మొక్క తెచ్చిన మార్పు

Mar 9,2025 23:44 #chinnari katha

రాలుగాయి పిల్లవాడు
రాముడనే ఒక బాలుడు
ఆటలకూ అల్లరికీ
ముందుండే కొంటెవాడు

చిన్నపిల్లలను గిల్లుట
తోటి బాలలను కొట్టుట
అలవాటుగ మారిపోయె
తగాదాలు పడుచుండుట

దండనతో మారడాయె
గురువులింక విసిగిపోయె
తండ్రికి విషయము చెప్పగ
అతడేమో తెల్లబోయె

కన్న తండ్రి దిగులుపడెను
తన తండ్రికి చెప్పుకొనెను
కొడుకు యొక్క దుడుకుతనము
అదుపులోన పెట్టమనెను

తాత మనవడిని పిలిచెను
విత్తనాలు అందించెను
ఓపిక తగ్గెను తనకని
అబద్ధాలనూ పలికెను

విత్తనాలు చల్లించెను
తగునీటిని పోయించెను
ప్రతి దినమూ ఉదయమునే
గమనించుట మరువకనెను

ఒకనాడా విత్తులన్ని
మొలకలుగా మారెనన్ని
సంబరాన గంతులేసి
చల్లె గింజలింక కొన్ని

గట్టి గింజ మొలకెత్తుట
నేల పొరలు చీల్చుకొనుట
రాముకెంతొ వింతగొలిపె
మొదలుపెట్టె ఇష్టపడుట

చిన్ని చిన్ని మొలకలుగా
పెరగసాగె ముచ్చటగా
మారాకులు తొడగసాగె
దినదినమూ దివ్యముగా

ఒకనాడొక పరీక్షలో
రాము ప్రథమ స్థానంలో..
గేటు వేయడం మరిచెను
వార్త చెప్పు తొందరలో

అయ్యో! ఒక మేక వచ్చి
పెరటిలోకి చొచ్చుకొచ్చి
మొక్కలన్ని మెక్కసాగె
ఆనందం ముంచుకొచ్చి

రాము గుండెలవిసిపోయె
బావురుమని కూలిపోయె
ప్రాణంలా పెంచుకున్న
మొక్కలన్ని చచ్చిపోయె

మరుసటిరోజున రాముడు
దురుసుతనము చూపలేదు
ఎత్తిన చేతిని దించెను
మొక్క వలెనె కద మిత్రుడు

తాను మొక్క పెంచినట్లు
ప్రాణముగా చూచినట్లు
ఏ తల్లయినా బిడ్డను
ప్రేమగాను సాకునట్లు

ప్రాణుల బాధించరాదు
తల్లులనేడ్పించరాదు
ప్రకృతినీ, ప్రాణులనూ
ప్రేమించుట మరువరాదు
– గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.

➡️