సాలీడు గూడు

అమెజాన్‌ నదీ పరీవాహక ప్రాంతంలో సూర్యరశ్మి నేలను తాకనంత దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో చెట్టుకొమ్మల మధ్య చక్కని గూడు కట్టుకుంది సాలీడు. ఆ గూటిలో చిక్కుకున్న క్రిమి కీటకాలను తిని హాయిగా జీవిస్తోంది. ఇలా కాలం గడిచింది.
ఒకరోజు ఒక కప్ప పిల్ల సాలీడుని తినాలని అనుకుంది. ఆకు మీద నుంచి ఎగిరి సాలెగూడు మీద పడింది. అయితే అది సాలెగూడులో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ దారాల నుంచి బయటపడలేకపోయింది.
గూడు కదలడంతో ఎవరో తన గూట్లోకి వచ్చి చిక్కుకున్నారని, తినవచ్చని సాలీడు భావించింది. కానీ వచ్చి చూసేసరికి అది కప్ప పిల్ల. తినడానికి పనికొచ్చేది కాదు. కప్పపిల్ల విడిపించుకోడానికి తీవ్ర ప్రయత్నం చేసి, వీలుకాక నిశ్చలంగా ఉండిపోయింది. కప్పపిల్ల అవస్థ చూసి సాలీడు చాలా బాధపడింది. ఎంతో కష్టపడి కట్టుకున్న గూడును నోటితో కొరికి కప్ప పిల్ల ప్రాణాలను కాపాడింది.
‘నీ గూటిలో నుంచి బయటపడటం నా వల్ల కాలేదు ఎంతో ప్రత్యేకమైన నీ గూటి రహస్యం చెప్పవా? అని అడిగింది కప్ప పిల్ల. దానికేం భాగ్యం చెప్తాను విను ‘నా శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం ఛాతీ భాగంతో కలసి ఉంటుంది. నాకు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంధులు ఉంటాయి. గ్రంధుల నుండి స్రవించే చిక్కటి జిగురు వంటి ద్రవపదార్థం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఆ దారంతో చెట్టుకొమ్మల మధ్య చక్కగా వల లాగ గూడు అల్లుతాను. నాకు నమిలే అవయవాలు లేవు. నోటిలో స్రవించే విషం ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అని చెప్పింది సాలీడు.
‘నేను నిన్ను తినడానికి వచ్చానని తెలిసి కూడా నన్ను ఎందుకు రక్షించావు?’ అని అడిగింది కప్పపిల్ల. ‘ఆహార సంపాదన కోసం ఎవరి ప్రయత్నం వారిది. ఆ సమయంలో నా గూటిలో చిక్కుకున్నావు. అంత మాత్రం చేత నిన్ను ఆహారంగా తీసుకోలేను. నీ బాధ చూడలేక నీకు సహకరించాను’ అంది సాలీడు. సాలీడు ఔదార్యానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది కప్పపిల్ల.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు, ఆంగ్ల ఉపాద్యాయులు,
జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, లక్కవరపు కోట,
94945 24445.

➡️