రంగస్థలంలో రాణించి బుల్లితెర.. ఆపై వెండితెరపై అలరిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. 65 సినిమాల్లో నటించినా నేటికీ నాటకరంగ ప్రస్థానాన్ని వదలకుండా వెండితెరపై తన మార్కు నటన ప్రదర్శిస్తున్న నటులు గోపరాజు రమణ. గంభీరమైన కంఠం.. నిండైన విగ్రహం.. ఆజానుబాహుడైన ఆయన్ను చూడగానే ‘మిడిల్‌క్లాస్’ సమాజం కనబడుతుంది. టాలీవుడ్ హీరోలకు తండ్రిగా ఆయన తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మాటలో స్పష్టత, వాచకంలో విభిన్నత, అహర్యంలో జీవించేతత్వం.. మాటలో మాధుర్యం.. నటనలో వైవిధ్యంతో టాలీవుడ్‌లో ఫాదర్ రోల్‌కు కేరాఫ్‌గా ఆయన నిలుస్తున్నారు.
73 ఏళ్ల వయస్సులోనూ ఆయన తనకు వచ్చిన పాత్రల్లో నటిస్తూ నటనలో సరికొత్త వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన నటించిన సినిమాలు సింహభాగం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినవే. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన గోపరాజు యజ్ఞేశ్వర వెంకట రమణమూర్తి (గోపరాజు రమణ). రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన సుపరిచితులు. ఆయన గ్రహణం (2004)లో వచ్చిన సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రంగ ప్రవేశం చేశారు. ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం మిడిల్‌క్లాస్ మెలోడీస్ (2020). ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో నటన కూడా బాగా మెప్పించింది. సినిమాల్లో నటించక ముందు అనేక నాటకాల్లో నటించారు.
మిడిల్‌క్లాస్ మెలోడీస్‌తో సరికొత్త గుర్తింపు
మిడిల్‌క్లాస్ మెలోడీస్ సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రిగా కొండలరావు పాత్ర అదరగొట్టేశారు. అద్భుత నటనతో మధ్య తరగతి ప్రజల వెతలను జొప్పించారు. 1996లోనే ఇండిస్టీలోకి వచ్చి చాలా సినిమాల్లో నటించారు. కానీ తనకు తగ్గ పాత్ర రాలేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ మాత్రం ఆయన దశను, దిశను మార్చేసింది. ఆ సినిమా నుంచి ఆయన బాగా బిజీ అయిపోయారు. 73 సంవత్సరాల వయస్సులోనూ ఆయన నటుడిగా బిజీగా ఉన్నారు. పాఠశాల విద్య స్థాయిలోనే తన కెరీర్‌ను నటుడిగా నాటక రంగంలో ప్రారంభించారు. తెలుగు మాస్టారు పిన్నక వెంకటేశ్వరరావు ప్రోత్సహించటంతో.. పాఠశాలలో లోయర్, హయ్యర్ విభాగాల్లో పోటీలు జరిగేవి. తొలి ప్రదర్శనతోనే రమణ బహుమతిని అందుకోవటంతో మాస్టారు మరింతగా ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆవుల సాంబశివరావు రాసిన ‘మానవుని అడుగుజాడల్లో’ నాటకంలో ‘విష్ణుమూర్తి’గా నటించి మెప్పించారు. ఇందులో నటనకు ఆయన ఉత్తమ బహుమతి కూడా లభించింది. 1967లో బాలానంద సంఘం నల్లకుంట అనే నాటక సంస్థలో చేరి అక్కడ సక్కుబాయి, స్ట్రైక్, పాలిష్ భయ్యా వంటి నాటకాల్లో నటించారు. ఆ తర్వాత కాలంలో ఆలిండియా రేడియోలో అనేక నాటకాల్లో కూడా పాల్గొన్నారు. 1994 నుంచి టెలివిజన్ రంగంలో నటించడం ప్రారంభించారు. బామ్మ గారి మరచెంబుతో ప్రారంభించి పద్మవ్యూహం, ముద్దమందారం, మహాలక్ష్మి, చిన్న కోడలు … ఇలా పలు సీరియల్లలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న క్యారెక్టర్ నటుడు గోపరాజు రమణ.
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే….
రమణ కుటుంబం తాతముత్తాతల నుంచి కరణీకం చేసేవారు. ఇదే వారసత్వాన్ని ఆయన కూడా అందుకున్నారు. రెండో అక్క తెలుగు పండితురాలు కావటంతో ఆమె కూడా నాటకాలను ప్రోత్సహించేవారు. అంబి, పురుషోత్తముడు, నేరస్తుడు ఎవడు? వంటి ఏకాంకిక నాటికలను మూడో అక్కయ్య, అన్నయ్యతోపాటుగా ఆయనతోపాటుగా చదువుకునే మరికొందరు మొత్తంగా 10 మందికిపైగా ఒక బృందంగా ఏర్పడి నాటకలు, నాటిక ప్రదర్శనలు మూడేళ్లపాటు చేశారు. ఆ తర్వాత అక్క హైదరాబాద్‌కు ఉద్యోగం రీత్యా వెళ్లిపోయారు. ఆయన చదువుకు ఆటంకం ఏర్పాటుతుందని భావించి తనతోపాటు హైదరాబాద్ తీసుకెళ్లారు. 1964లో నల్లకుంట బాలానంద సంఘంలో చేర్పించారు. అక్కడ జమ్మలమడక పూర్ణచంద్రరావు (సెక్రటరీగా) నిరంతరం నాటకాలు వేస్తుండేవారు. దసరా, ఇతర పండుగల సమయంలో నాటక ప్రదర్శనలు బాగా జరిగేవి. దసరా కాంపిటేషన్‌లో ‘పాలిష్‌బయ్య’ నాటిక ప్రదర్శించగా ఆయనకు ఉత్తమ విలన్ అవార్డుకు ఎంపికయ్యారు. రేడియో అక్కయ్య, అన్నయ్య గారి ఇంటి వద్ద కాంపిటేషన్స్ జరిగేవి. టాం షాయర్ ఇంగ్లీష్ నాటకం తెలుగు ధారావాహిక, సక్కుబాయి వంటి వాటిలో నటించారు. ఆ తర్వాత 1969లో కొలకలూరు తిరిగి వచ్చేశారు. 1970లో కరణికం పరీక్ష రాయగా రెవెన్యూ విభాగంలో గ్రామాధికారిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే, తోటి మిత్రులు, గ్రామ ప్రజలు ప్రోత్సాహంతో మళ్లీ నాటక ప్రదర్శనలు ప్రారంభించారు. అప్పట్లో ఏడాదికి మూడు నుంచి నాలుగు వరకూ ప్రదర్శనలు ఇచ్చేవారు. 1984 ప్రాంతంలో శివరాత్రి, ఇతర పండుగల సమయంలో నాటక ప్రదర్శనలు చేసేవారు. అప్పట్లో తలో కొంత చందాలు వేసుకుని వీటిని నిర్వహించేవారు. ఒక్కోసారి మిగతా కళాకారులకు ఇవ్వాల్సిన మొత్తాల కోసం ఉంగరాలు తాకట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
‘శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు’తో …
అనంతరం ‘శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు’ కళాపరిషత్‌ను రమణ 1990లోనే ఏర్పాటు చేశారు. ఆరిశెట్టి శివన్నారాయణ నాటక రచనలు చేస్తే వీరి దర్శకత్వంలో తన రెండో కుమారుడు విజరు, మరి కొంతమంది కళాకారులతో 2008 వరకు వందలాది ప్రదర్శనలు ప్రదర్శించారు. ఆ తర్వాత నుంచి విజరు సంస్థ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విజరు దర్శకత్వంలో 15 నాటికలు, ఆరు నాటకాల్లో ఆర్టిస్ట్‌గా రాణించి ఉత్తమ నటుడు నంది కైవసం చేసుకున్నారు.
వెండితెరపై ‘మిడిల్‌క్లాస్’కు ప్రతిరూపం
వెండితెరపైకి వచ్చి ‘గ్రహణం’ ‘మాయాబజార్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అష్టాచెమ్మా’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ పాత్రలు ఆయన ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ సినిమాలోని కొండలరావు పాత్ర ఆ లోటు భర్తీ చేసి, ఆయన గురించి అటు చిత్ర పరిశ్రమ- ఇటు ప్రేక్షకులు చర్చించుకునేలా చేసింది. దాని తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ‘ఎఫ్ 3’ ‘బెదురులంక 2012’ రంగబలి, జనక అయితే గనక, స్వాగ్, కమిటీ కుర్రాళ్ళు, ఇలా ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలతో సందడి చేశారు.
మరింత ప్రోత్సాహించారు : గోపరాజు రమణ, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్
ఉద్యోగ నిమిత్తం 1998లో హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రమణాచారి, చాట్ల శ్రీరాములు, దుగ్గిరాల, నాగభూషణ శర్మ గార్లు రసరంజని సంస్థ ద్వారా ఆయన్ను చేర్చుకున్నారు. చాలా నాటకాలు ఆడించారు. ఆయనకు నాటకాలు నేర్పిన దర్శకులు 60 మంది వరకూ ఉన్నారు. రత్నగిరి రావు, బొల్లిముంత కృష్ణ, మక్కపాటి కృష్ణమోహన్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, గుమ్మడి గోపాలకృష్ణ, డి.ఎస్.ఎన్.మూర్తి, కోట్ల హనుమంతరావు గార్లు తమ నాటికల్లో ప్రముఖ పాత్ర ఇచ్చి మరింత ప్రోత్సహించారు.
– యడవల్లి శ్రీనివాసరావు