కాకి – కోకిల

May 9,2025 02:33 #feachers, #Jeevana Stories, #Kavitha

లక్ష్మీపురం ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కాకి, కోకిల ఉన్నాయి. ఒకరోజు కోకిల చెట్టుపై నుంచి కమ్మగా కూసింది. కాకి కూడా అదేవిధంగా కూయాలని ప్రయత్నించింది. కానీ కాకికి అలా కూయడం రాలేదు. కాకి ప్రయత్నం చూసి కోకిల బాగా నవ్వింది. ‘నువ్వు నాలా ఎప్పటికీ కూయలేవు. ఎందుకంటే నువ్వు కాకివి. నేను కోకిలని’ అని కాస్త గర్వంగా మాట్లాడింది.
మరుసటి రోజు ఒకతను గొర్రెలను, మేకలను తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు. సాయంత్రం అవుతుండగా కాకి, కోకిల ఉన్న చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో కోకిల చక్కగా కూసింది. అది విని ‘ఎలాగైనా కోకిలను తనతో తీసుకెళ్లాల’ని అతను అనుకున్నాడు. కోకిల కోసం ఓ వలని పన్నాడు. అమాయకంగా కోకిల అందులో చిక్కుకుంది. అదే సమయంలో కాకి అక్కడికి వచ్చింది. ‘తనని రక్షించమ’ని కోకిల వేడుకుంది. కానీ కాకి ‘నీకు ఇలా కావాల్సిందే’ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కాకి అలా అనడంతో కోకిల చాలా బాధపడింది. ‘నా గర్వంతోనే ఇలా అయింది’ అని మనసులో అనుకుంది. కాకి కూడా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాధపడింది. ఎలాగైనా కోకిలను రక్షించాలని తన మిగతా స్నేహితులను పిలిచి కాపాడింది. అప్పుడు కోకిల, కాకి మంచితనాన్ని గుర్తించి కాకితో స్నేహం చేసింది.

– రాచకొండ సిరివల్లిక,
10వ తరగతి,జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
రామంచ, సిద్దిపేట జిల్లా.

➡️