మంచు వాకిట్లో మనుగడ

Jan 10,2025 05:59 #feachers, #jeevana, #snow, #survival

కూలి చేసుకుంటేనే పూట గడిచే కుటుంబాలు మన చుట్టూ ఎన్నో.. కడుపునిండా ఇంత తిండి తినాలని ఎండ, వానా, చలిని సైతం పట్టించుకోకుండా ఎందరో తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగమైపోతుంటారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అన్న లింగ భేదం లేకుండా రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అలా దట్టమైన మంచులో ప్రాణాలను పణంగా బెట్టి కూరగాయలు అమ్ముకుంటున్న ఈ తల్లులు ఎందరో అమ్మలకు ప్రతినిధులు. కాశ్మీర్‌.. దాల్‌ సరస్సు సమీపంలో కనిపిస్తుందీ దృశ్యం. భద్రతా కారణాల దృష్ట్యా చలిని తట్టుకునే వెసులుబాటు ఏర్పాటుచేసుకోలేని పరిస్థితి వారిది. సరస్సు నిండుగా నీరు ప్రవహించే కాలంలో వాళ్ల ప్రయాణం అంత కష్టం కాదు. అయితే గడ్డకట్టిన ఈ మంచులో వారి కష్టం అంతా ఇంతా కాదు. బండిపై కూరగాయలు వేసుకుని దాల్‌ సరస్సుపై ఈడ్చుకుంటూ రావాలి. ఓపిక లేకపోతే కూలి ఇచ్చి నెట్టుకురావాలి. ఖర్చు పరంగా ఇదో అదనపు భారం. అయినా బతుకు బండి నడవాలని గంటలు గంటలు మంచులో నిలబడి మరీ కూరగాయలు అమ్ముకుంటున్నారు. వారి కష్టం వారి మాటల్లోనే తెలుసుకుందాం.

రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై 70 ఏళ్ల ఖాతిజా భట్‌ గంపల నిండా కూరగాయలు పెట్టుకుని కూర్చొంది. ఈ వయసులో ఇంటి నుండి బయటికి రావడమే కష్టం. అటువంటిది ఖాతిజా ఒక్కత్తే బండిపై కూరగాయలను తీసుకొచ్చి అమ్ముకుంటోంది. రోజు మొత్తం అమ్మిన డబ్బులతోనే కుటుంబాన్ని నడపాలి. భర్త, ఇద్దరు మనవళ్ళ పోషణ ఆమే చూసుకోవాలి. అందుకే ఈ భారాన్ని మోస్తోంది. మామూలు రోజుల్లో దాల్‌ సరస్సుపై తేలియాడే పడవల్లో (షికారా) కూరగాయలు అమ్ముకునేది. ‘నా కూతురు, తన రెండో బిడ్డ ప్రసవం అప్పుడు కోమాలోకి వెళ్లిపోయింది. మూడు రోజుల తరువాత చనిపోయింది. అల్లుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. బిడ్డలిద్దరినీ నా దగ్గర వదిలేశాడు. నా భర్త అనారోగ్యంతో మంచాన ఉన్నాడు. నాకు వేరే గత్యంతరం లేదు. అందుకే ఈ చలిలో వ్యాపారానికి వస్తున్నాను’ అని చెబుతున్న ఈ బామ్మ ఎందరో అమ్మలను మన కళ్లముందుంచుతుంది.
65 ఏళ్ల ఫాతిమాకి 15 రోజుల నుండి ఒకటే జ్వరం. దగ్గు, తలనొప్పి. లేచి నిలబడలేని స్థితిలోనే కూరగాయలు తీసుకుని ఇక్కడకి వచ్చింది. ‘రోజంతా అమ్మిన డబ్బులతోనే మా జీవితాలు గడుస్తాయి. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంట్లోనే ఉండిపోతే పస్తులు పడుకోవాలి. అందుకే కష్టమైనా వచ్చాను’ అని చెబుతోన్న ఫాతిమా 30 ఏళ్లుగా ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.

శ్రీనగర్‌లో ప్రతి ఏడాదిలా ఈ ఏడాది లేదు. ఈ శీతాకాలం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా కాశ్మీర్‌ వాసులు, దాల్‌ సరస్సు గడ్డ కట్టే ఈ చలికాలం తీవ్రతను మూడు దఫాలుగా వర్గీకరిస్తారు. పర్షియన్‌ భాషలో ‘చిల్లై కలాన్‌’ (ఎక్కువ మంచు) అని పిలిచే కాలం డిసెంబరు 21 నుండి జనవరి 31 వరకు ఉంటుంది. ఆ కాలంలో చలి తీవ్రత ఎక్కువ. సరస్సు గడ్డ కట్టిపోతుంది. ఆ తరువాత ‘చిల్లై ఖర్డ్‌’ (కొంచెం చలి) జనవరి 31 నుండి ఫిబ్రవరి 19 వరకు లెక్కిస్తారు. ఇక మూడోది ‘చిల్లై బచా’ (పిల్ల చలి) ఫిబ్రవరి 20 నుండి మార్చి 2 వరకు పరిగణిస్తారు. ఈ మొత్తం కాలంలో ‘చిల్లై కలాన్‌’లో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. అయితే ఈ ఏడాది ఈ కాలం ముందే వచ్చింది. సుమారు 30 ఏళ్ల తరువాత అత్యంత చలి తీవ్రత గల డిసెంబరును శ్రీనగర్‌ వాసులు ఎదుర్కొన్నారు. దాదాపు 133 సంవత్సరాల క్రితం నాటి అత్యల్ప స్థాయి ఉష్ణోగ్రతలను చూశారు. దీంతో శ్రీనగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రజలను హెచ్చరించింది. చలి తీవ్రత వల్ల ప్రజలెవరూ బయటకి రావొద్దని ఆదేశించింది. చలి, గాలి కాలుష్యం ఎక్కువై హార్ట్‌ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పింది. అయినా ఈ అమ్మల బతుకుపోరాటం ఆగలేదు. తెల్లవారుజామునే, చుట్టూ కమ్ముకున్న దట్టమైన మంచులోనే తట్టాబుట్టా సర్దుకుని బయలుదేరుతున్నారు. వారి ప్రయాణం, ఎదురైన ఇబ్బందుల గురించి వారు ఏం చెబుతున్నారో చూద్దాం.

‘సరస్సులో నీళ్లు ఉన్నప్పుడు షికారా అని పిలుచుకునే పడవల గుండా ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. దీంతో సరస్సు చుట్టూ ఉన్న రహదారి గుండా ట్రాలీల మీద ప్రయాణిస్తున్నాం. కూరగాయలు, చేపలు అమ్ముకునేందుకు 8 గంటల సమయం ఉంటాం. ఒక్కోసారి అమ్మకాలు లేనప్పుడు 13 గంటలైనా అలాగే ఉండిపోతాం’ అని చెబుతోంది ఖాతిజా.

‘అక్టోబరులో జరిగిన మారథాన్‌కి భారతదేశంతో సహా 12 దేశాల నుంచి ఇక్కడికి 17 వందల మంది క్రీడాకారులు వచ్చారు. అప్పుడు మా వ్యాపారులకు అంతరాయం ఏర్పడింది. 15 రోజుల పాటు మమ్మల్ని ఈ దరిదాపుల్లోకి రానివ్వలేదు. గతంలో దాల్‌ సరస్సును ఆనుకొనే వ్యాపారాలు చేసుకునేవాళ్లం. కానీ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ప్రారంభమయ్యాక మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేశారు. రోడ్డుకి అవతల పక్కన ఉండి అమ్ముకుంటున్నాం’ అని ఫాతిమా చెబుతోంది.

మహిళలు, పెద్దవయసు వారు చలిలో వ్యాపారాలు చేసుకుంటుంటే అక్కడ ఎక్కడా కనీస వసతులు లేవు. తాగు నీరు లేదు. విశ్రాంత గదులు, మరుగుదొడ్లు లేవు. అయినా వీరు అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోడ్డంతా మంచు కప్పేయడంతో కూరగాయల అధిక బరువుతో ప్రయాణాలు చేస్తున్న వీరిలో చాలామంది ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. అయినా ఫుట్‌పాత్‌లపై చేపలు, కూరగాయలు అమ్ముకునేందుకు ప్రతి రోజూ ఇక్కడికి తరలివస్తున్నారు. మంచు వాకిట్లో మనుగడ సాగిస్తున్నారు.

➡️