విశ్వం, భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాల చుట్టూ ఉన్న అపోహలను అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం పటాపంచలు చేయడం ప్రారంభించి చాలా కాలమైంది. సునీతా విలియమ్స్, విల్‌మోర్ అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి చేరిన వేళ, ఈ చర్చ మరోసారి జరుగుతోంది. ఈ వ్యోమగాముల ప్రయాణం, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు ప్రతిదీ అద్భుతం. సునీతా విలియమ్స్ తొలుత ఏదో కావాలని అనుకొంది. కానీ, తన ముందుకొచ్చిన అవకాశాన్ని శ్రద్ధ, సాధన, అంకితభావంతో అందిపుచ్చుకొని, అంతరిక్షంలో విజయపతాక ఎగురవేసింది.
ఆమె విజ్ఞానయాత్ర నేటి తరానికి ఆదర్శప్రాయం.
సునీతా విలియమ్స్.. చరిత్రలో నిలిచిపోయే సాహసాలకు చిరునామా. బాల్యంలో అందరి పిల్లల్లాగే తనకి కల్పిత కథలంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. కుక్కపిల్లలతో ఆడుకుంటూ పెరిగింది. పాండ్యాలతో కలసి అల్లరి చేసేది. ప్రకృతిపై ప్రేమ పెంచుకుంది. మెరైన్ బయోలజీలో ప్రయోగాలు చేసింది. చంద్రుడిపై మానవుడు కాలుపెట్టిన ఘటనని టీవీల్లో చూసి సంతోషంతో గంతులు వేసిన బాల్యం ఆమెది. పిల్లలందరూ ఇలానే ఉంటారు. వెటర్నరీ డాక్టరుగా స్థిరపడాలనుకున్న సునీత అంతరిక్ష ప్రయోగాల వైపు ప్రయాణించి, ఎన్నో విజయాలు సాధించారు.
సునీత తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్ నుంచి అమెరికాకి వలసవెళ్లారు. సునీత అక్కడే పుట్టింది. సునీత బాల్యం గురించి తండ్రి దీపక్ ఒకసారి ఏం చెప్పారంటే.. ‘తనకి గాల్లో ఎగరడం కంటే నీళ్లల్లో ఈదడం చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే స్విమ్మింగ్ నేర్చుకోవాలని అకాడెమీలో కూడా చేరింది. యుఎస్ నావీ అకాడెమీలో 1983లో చేరిన సునీత బైక్ రేసింగ్‌లో కూడా రాణించింది. స్విమ్మింగ్, రేసింగ్, ఫ్లైయింగ్ ఒకదానిని మించి మరొకదానిలో విశేష ప్రతిభ ఆమె సొంతం. 1990లో గల్ఫ్ వార్ సమయంలో కార్గో షిప్‌లో రవాణా సరుకులు సరఫరా చేసింది.
ప్రతిదీ రెండో అవకాశమే!
సునీతా సాగించిన ఈ ప్రయాణంలో ప్రతిదీ ఆమె ఫస్ట్ చాయిస్ కాదు.. మొదటి అవకాశం అందక, రెండోదానికి షిప్ట్ అయి, అందులోనే విజయాలు సాధించింది. అథ్లెటిక్‌గా రాణించాలనుకుంది. నేవీలో చేరింది. డైవింగ్‌పై ఆసక్తి ఉంది. ఏవియేటర్ అయ్యింది. జెట్ విమానాలు నడపాలని కలలుగంది హెలికాఫ్టర్లు నడపాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో అంతరిక్ష ప్రయోగాలు ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఎప్పుడైతే జాన్సన్ స్పేస్ సెంటర్‌ని సందర్శించిందో అప్పటి నుండే ఆమె గమ్యం మారిపోయింది. 11 ఏళ్లు యుఎస్ నేవీలో విధులు నిర్వహించిన సునీత పలుమార్లు నాసా ఆస్ట్రోనాట్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంది. 1998లో 18వ బ్యాచ్‌కి ఆమెకి అవకాశం వచ్చింది. ఆ తరువాత సునీత ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. గతేడాది జూన్‌లో అంతరిక్షానికి బయలుదేరిన సునీత 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత బుధవారం తెల్లవారుజామున భూమి మీదకి చేరుకున్నారు. అయితే 9 రోజుల్లో తిరిగి రావాల్సిన వారు 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది.
వీళ్లు కూడా ఉన్నారు..
సునీత, విల్‌మోర్ కంటే ముందే అమెరికన్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2022 నుంచి 2023 వరకు దాదాపు 371 రోజులు అంతరిక్షంలో గడిపాడు. నాసాకి చెందిన విలియం ఎం. షెపర్డ్, రష్యాకి చెందిన యూరి పి. గిడ్డెంకో,సెర్గీ కె. క్రికాలెవ్ 2000 నవంబరు 2న నాలుగు నెలల మిషన్ కోసం ‘ఐఎస్‌ఎస్’ (అంతరిక్ష నౌక) ఎక్కిన మొదటి వ్యోమగాములు. అప్పటి నుంచి అంతరిక్షానికి తరచూ మానవుల ప్రయాణం కొనసాగుతూనే ఉంది.
ఐఎస్‌ఎస్ అంటే ఏంటి?
ఐఎస్‌ఎస్ అనేది ఒక అంతరిక్ష పరిశోధనా కేంద్రం. అంతరిక్షంలో వివిధ గ్రహాలను పరిశీలించటానికి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయటానికి ఇది ఒక ప్రయోగశాల. అంతరిక్షంలో జీవించటం, పండించటం వంటివి ఎలా సాధ్యం అన్న పరిశీలనలు, పరిశోధనలు అక్కడ జరుగుతాయి. జీవ, రసాయన, సాంకేతికత సంబంధిత అంశాలపై వ్యోమగాములు ప్రయోగాలు చేస్తారు. అంతరిక్షంలో ప్రకాశిస్తూ కనిపించే ఈ అంతరిక్ష నౌకని భూమిపై నుంచి కూడా మనం కంటితో చూడవచ్చు.
యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్ వంటి 15 దేశాలు నిర్మించి నిర్వహిస్తున్న ఈ అంతరిక్ష నౌక 1998 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ జాబితాలో మన దేశం లేదు. ఇది భూమి నుంచి 240 మైళ్ల ఎత్తులో ఉంది. ప్రతి 24 గంటలకు భూమి చుట్టూ 16 భ్రమణాలను పూర్తి చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఒక్క రోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూడొచ్చు.
ఏమేం ఉంటాయంటే …
ఈ కేంద్రంలో ఆరు బెడ్ రూమ్స్, రెండు బాత్రూమ్‌లు, ఒక జిమ్, 360 డిగ్రీల వ్యూలో పెద్ద కిటికీ ఉంటుంది. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ ఉండదు. అందుకే ఈ నౌకలో వ్యోమగాములు గాల్లో తేలుతూనే తినడం, నిద్రపోవడం, స్నానం చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటి పనులన్నీ చేసుకోవాలి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్లీపింగ్ బ్యాగుల్లోకి వెళ్లి నిద్రపోతారు. చుట్టూ పరికరాలు చేసే శబ్దం వినిపించకుండా ఇయర్‌ప్లగ్‌లు ఉపయోగిస్తారు.
నీటి చుక్క చిందకుండా..
ఈ అంతరిక్ష కేంద్రంలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు, మిరియాలు వంటివి కూడా ద్రవరూపంలోనే తీసుకెళతారు. ఏ చిన్న నీటిచుక్క బయటికి చిందినా అది కూడా తేలుతూనే ఉంటుంది. ఆ నీటిబిందువు తేలుతూ తేలుతూ ఏదేని పరికరంలోనికి చొచ్చుకునిపోతే సాంకేతిక సమస్య రావచ్చు. స్నానం, ముఖం కడుక్కోవడం వంటి నీళ్లతో అవసరమైన ప్రతి పనినీ తడి టవళ్లతో కానిచ్చేస్తారు. ఆఖరికి జుట్టు కడుక్కోవడానికి కూడా షాంపూ పూసి, ఆపై తడి టవల్‌తో శుభ్రం చేసుకుంటారు. ఈ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను పండించుకోవొచ్చు. తాజా, పోషకమైన ఆహారం తక్కువ ఉత్పత్తిలో ఇక్కడ పండించుకోవచ్చని నాసా 2015లో చెప్పింది. సునీతా, విల్‌మోర్ కూడా తాము పండించుకున్న ఆహార ఉత్పత్తులను ఫొటోలు తీసి పంపారు.
జిమ్ ఎందుకంటే …
మానవ శరీరం గురుత్వాకర్షణ శక్తికి లోబడి భూమి మీద జీవించడానికి వీలుగా ఉంటుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి, అక్కడ ఎముకలపై పెద్దగా భారం పడదు. దీంతో తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఎముకల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య తీవ్రమవ్వకుండా ఉండేందుకు వ్యోమగాములు ఎప్పటికప్పుడు తమ శరీరాన్ని భార రహితం నుంచి భారహితంగా చేసుకుంటారు. అందులో భాగంగానే థ్రెడ్‌మిల్‌పై నడవడం, జాగింగ్, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేస్తుంటారు. అందులో అక్కడ జిమ్ ఉంటుంది. అంతరిక్షంలోని ప్రవేశించిన కొన్ని రోజుల వరకు వ్యోమగాములు అక్కడి వాతావరణం సరిపడదు. అనారోగ్యానికి గురవుతారు. కొంతకాలం తరువాత అలవాటు పడినా, శరీర ద్రవాలు పైభాగంలో పేరుకుపోతాయి. దీనివల్ల వ్యోమగాములు ముఖాలు ఉబ్బినట్లు, ఎర్రగా మారతాయి. అక్కడికి వెళ్లిన ప్రతి వ్యోమగామికి ఒక నిర్దిష్ట పని కేటాయిస్తారు. ప్రత్యేక వైద్య వ్యోమగామి అందుబాటులో ఉంటారు. ఆహార పదార్థాలను ఆరు నెలలకు ఒకసారి కార్గో షిప్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు.
ఈ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు భూమ్మీద ఉన్నప్పుడు చేసే చాలా పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో రోజూ మాట్లాడతారు. దీనికి ప్రత్యేకమైన సమాచార వ్యవస్థ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. విద్యార్థులతో మమేకమవుతారు. సునీత అమెరికా ఎన్నికల్లో తన ఓటు హక్కును అక్కడినుంచే వినియోగించుకున్నట్టు వార్తలు వచ్చాయి.