‘నేను నిలబడగలనా? నా వైపు జాలిగా చూడడం మాని, నా మాటలు ఎవరైనా వింటారా?’ అన్న స్థితి నుండి లేచి నుంచొన్న వాళ్లని చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ నడవలేక, కర్రల సాయంతో నడిచే ఓ అమ్మాయి ఆ పరిస్థితిని దాటుకుని వచ్చింది. తాను ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలతోనే హాస్యం పుట్టిస్తోంది. 8 ఏళ్లుగా స్టాండప్ కమెడియన్‌గా కొనసాగిస్తున్న తన ప్రయాణంలో ఎదురుగా కూర్చొనవాళ్లనే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్లకి కూడా ఆ అవమానాలు, హేళనల బాధను మంచి హాస్య చతురతతో చెబుతోంది. అయితే ఆ సందర్భాలేవీ పగలబడి నవ్వేవి కావు, కన్నీటి పొరల్లో దాగున్న నీటిచుక్కలను అదిమిపట్టి పంటి బిగువున బాధను దిగమింగుకుని చెబుతున్న నగ్న సత్యాలు.
36 ఏళ్ల శ్వేతా మంత్రి పుట్టుకతోనే స్పైనా బిఫిడా అనే వెన్నెముక వ్యాధితో పుట్టింది. సరిగ్గా ఎదగని వెన్నెముకతో ఆమె అందరిలా ఎదగలేదు. 4.6 అంగుళాల ఎత్తుకే ఆగిపోయింది. స్కూల్లోను, ఇంట్లోనూ ఎప్పుడూ ఆమె వైకల్యంపైనే చర్చలు ఉండేవి. ‘క్లాసు రూంలో అందరూ బయటికి వెళ్లి ఆడుకుంటుంటే నన్ను మాత్రం టీచర్లు వెళ్లనిచ్చేవారు కాదు. ఇంట్లో కూడా అంతే, వీధులోకెళ్లి ఆడుకోవాలని ఎంత ఉన్నా, గుమ్మం దాటనిచ్చేవారు కాదు. అయితే ఇదంతా నా మీద ద్వేషం కాదు, ప్రేమ, జాలి మాత్రమే. కానీ నాక్కావల్సింది ఇది కాదు. నన్ను నన్నులా గుర్తించగలగాలి’ అంటున్న శ్వేత, స్వతహాగానే కాస్తంత హాస్య చతురత కలిగిన అమ్మాయి. కామెడీ వీడియోలు చూస్తూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేది. అవే ఏదో ఒక రోజు తనని ఉన్నత స్థానంలో నిలబెడతాయని ఆమె అస్సలు అనుకోలేదు.
‘యూట్యూబ్‌లో చాలా కామెడీ వీడియోలు చూసేదాన్ని. నేను కూడా వారిలాగా హాస్య ప్రదర్శనలు ఇవ్వాలని అనుకునేదాన్ని. అయితే నేను ఒక చోట నుండి మరో చోటికి నడవలేను. నా వల్ల సాధ్యమేనా? అనుకున్నాను. కానీ సోషల్ మీడియాలో నా బాధలు, కష్టాలనే వినోదంగా చెప్పడం ప్రారంభించాను. వాటిని చాలామంది వీక్షించేవారు. నా లక్ష్యం అదే. వైకల్యంతో బాధ పడుతున్న మాలాంటి వాళ్లు, జోక్ చేయడానికే కాదు, జోక్స్ వేయడానికి కూడా అర్హులేనని నిరూపించాలనుకున్నాను’ అని చెబుతున్నప్పుడు శ్వేత మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది.
చేదు అనుభవం
2016లో తన సొంత ఊరు పూణెలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చిన్పుడు శ్వేతకి చేదు అనుభవం ఎదురైంది. తను స్టేజి ఎక్కగానే ప్రేక్షకుల్లో చాలామంది లేచి వెళ్లిపోయారు. ‘అసలు నేను ఆ స్టేజి ఎక్కగలనా? అన్న అనుమానం వచ్చింది. అందరిలా నేను మెట్లు ఎక్కలేను. అదేమో మామూలు వ్యక్తులు వెళ్లడానికి వీలుగా ఉంది. అయినా ఎంతో కష్టపడి స్టేజి ఎక్కాను. చేతుల కింద కర్రలు పెట్టుకుని అతికష్టం మీద స్టేజి ఎక్కిన నన్ను చూసి చాలామంది జాలి పడ్డారు. వైకల్యంతో బాధపడుతూ కామెడీ చేయడం అవసరమా? అన్నారు. అయినా నేను బాధపడలేదు. ఒకప్పుడు నా ప్రదర్శనలు చూసి లేచివెళ్లిపోయిన వారే ఇప్పుడు నేను చెబుతున్న జోక్స్‌కి లేచి నుంచొని చప్పట్లు కొడుతున్నారు. ఇది నేను సాధించిన విజయం కాదు, నాలాంటి వారందరూ ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకునే సందర్భం’ అంటున్నారు శ్వేత.
స్టేజి ఎక్కడానికి మొదట్లో ఎంతో ఇబ్బంది పడ్డ శ్వేత, ఆ తరువాత స్జేజి ఎక్కడం ఎక్కడంతోనే ‘మీరెందుకు నా చేతి కర్రలను చూస్తున్నారు. వాటిని వదిలేయండి. నేను చెప్పే విషయాలపై శ్రద్ధ పెట్టండి. మధ్యమధ్యలో నా చేతికర్రలను మిమ్మల్ని డిస్ట్రర్బ్ చేసినా మీ క్రష్‌ని వదిలేసినట్లు వాటిని పట్టించుకోకండి’ అని మంచి హ్యుమరస్‌గా చెబుతున్నప్పుడు అప్పటి వరకు ఆమెవైపు చూస్తున్న జాలి చూపులన్నీ ఒక్కసారిగా సంతోషంతో మెలికలు తిరిగాయి.
స్టేజి ప్రదర్శనలు ఇవ్వడంతోనే శ్వేత ఆగిపోలేదు. న్యాయవిద్యార్థిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించుకుంది. ‘నేను మొదటిసారి ముంబయి నగరానికి వెళ్లినప్పుడు లిఫ్ట్ ఉన్న అద్దె ఇంటి కోసం ఎంతో వెతికాను. నాలాంటి వాళ్లకి వీలైన మరుగుదొడ్లు ఉన్న ఇంటి కోసం కూడా అన్వేషించాను. కానీ అవేమీ నాకు కనిపించలేదు. అసలు వైకల్య బాధితుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించే వ్యక్తులు చాలా అరుదుగా కనిపించారు.
‘వైకల్య బాధితులపై జాలి చూపించడమో, ఆకాశానికి ఎత్తేయడమో చాలామంది తరచూ చేస్తుంటారు. అవి రెండూ అవసరం లేదు. మమ్నల్ని మమ్నల్నిగా గుర్తించండి. వైకల్యం సమస్య కాదు. చూసే మీకే సమస్య. మేము దాన్ని ఎప్పుడు అధిగమించాలనుకుంటూనే ఉంటాం. కానీ మీరు పదే పదే మా వైకల్యాన్ని గుర్తుచేసేలా మమ్మల్ని తక్కువచేసి చూస్తుంటారు. ఈ ధోరణి మార్చాలనే నేను ప్రయత్నిస్తున్నాను’ అంటున్న శ్వేత, కామెడీ షోల నుండి విశ్రాంతి దొరికినప్పుడల్లా న్యాయవాదిగా తన వారి హక్కుల కోసం పోరాడుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి స్పైనా బిఫిడా వైకల్య బాధిత స్టాండప్ కమెడియన్‌గా శ్వేత పేరు చరిత్రలో నిలిచిపోనుంది.