తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. కర్నాటక, తమిళనాడులో కూడా వేర్వేరు పేర్లతో ఈ పండుగని జరుపుకుంటారు. దక్షిణాది వాళ్లు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగని కేవలం సంవత్సరం ప్రారంభమయ్యే రోజుగా గుర్తుంచుకుంటే సరిపోదు. కాలంలో వచ్చే మార్పుకు ప్రారంభంగా ఈ పండుగని గుర్తుంచుకోవాలి. అదే ప్రగతికి మూలం. ప్రకృతి గొప్పదనాన్ని ఈ పండుగ చాటిచెబుతుంది. ఆకురాల్చే శిశిరం వెంటే చిగుర్లించే వసంతకాల ముందన్న సత్యాన్ని చూపిస్తుంది. జీవితమంటే గెలుపోటములు, సుఖదు:ఖాల సమ్మేళనమని, సానుకూల దృక్పథంతో మన కృషి మనం కొనసాగించాలని చాటి చెబుతోంది.
ప్రగతి కేంద్రంగా సాగే ప్రకృతి, ఉగాది పండుగకి ఎక్కడలేని ప్రత్యేకతని తీసుకొస్తుంది. రాలిపోయిన ఆకులను చూసి ఏ చెట్టూ కుంగిపోదు. మోడువారిన చోటే కొత్త చిగుర్లు వేసి మార్పును స్వాగతిస్తుంది. చెట్ల నుండి నేర్చుకోవాల్సింది ఇదే. కోయిలలు తమ కుహూకుహూ గానాల నుండి ఆ మార్పును చూడమని చెబుతాయి. విరబూసిన పూలతో, కాయలతో, పండ్లతో శోభిల్లే కాలం ముందుందని ప్రతి చెట్టూ ఉగాదికి స్వాగతం పలుకుతాయి. చెట్టూ, చేమ.. పాడి, పంట ఉగాది కాలం నుండే కొత్త రూపాలు సంతరించుకుంటాయి. అందుకే ఉగాది ప్రకృతి పండుగ అయ్యింది.
అంతా అయిపోయింది అన్న చోట- ‘ఇంకా ఎంతో ఉంది’ అని చాటి చెప్పే సందర్భాన్ని వసంతం గుర్తుకుతెస్తుంది. జీవితమంటే – శిశిరంలాంటి ప్రతికూలతతో పోరాడి.. వసంతం వంటి చైతన్యంలోకి ప్రయాణించటమని చాటి చెబుతుంది. శూన్యం ఆవరించింది అనుకున్నా, ఆశ కోల్పోకూడదన్న సంకేతం ఇస్తుంది వసంత కాలం. శిశిరం కమ్మేసిన సుషుప్తావస్థ నుంచి, వసంతమనే మేల్కొలుపు మార్పుకు ఉగాది ఆరంభం.
ఉగాది పచ్చడి
ప్రకృతిలో దొరికే సహజ రుచులతో షడ్రుచుల సమ్మేళనంగా చేసుకునే ఉగాది పచ్చడి, ఈ పండుగ ప్రత్యేకతల్లో ఒకటి. తీపి, కారం.. చేదు, వగరు.. లవణం, పులుపు రుచులతో తయారుచేసుకునే ఈ పచ్చడి జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని చాటుతాయి. ఏ ఒక్క సంతోషానికో, దు:ఖానికో, బాధకో, సుఖానికో, లాభానికో, నష్టానికో, జీవితం పరిమితం కాదని జీవితమంటే అన్ని భావోద్వేగాల సమాహారమన్న పరమార్థం అందులో ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి మనిషి ఏం నేర్చుకోవాలి? వేటిని అనుసరించాలి? వేటిని విడిచిపెట్టాలి? అన్న జీవితసత్యం ఇది చెబుతుంది.
మార్పును చూడాలి
ఉగాది మనిషిని ఉన్నతీకరించే గొప్ప అర్థమున్న పండుగ. మార్పును చూడమని, మార్పు చుట్టూనే లోకప్రగతి దాగుందని చెప్పే ప్రకృతి పండుగ. గతం తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎక్కడివాళ్లక్కడే కూర్చుండిపోతే సమాజం ముందుకు సాగదు. రాలిపోయిన ఆకులను చూస్తూ చెట్టు ఏడుస్తూ కూర్చొంటే ఎప్పటికీ చిగురించలేదు. కాలం వెనక్కి పోతే ప్రగతి లేదు. కానీ ప్రస్తుతం మనిషి కాలంతో పాటు ముందుకు వెళ్లడం లేదు.
శతాబ్దాల క్రితం
చరిత్రను తిరగదోడుతూ అక్కడే కొట్టు మిట్టాడుతున్నాడు. అంతకంతకూ అగాధంలోకి కూరుకుపోతున్నాడు. పర్వదినాలు, పవిత్రస్నానాలు అంటూ అందులోనే మునిగితేలుతున్నాడు. ఉగాది నేర్పిన పాఠం ఇది కాదు..
ఇది ఆధునిక యుగం
ఇప్పుడు మనం రాజుల కాలంలో లేము. రాకెట్లు వేసుకుని అంతరిక్షంలో విహరిస్తున్నాం. ఆకాశహర్య్మాలలో నివసిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటిల్జెన్సీతో కలసి జీవిస్తున్నాం. ఇంతటి ఉన్నతిని సాధించిన మనిషి మూలాల్లోకి తొంగిచూస్తే.. మార్పు నుండే ఈ అభివృద్ధి సాధ్యమైందన్న సత్యం అవగతమవుతుంది. మార్పు మొదలైన నాటి నుండే మానవసమాజం అభివృద్ధి చెందడం మొదలైంది. ఆధునికతకి అదే కొలమానం.
పంచాంగ శ్రవణం
ఉగాది రోజున పచ్చడికి ఎంత ప్రాధాన్యం ఉందో పంచాంగ శ్రవణానికీ అంత ప్రాముఖ్యం ఉంది. ఆ రోజున ఏడాది మొత్తం ఎలా నడుస్తుందో పంచాంగ కర్తలు చెప్పటం ఆనవాయితీగా వస్తోంది. వానలు ఎలా కురుస్తాయి? ఏఏ పంటలు పండుతాయి? వంటి సంగతులను వివరిస్తారు. విజ్ఞానం ఇంతగా పెరిగిన దశలో వర్షాల రాక, సేద్యంలో మెలకువల గురించి చెప్పటానికి నేడు అనేక విభాగాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక తంతులా పంచాంగ శ్రవణం నడుస్తూనే ఉంది. రైతుల వెతలూ కతలూ ముడిపడి ఉన్నది పంచాంగంతో కాదని మనకు అర్థమవుతూనే ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు అవలంబించే విధానాలే సాగుదారుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సాగుకు సాయం, పంటకు ధర కావాలంటే- అడగాల్సింది ప్రభుత్వాలనే.
పంచాంగ శ్రవణాలు ఇప్పుడు ప్రహసనంగా మారిపోయాయి. రాజకీయ పంచాంగాలకైతే- కొద్దిపాటి పోలిక కూడా ఉండదు. ఒక్కో పార్టీ కార్యాలయంలో ఒక్కో రకం పంచాంగాలు నడుస్తున్నాయి. ఏ రోటి కాడ ఆపాట పాడటం అన్న చందాన నడుస్తున్నాయి. ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ పంచాంగాలు నేడు టీవి ఛానెళ్ల ప్రభావంతో ఇంటింటా వినిపిస్తున్నాయి. ప్రకృతి కొన్ని సూత్రాల ఆధారంగా మనకు ఆచరణను నేర్పింది. అలాంటి జాగురతను, జాగ్రత్తనూ ప్రదర్శించటం మంచిపని. మన పూర్వతరాల వారు తమ అనుకూలత, అవసరాల్లోంచి ఉగాది వంటి పండుగలను జరుపుకొంటే- మారిన పరిస్థితుల్లో మనం వాటినే మక్కికి మక్కి అనుసరించటం అశాస్త్రీయం. ప్రకృతి పట్ల అవగాహన, ప్రకృతితో సమన్వయం, పర్యావరణ స్ప ృహ, ప్రకృతి ప్రత్యక్షంగా, పరోక్షంగా నేర్పే పాఠాలను అన్వయించుకోవటం- విజ్ఞత. ఆ పరిధిని, పరిమితిని గుర్తెరిగి, ఉగాదిని మనం ఆస్వాదించాలి.
రైతు సంతోషమే నిజమైన ఉగాది
పరమార్థాలను పక్కన పెట్టి, పర్వదినాలను జరుపుకుంటే- వట్టి తంతు మాత్రమే అవుతుంది. ఇప్పటి రైతు పరిస్థితి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది కాదు. అంతా సవ్యంగా సాగిపోయే స్థితి లేదు. సాగునీరు, పెట్టుబడి, ఎరువులు, మందులు, వాటి ధరలూ, దిగుబడి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటివన్నీ ఆధునిక కాలపు అవసరాలు. వీటిని పంచాంగం తీర్చదు, ప్రభుత్వమే పట్టించుకోవాలి. రైతు శ్రమించి, వడ్డిస్తున్న వరిధాన్యాలనే మనం భుజిస్తున్నాం కాబట్టి- మనందరం అండగా నిలవాలి. అప్పుడే రైతుకు నిజమైన ఉగాది. దేశానికి బలమైన పునాది.
ఆరోగ్యమస్తు
ఉగాది ప్రారంభమే.. వేసవి ఆరంభం.. వేసవి జాగ్రత్తలు పాటించమని కూడా ఈ పండుగ చెబుతుంది. ఉగాది తరువాత ఎండలు పెరుగుతాయి. పిల్లలు, పెద్దలు డీహైడ్రేషన్‌కి గురికాకుండా చూసుకోవాలి. ఎండలు మండే వేళ చర్మ సంరక్షణతో పాటు శరీరాన్ని కాపాడుకోవాలి. శీతల పానీయాలకు బదులు ఇంట్లోనే సహజసిద్ధ పానీయాలు తయారుచేసుకోవాలి. ప్రాంతాలు వేరైనా ఈ రోజు ప్రతిఒక్కరూ చేసుకునే రకరకాల పిండివంటల్లో ఈ ఆరోగ్య సూత్రాలు తప్పకుండా ఉంటాయి.