాస్టారు చెప్పే లోపే ‘ఒక్క నిముషం మాస్టారు’ అని రవి మార్కెట్లో జరిగిందంతా చెప్పాడు. ‘ఆ డబ్బు నీకు దొరికిందా? దొరికిన డబ్బును తిరిగి ఇవ్వడం అన్నది మంచి లక్షణం. ఆ డబ్బు నాకు అందింది. పిల్లలూ రవి చేసిన పనికి చప్పట్లు కొట్టండి!’ అన్నారు మాస్టారు. అందరూ చప్పట్లు కొట్టారు. ‘మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే రవిలా మంచి పని చేయండి’ అన్నారు మాస్టారు. ‘అలాగే సర్‌!’ అన్నారు పిల్లలు.

– యు.విజయశేఖర రెడ్డి,
హైదరాబాద్‌.

➡️