జమీందారు ఒక్కనాడు
ఊరువెళ్ల నెంచినాడు
పాలేరు బండితోల
పయనమై వెళ్ళినాడు.
గాలి వీచే నెమ్మదిగా
చినుకురాలే తుంపరగా
వాన పెద్ద దాయెను
బండి సాగదాయెను
ఒక్క పెద్ద గోతిలోన
చక్రము పడి పోయెను.
లాగలేక ఎండ్లు రెండు
మొరాయించ సాగెను.
అదే దారిన పోతున్న
రామయ్య చూసినాడు
తలపాగా పైకి చుట్టి
సాయము అందించినాడు
జమీందారు, పాలేరు
ఒక్కసారి నెట్టగానే
గోతినుండి చక్రం వచ్చే
ఎడ్లు కూడ లాగగా.
సమయానికి చక్కగ
సాయం అందించినావు
అంటూ ఆ జమీందారు
డబ్బులివ్వ చూపెను.
చిన్నపాటి సాయానికి
డబ్బులు నాకెందుకు
ఏదైనా పనివుంటే
ఇస్తారా చేసేందుకు.
నా పేరు రామయ్య
పనికోసం తిరుగుతున్న
అనగానే జమీందారు
తన వెంట రమ్మనెను .
చెప్పిన పనులన్ని చేసి
ప్రతిభను చూపించాడు.
ఇంత తెలివుండి కూడ
ఇలావుండి పోయినావు.
అన్న వారి మాటలకు
ఒక్కనవ్వు నవ్వి రాము
ఒక్కప్పుడు నేను కూడా
డబ్బులున్న ఆసామినే
మంచి సలహా ఇచ్చిన
గుమాస్తా మాట వినక
నష్టాలను చవిచూసి
ఈ స్థితికి వచ్చినాను.
ఆ సలహాలనే ఇప్పుడు
ఒక్కొక్కటి ఆచరింప
తెలివైన వాడనని
మీరు అనగ విన్నాను.
మంచి ఎవరు చెప్పినా
వెనువెంటనే వినాలి
చెడు చెప్పే వారిని
చూడనట్టు పోవాలి.
ఈ నిజం తెలుసుకొంటే
ఎదురుండదు ఏనాడు
అంటూ ఆ రామయ్యకి
అభినందన తెలిపాడు
– కూచిమంచి నాగేంద్ర,
91821 27880