మెప్పు కోరిన చిలుక

Feb 1,2025 03:16 #feachers, #jeevana, #Kavitha

ముద్దు ముద్దు చిలుక ఒకటి
ముచ్చటైన చిలుక ఒకటి
తన అందం చూసి మురిసి
పలికెతోటి చిలుకతోటి

‘గుంపులోన నేనుంటే
మీతో తిరుగుతు ఉంటే
నన్నెవరూ గుర్తించరు
కలిసుండుట పొరపాటే’

తక్షణమే చెట్టు వీడి
బొంతకాకి గుంపు కూడి
ప్రత్యేకత నిలిచిందని
మురిసిందది ఆడిపాడి

కాకులన్ని పొగడసాగె
రాణివలే చూడసాగె
ముద్దు చిలుక సంతోషం
ముప్పేటగ పెరగసాగె

ఒకనాడా కాకిమూక
వెడలెను తిరణాల దాక
చిలుక కూడ అతిశయాన
ఎగిరి వెళ్ళె వాటి వెనుక

కాకిగుంపులో చిలుకను
అందరు వింతగ చూచిరి
పంజరాన బంధించగ
ప్రయత్నాలు సాగించిరి

కాకినెవరు పట్టుకోరు
పంజరాన పెట్టబోరు
వీటితోటి మసలుచున్న
నన్నే పసికట్టు వారు

కాకులకిది పట్టలేదు
చిలుకను రక్షించలేదు
తోటి కాకిపైన శ్రద్ధ
చిలుకపైన చూపలేదు

ఒక కాకికి దెబ్బ తగల
చెప్పలేని కాకిగోల
తాను కోరి చేరిననూ
తనపై చులకనా? ఏల?

కాకులు చెత్తను తిన్నా
గొంతు బాగు లేకున్నా
వదిలి వెళ్ళలేదు సదా
వాటితోటి కలిసున్నా

మెప్పు మాట దేవుడెరుగు
ముప్పు ముంచుకొచ్చి పరుగు
చిలుకలతో నేనుంటే
ప్రమాదము ఎంతో తరుగు

చిలుక తప్పు తెలుసుకొనెను
తనవారిని చేరుకొనెను
సందడి చేసే చిలుకల
సవ్వడి హాయిని గొలిపెను

స్వార్థ బుద్ధి చూపరాదు
తనవారిని వీడరాదు
తాత్కాలిక ఆనందం
ఉచ్చులోన చిక్కరాదు

రూపు చూసి మెచ్చాలని
పొగడ్తలను పొందాలని
ఆశ మాని తెలుసుకొనెను
గుణము మంచిదవ్వాలని …

– గుడిపూడి రాధికారాణి,
94949 42583.

➡️