కళారంగ తేజ .. సాధినేని శ్రీజ

May 10,2025 02:41 #Arts, #Harikatha, #Jeevana Stories

తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథాగానంలో ఆమె దిట్ట. ఒకేసారి అన్ని పాత్రల్లోనూ జీవించి రసవత్తరంగా నటించటంలో మేటి. మూడుగంటలపాటు ప్రేక్షకులకు విసుగు రాకుండా మధ్యలో పిట్టకథలతో హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలోని కుళ్లును ఎత్తిచూపిస్తూ జనరంజకంగా హరికథాగానం చేస్తారామె. ఆమె సాదినేని శ్రీజ … కథా వాచస్పతి, అభినేత్రి, గానకోకిల, కథా విశారద వంటి బిరుదులను కైవసం చేసుకున్నారు. బాల భాగవతారిణిగా రంగప్రవేశం చేసి, ఆ తర్వాత నాటకాల్లోనూ, టీవీ, సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 3000లకు పైగా అవార్డులను కైవసం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసులు సాదినేని నాగేశ్వరరావు, భారతీదేవి దంపతుల కుమార్తె డాక్టర్‌ శ్రీజ సాదినేని. మాస్టర్‌ ఆఫ్‌ ఫెర్పార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎంపిఎ)లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. టాపర్‌గా నిలిచి యూనివర్శిటీలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 33 నాటకాలకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా రికార్డులకెక్కారు. బాల్యంలోనే హరికథా గానం చేస్తున్న శ్రీజను వేదికపై చూసిన రంగస్థల నటులు, దర్శకులు కె.శాంతిబాబు తన ‘మేడిపండు’ నాటికలో బాలనటిగా నాటక రంగానికి పరిచయం చేశారు. అలా ఓవైపు చదువు, మరో వైపు నాటక రంగంలో మమేకమై హావభావాలు పలికించగల ప్రతిభాశాలిగా పేరుగాంచారు. డైలాగు డెలీవరీలో కొత్తదనం చూపేవారు. నటనలో వైవిధ్యం, ఆహార్యంలో నిండుదనం ఉండటంతో ఆనాటి ప్రముఖ కళాకారులు ఆమెను ప్రోత్సహించి అవకాశాలు కల్పించేవారు. ఇలా చదువును కొనసాగిస్తూనే తనకు ఇష్టమైన నాటకరంగంలో ప్రవేశం చేసి 400లకుపైగా నాటిక, నాటకాల్లో నటించారు. 34 తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించారు కూడా. కళారంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి యాక్టింగ్‌, యాంకరింగ్‌, డబ్బింగ్‌, న్యూస్‌రీడింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, డైరెక్షన్‌ వంటి విభాగాల్లో 2500 మందికి శిక్షణ ఇచ్చారు. శ్రీజ కొటేషన్స్‌ (నిప్పులాంటి నిజాలు), త్రినయని, అభిసారిక పుస్తకాలను ఆమె ముద్రించారు.

నటనలో వైవిధ్యం..
సాంఘిక నాటకాలే కాక పద్య నాటకాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సత్యభామ, మోహిని, లక్ష్మీదేవి, పార్వతి, రుక్మిణి, సుభద్ర, తార, వరూధిని, మధురవాణి, లకుమాదేవి, రుద్రమదేవి, రాణీ రాస్మణీదేవి, సమ్మక్క, చాకలి ఐలమ్మ, మదర్‌థెరిస్సా వంటి ఎన్నో పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా అనిపించుకున్నారు.

 


కథానాయికగా…
తెలుగు సినిమా పరిశ్రమలో ఎర్ర సముద్రం, కోయిల సినిమాల్లో కథానాయికగా నటించారు. ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కోయిల సినిమాలో వేణుమాధవ్‌ కథానాయకుడిగానూ శ్రీజ కథానాయికగా నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పాండురంగడు, ఇక అంతా శుభమే పెళ్లి జరిపించండి, యు అండ్‌ ఐ, కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య, సోంబేరి, పాండవులు, ఇది కలకాదు, గరివిడి లక్ష్మి సినిమాల్లో నటించారు. అసోసియేట్‌ రైటర్‌గా 125, అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఐదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 400లకుపైగా, 20కిపైగా వెబ్‌సిరీస్‌లోనూ ఆమె గాత్రాన్ని అందించారు. త్వరలో ఆమె దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది.

టెలివిజన్‌ రంగంలో…
టెలివిజన్‌ రంగంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. 108 టివి ప్రోగ్రామ్‌ హెడ్‌గానూ, అమెజే టివికి సిఇఒగా పనిచేశారు. పోగ్రామ్‌ డైరెక్టర్‌, రచయిత, యాంకర్‌, న్యూస్‌ప్రజెంటర్‌, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా పలు టీవీ సంస్థల్లో పనిచేశారు. ఆమె దర్శకత్వంలో 8 షార్ట్‌ ఫిలిమ్స్‌ను నిర్మించారు. రుతు రాగాలు, కస్తూరి, విధి, అలౌకిక, అన్వేషిత, చక్రవాకం, ఇల్లాలు ప్రియురాలు, తోడికోడళ్లు, మానస, సంగ్రామం, పితృదేవోభవ వంటి సీరియళ్లలో నటించి మెప్పించారు.

శ్రీ జయా ఆర్ట్స్‌ బ్యానర్‌లో…
శ్రీ జయా ఆర్ట్‌ బ్యానర్‌ ద్వారా ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నాం. మూడు దశాబ్ధాల నట ప్రస్థానంగా నటిగా, రచయిత్రగా, దర్శకురాలిగా, లైటింగ్‌, మేకప్‌, సెట్‌ డిజైనింగ్‌ ఆర్టిస్ట్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్‌ నిర్వాహకురాలు, యాక్టింగ్‌ ప్యాకల్టీగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, షార్ట్‌ ఫిల్మ్‌ దర్శక, నిర్మాత, యూట్యూబర్‌గా నా వంతుగా కళామతల్లి సేవ చేస్తున్నా.
– డాక్టర్‌ శ్రీజ సాదినేని, సినీనటి.

ఔత్సాహికులకు ప్రోత్సాహం
2003 నుంచి ఇప్పటివరకూ సినీ ఔత్సాహికులకు యాక్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. దర్శకత్వం, ప్రొడక్షన్‌ రంగంలోకి కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు. 2008 నుంచి సినీ నటిగా కొనసాగుతున్నారు.
-యడవల్లి శ్రీనివాసరావు

➡️