ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు సినిమా పరిశ్రమలో ఆయా ప్రాంతాల్లోని మాండలిక యాసల ప్రయోగంతో కొందరు హిట్‌లు కొట్టేస్తున్నారు. ఆంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ యాసలను ఉపయోగించి తీసిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇదే కోవలో కొత్త సినిమాల్లో మాండలికాల ప్రయోగం బాగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ‘తండేల్’ సినిమాను చూస్తే తెలుస్తుంది. ‘రాజూ మన గురించి ఊళ్లోవాళ్లు ఏటేటో మాట్లాడుకుంతున్నారు రా. మన గురిండి మాట్లాతండ్రరతే… మనం ఫేమస్ అయిపోనట్టేనే’…’అందర్లెలాగూ మాట్లాకుంతుర్రుగా… అది నిజం చేసేస్తే ఎలాగుంతదాని’..’ఈ శివరాత్రి పండుగ నుంచి రాజుగాడే మన తండేల్’ అంటూ హీరోహీరోయిన్ల మధ్య సాగే డైలాగులు ఆత్యందం ఆకట్టు కుంటాయి. స్థానికత.. మాండలికాల ప్రయోగంతో ఈ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నాగచైతన్య ఆరేడు నెలలు బాగా కష్టపడ్డాడు కూడా. శ్రీకాకుళం జిల్లాలోని పలు మత్స్యకార గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన స్థితిగతులు, మాండలికాల యాసలను పరిశీలిం చారు. మరీ ప్రత్యేకంగా కె.మత్స్యలేశం గ్రామంపై బాగా కేంద్రీకరించారు. అక్కడి ప్రజల జీవనం, ఆహార, వ్యవహారాలను బాగా దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్నారు. ఈ సినిమా కోసం నాగచైతన్య తన శరీరాకృతిని కూడా మార్చు కున్నారు. ఇందులో బెస్తవాడి పాత్రలో పూర్తిగా లీనమైపోవటం సినిమాలో చూడొచ్చు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సెట్ అయ్యింది. అలా మారటానికి కొన్ని నెలలపాటు శ్రమించాల్సి వచ్చిందని పలువేదికలపైన నాగచైతన్య తెలిపారు. శ్రీకాకుళం యాస నేర్చుకోవటానికి చిత్ర యూనిట్‌కు కొన్ని వర్కుషాపులు సైతం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు దర్శకుడు చందు మొండేటి. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ పెక్యులర్ డిజైన్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో నాగచైతన్య రూపం సరికొత్తగా అనిపించింది. బన్నీ వాసు, అరవింద్ ప్రతిష్టాత్మంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి నటించిన చిత్రం కావటం మరో ప్రత్యేకత.
స్థానికత ఉంటే హిట్టే..
‘చెప్పే కథ ఎంత స్థానికంగా ఉంటే.. దానికంత ప్రపంచ ఆదరణ’ అంటూ ‘కాంతార’ దర్శకుడు రిషబ్ చెప్పిన విషయం అక్షర సత్యంగానే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో మట్టిపరిమళాలు పులుముకొని వెండితెరపై గుభాళించిన పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. అందుకోసమే నవతరం దర్శకులు, కథానాయకులు ఈ పంథాలో ముందుకు సాగుతున్నారు. ఆయా ప్రాంతాల తాలూకూ యాసలు, జానపదులు వినిపించడమూ పరిపాటిగా మారింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడీ తరహా ప్రయోగాలు చేసేందుకు అగ్ర కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ట్రెండ్ మారింది
తెలుగు ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసతో సొగసు వినిపించినా.. సినిమాలకు వచ్చే సరికి ప్రామాణిక భాషే తరచుగా వినిపించేది. గతంలో హాస్య పాత్రలకో లేదంటే ప్రతి నాయక పాత్రలకో పరిమితం చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యాసలు కథానాయకుల గళంలో సరికొత్తగా హీరోయిజం ఒలికిస్తున్నాయి. మట్టి కథలకు మరింత సహజత్వాన్ని అద్ది ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచిస్తున్నాయి. ‘తొంగి తొంగి.. నక్కి నక్కి గాదే… తొక్కుకుంటూ పోవాలే..ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో కొమరం భీమ్‌గా తెలంగాణా యాసతో ఎన్టీఆర్ హీరోయిజాన్ని పంచారు. ‘వాల్తేరు వీరయ్య’లో కథానాయకుడు చిరంజీవి కూడా శ్రీకాకుళం యాసలో దుమ్ముదులిపేశారు. రవితేజ తెలంగాణా యాసలో సినీ ప్రియులను మురిపించారు. బాలకృష్ణ సినిమాల్లో రాయలసీమ, తెలంగాణా యాసలు బాగా కన్పిస్తున్నాయి. ‘దసరా’ సినిమాలోనూ నాని, కీర్తిసురేష్ తెలంగాణా యాసలో మాట్లాడారు.
‘పుష్ప’ అంటే ఫ్లవరనుకుంటివా..ఫైరు’ అని చిత్తూరు యాసలో అలరించారు కథానాయకుడు అల్లు అర్జున్. ‘రంగస్థలం’లోనూ గోదావరి యాసను కథానాయకుడు రామ్‌చరణ్ మాండలిక సంభాషణలు వినిపించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ విశ్వక్‌సేన్ గోదావరి యాసలో అలరించారు. డీజే టిల్లు, టిల్లులో కూడా మల్కాజ్‌గిరీ కుర్రాడిగా తెలంగాణా యాసలో సిద్ధు జొన్నలగడ్డ అదరగొట్టారు.
‘ఫిదా’లో ‘సారంగ దరియా’ నుంచి ‘ధమాకా’లోని ‘పల్సర్‌బైకు’, ‘దసరా’లో ‘చమ్కీల అంగీలేసి’ వరకూ, తండేల్‌లో ‘హైలెస్సా..హైలెస్సా’ వరకు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జానపదాలు చాలా ఉన్నాయి. అల వైకుంఠపురం సినిమాలో ‘సిత్తరా సిరపడు… సిత్తరాల సిరపడు…పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు’ అంటూ జానపద కళాకారుడు బాడ సూరన్న పాట బాగానే ఆకట్టుకుంది. ‘బలగం’లోని కథ కూడా నిజజీవితంలో జరిగే అంశాలనే ప్రస్తావించటంతో బాగా ఆకట్టుకుంది. ఇవేకాకుండా జాతిరత్నాలు, విరాటపర్వం, రుద్రంగి, తుపాకులగూడెం, భరతనాట్యం, మీకు మాత్రమే చెప్పా, శరపంజరం, తురుమ్‌ఖాన్లు, షరతులు వర్తిస్తాయి, సర్కార్‌నౌకరి తదితర సినిమాలు కూడా మండలికానికి ప్రధాన్యమిస్తూ వచ్చాయి. సీనియళ్లలోనూ మాండలిక యాసలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా… సికాకుళంలో చీమలన్నయట.. ఏం పిల్లడో వెల్దమొస్తవా’ అంటూ తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు వంగపండు ప్రసాద్. అభ్యుదయ కళాకారులైన టి.కృష్ణ, ఆర్.నారాయణమూర్తిలతోపాటు ఎంతోమంది తమ సినిమాలకు పాటలు రాయించుకున్నారు. స్థానిక యాసలో హీరో, హీరోయిన్లు మాట్లాడినప్పుడు ప్రేక్షకులు కథను చాలా దగ్గరగా తీసుకుంటున్నారని, తమకు తెలిసిన జీవితంగా భావిస్తున్నారని సినీ పండితుల విశ్లేషణ.