సురభికే వన్నెతెచ్చిన పభ్రావతి

Mar 27,2025 06:07 #feacherse, #jeevana

టాలీవుడ్‌లో అమ్మ పాత్రల్లో కొత్తగా పలువురు తారలు తళుక్కుమంటున్నారు. తాజాగా ఈ జాబితాలో సురభి ప్రభావతి కూడా చేరారు.
నవ్వు ముఖం, నిండైన విగ్రహం, పాత్రల్లో జీవించేతత్వం .. వెరసి ఆమె కోర్టు సినిమాలో తల్లి పాత్రకు ప్రాణం పోశారు. రంగస్థల నటిగా అప్పటికే గొప్ప ఖ్యాతి పొందారు.

స్టేజీ ఆర్టిస్టు నుంచి బుల్లితెర, ఆపై వెండితెరపై మెరిశారు సురభి ప్రభావతి. ఓ వైపు రంగ స్థల కళాకారిణిగా అద్భుతాలను పండిస్తూనే వెండితెరపై అమ్మ పాత్ర తాలూకా వెలుగు జిలుగులు విరజిమ్ముతూనే ఉన్నారు. తాజాగా ‘కోర్టు’ సినిమాలో కథానాయకుడి తల్లి పాత్రల్లో మెరిసి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి జీవించే తత్వం ఆమెది. అమ్మ, అక్క, అత్త పాత్రల్లో ఆమెది అందెవేసిన చేయి. మొహంలో విజయదరహాసం.. నవరసాలు పండించే నటనా వైభవం ఆమెకే సొంతం. తెలంగాణా రాష్ట్రం జనగాం జిల్లాలోని తరిగుప్పలలో రేకందార్‌ కుమార్‌బాబు, కమలమ్మ దంపతులకు ప్రభావతి 1980 జూన్‌ 27న జన్మించారు. బాలనటిగా గుణసుందరి నాటకంలో నటించి 2003లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంలో అడుగుపెట్టిన ఆమె ఇప్పటివరకూ సుమారు 2000 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయజ్యం, మృతసంజీవని, గణపతి మహత్యం, శశిరేఖా పరిణయం, నరకాసుర నాటకాల్లో ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకున్నారు. ఎనిమిదేళ్ల వయస్సుల్లోనే ప్రభావతి నాటకరంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఆమె ఇంట్లో నాన్న, నానమ్మ మంచి రంగస్థల కళాకారులు. నాన్న ఏ పాత్రలోనైనా లీలమయ్యే వ్యక్తి. గంభీరంగా డైలాగులు చెప్పటంతోపాటుగా విషాద అంశాల్లో సమయస్ఫూర్తిగా రక్తి కట్టించటానికి ఏడ్పు సీన్లలో కూడా మెప్పించగల నటుడు. నానమ్మ గాత్రం ఎంతో బాగుంటుంది. ఆమె పద్యాలే కాకుండా పాటలు కూడా రాగయుక్తంగా పాడగలరు. అలా సురభి కళాపరిషత్‌ ద్వారా నాటక రంగ ప్రవేశం జరిగింది. ఇంట్లోనే రంగస్థల వాతావరణం పుణికి పుచ్చుకోవటంతో ఆ తర్వాత ఆమె కూడా నాటక రంగంలో ప్రవేశించి వివిధ పాత్రల్లో నటించారు. ఆ తర్వాత క్రమంలో నాటక సమాజాలు విడిపోయిన క్రమంలో కోదండరావు, వాసుదేవరావు తదితరుల కంపెనీల్లో పనిచేశారు. 2005లో జమున రాయల్‌ బృందంతో కూడా కలిపి పనిచేశారు. ఆమె చదివింది ఏడో తరగతి మాత్రమే! కొన్నాళ్లపాటు ఉద్యోగంలో చేరి పనిచేశారు. నాటక రంగంలో ఉంటూనే తీరిక సమయాల్లో నటనను ప్రదర్శించేవారు. వివాహమైన తర్వాత కూడా అత్తింటివాళ్లు కూడా రంగస్థలంలో ఉన్న వారే కావటం ఆమెకు కలిసివచ్చింది. పుట్టింటి, మెట్టింటివారంతా నాటక రంగంలో ఉండటంతో ఆమె కూడా ఆ ప్రభావంతో నాటకరంగంలో రాణిస్తున్నారు.

ఆసక్తి ఏర్పడింది ఇలా… : మొదట్లో నలుపుగా ఉన్నాననీ, అందంగా లేననీ ఆమె ఆత్మన్యూనతాభావంతో ఉండేవారు. ఆమె చిన్నప్పుడు బాలనాగమ్మ, కనకధార వంటి నాటకాల్లో నటించారు. తన పెద్ద నాన్న కోదండరామ్‌ ప్రోత్సహించేవారు. అప్పట్లో గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 9 నుంచి 11 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిగేవి. మావయ్య సురభి పూర్ణ, సుందరి నాటకంలో నటించేందుకు ఆమెను బలవంతంగా ఒప్పించారు. ఆ పాత్రకు ఆమె అక్క గాత్రాన్ని అందించారు. ఆ తర్వాత రసరంజని వారి కళా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగే నాటకోత్సవాలకు తన మావయ్య సూచన మేరకు నాగభూషణ శర్మ ఆహ్వానించారు. ఆ తర్వాత మదన కామరాజు కథలో శ్రీజ సాదినేని చిన్న క్యారెక్టర్‌కు అవకాశం కల్పించారు. ఇలా మొదలైన ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. వేలాది పద్య నాటకాలతోపాటుగా సాంఘికనాటకాలు, నాటికల్లో నటించారు.

సినిమాలు : ఆపరేషన్‌ ఐపిఎస్‌, బతుకమ్మ, మహాత్మా, ఆదిగురువు అమ్మ, మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, సూరాపానం, బైరవగీత, దొరసాని, అఖండ, అశోకవనంలో అర్జున కళ్యాణం, శ్రీదేవి సోడా సెంటర్‌, జెట్టి, ఇంటింటి రామాయణం, వినరో భాగ్యము విష్ణుకథ, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, మసూద, పంచతంత్రం, మెయిల్‌, ఆరంభం,లైలా, కోర్టు తదితర సినిమాల్లో నటించారు. ఇంకొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

సీరియళ్లు : పూతరేకులు, మాయాబజార్‌, సరస్వతివైభవం, కలవారికోడలు, ముద్దమందారం, మనసు మమత, సీతమ్మ వాకిట్లో, మనసు మమత.

షార్ట్ ఫిల్మ్స్ : కుర్తా, లక్ష్మీగారి అబ్బాయి, మా బుజ్జక్క.

సినిమాల్లో ఛాన్స్‌ ఇలా వచ్చింది

2008లో బతుకమ్మ సినిమాకు ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. నాటకాల్లో ఉన్న వారినే ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఆమెకు తెలియకుండా మామయ్య ఈవిడ ఫొటోలను ఆడిషన్స్‌ నిర్వహించే వారికి పంపించారు. ఆ ఫొటోలు చూసిన డైరెక్టర్‌ ప్రభాకర్‌ గారు ఆమెకు మొదటి అవకాశం ఇచ్చారు. సినిమా మొత్తం కనిపించేలా పాత్ర ఉన్నా ఆమెకు ఇందులో ఎలాంటి డైలాగులు లేవు. ఆ తర్వాత మహాత్మా సినిమాలో ఛాన్స్‌ దక్కింది. కొన్నిరోజుల తర్వాత వచ్చిన అవకాశం ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’ ఇందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పరుచూరి రఘుబాటు నాటక పరిషత్‌లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను ద్వారా అఖండ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇలా సినిమాలు, నాటకరంగాన్ని రెండు కళ్లుగా చేసుకుని నటిస్తూ ముందుకు సాగుతున్నారు. నాటక రంగంలోకి రాక మునుపు ఆమె ఎలక్ట్రికల్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత హోం నర్సుగా కూడా పనిచేశారు. ఎంఎస్‌చౌదరి దర్శకత్వంలో నాటకరంగం ప్రతినిధులంతా కలిసి చేసిన సినిమా ‘ఆది గురువు అమ్మ’.

నా అభివృద్ధికి కృషిలో… : సురభి ప్రభావతి, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌

నాటక రంగం నుంచి నేటి వరకూ నా అభివృద్ధికి ఎంతోమంది కృషిచేసిన మహాను భావులు ఉన్నారు. వారిలో కె.వి.రమణాచారి, కీర్తిశేషులు పల్లేటి లక్ష్మీ కులశేఖర్‌, పత్తి ఓబులయ్య, గోపరాజు రమణ గార్లు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.

అవార్డులు : సురభి ప్రభావతి నాటకరంగ, టివి, సినిమా నటిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులను పొందారు. ఉత్తమ నటిగా అనేక బహుమతులు గెల్చుకున్నారు. 5 నంది, 6 గరుడ, 3 అశ్వం అవార్డులతోపాటుగా అనేక పరిషత్‌ల నుంచి 1000కిపైగా బహుమతులు అందుకున్నారు.

రంగస్థల నంది పురస్కారాలు

  • ఉత్తమ నటి – బాపు బాటలో – 2009 నంది నాటక పరిషత్తు (నెల్లూరు)
  •  ఉత్తమ నటి – విప్రనారాయణ పద్యనాటకంలో దేవదేవి పాత్ర – 2010 నంది నాటక పరిషత్తు (ఖమ్మం)
  •  జ్యూరీ నంది – పల్నాటియుద్ధం పద్యనాటకంలో నాగమ్మ పాత్రకు – 2011 నంది నాటక పరిషత్తు (గుంటూరు)
  •  ఉత్తమ సహాయ నటి – మాతృక నాటికలో నిర్మల పాత్రకు
  •  2014 నంది నాటక పరిషత్తు (రాజమండ్రి)
  •  ఉత్తమ నటి – కర్ణార్జునీయం పద్యనాటకంలో కుంతి పాత్రకు – 2015 నంది నాటక పరిషత్తు (తిరుపతి)
  •  వీణా అవార్డు (2021)

పురస్కారాలు

  • ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్‌ 2013)
  •  మహిళారత్న పురస్కారం ఉత్తమ నటి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)
  •  వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌)
  •  నవరస కాకినాడ వారి పురస్కారం
  •  కళారంజని భీమవరం వారిచే మహానటి సావిత్రి పురస్కారం
  •  ఆరాధన హైదరాబాద్‌ వారిచే గౌరవ పురస్కారం
  •  యువకళా వాహిని హైదరాబాద్‌ వారిచే కళారత్న పురస్కారం

– యడవల్లి శ్రీనివాసరావు

➡️