కృష్ణపట్టె అనే గ్రామంలో పాపయ్య, జానమ్మ కుటుంబం ఉంటోంది. వారికి ఒక అబ్బాయి కృష్ణ. కృష్ణ చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత పాపయ్య దుర్వసనా లకు అలవాటు పడ్డాడు. కుటుంబాన్ని పట్టించు కోవడం మానేశాడు. జానమ్మే కూలీకి పోయి కుటుంబాన్ని సాకుతోంది.
రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి. కృష్ణకి రెండుపూటలా తిండిపెట్టడమే కష్టమౌతోంది. దీంతో జానమ్మ కృష్ణని చదువు మాన్పించేసింది. కృష్ణ బాగా ఏడ్చాడు. ‘తన దగ్గర పుస్తకాలు, బట్టలు కొనేందుకు డబ్బులు లేవని, రోజూ తనతో పాటు పనికి రమ్మ’ని జానమ్మ కృష్ణతో ఏడుస్తూ చెప్పింది.
జానమ్మ, కృష్ణ రోడ్డు పక్కన సీసాలు ఏరే పనికి కుదిరారు. ఒకసారి వాళ్లు వెళ్లే చోటుకి కాస్త దగ్గరగా హైస్కూలు ఉంది. అక్కడ ఒక తరగతి గదిని ఆనుకుని ఉన్న కిటికీ దగ్గర సీసాలు ఏరుతున్న కృష్ణకి, టీచర్ చెప్పే పాఠాలు బాగా వినిపించాయి. ప్రతి రోజూ అక్కడే పనిచేస్తూ పాఠాలు శ్రద్ధగా వింటున్నాడు. ఒకరోజు క్లాస్‌లో టీచర్ పిల్లలని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అప్పుడు కృష్ణ ‘నేను చెబుతాను టీచర్’ అన్నాడు. టీచర్ కిటికీ వైపు చూశారు. కృష్ణని లోపలికి రమ్మని చెప్పారు. టీచర్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు కష్ణ. టీచర్ చాలా సంతోషించారు.
‘నీకు సమాధానం ఎలా తెలుసు? నువ్వు ఏ పాఠశాలలో చదువుతున్నావు?’ అని అడిగారు.
‘నేను ప్రస్తుతం ఎక్కడా చదువుకోవడం లేదు. మా అమ్మతో కలిసి సీసాలు ఏరడానికి ఇటువైపు వస్తాను. మీరు చెప్పే పాఠాలను రోజు వింటున్నాను’ అని చెప్పాడు కృష్ణ. టీచర్ వెంటనే జానమ్మని పిలిచారు. కృష్ణ ఎందుకు స్కూలుకు వెళ్లడం లేదో విషయం తెలుసుకున్నారు. ఆ రోజు నుండి కృష్ణకి కావాల్సిన పుస్తకాలు, బట్టలు ఇస్తానని టీచర్, జానమ్మకి మాట ఇచ్చారు. రోజూ కృష్ణని స్కూలుకు పంపమని కూడా చెప్పారు. కృష్ణ ఎంతో సంతోషించాడు. మరుసటి రోజు నుండి కృష్ణను పాఠశాలకు పంపించసాగింది జానమ్మ.
– షేక్ ఫాతిమా 8వ తరగతి,జెడ్‌పిహెచ్‌ఎస్, కోదాడ,
సూర్యాపేట, తెలంగాణ.