‘డాక్టరుకి ఇచ్చే గౌరవమే ఆటోడ్రైవరుకీ ఇవ్వండి’ అన్న వాక్యంతో మొదలౌతుంది 13 ఏళ్ల దివ్యదర్శిని రాసిన డెబ్యూ కథ ‘డా.ఆటో’. ‘పూలచెండు’ కథల సంపుటిలో నాన్న రెండో వివాహంతో తొలి కథ మొదలైతే, సవితి తల్లి కూతురుతో తన అనుబంధం గురించి రెండో కథలో వివరిస్తుంది 13 ఏళ్ల అగళ్య. ఫ్రెండ్స్‌తో గొడవై, వాళ్లకి క్షమాపణ చెప్పేందుకు ఓ కథ రాస్తుంది 13 ఏళ్ల సంజన. డ్రగ్‌కి బానిసైన వ్యక్తి కుటుంబ దుర్భర పరిస్థితులను వివరిస్తూ, పెద్దయ్యాక ఐపిఎస్ ఆఫీసర్‌గా మాదకద్రవాల్యని నిరోధించాలని కలలు గంటోంది తను. తప్పులు వస్తాయన్న భయంతో రాయడం మానేసిన 12 ఏళ్ల జ్యోతి శ్రీ, ‘కథల పండగ’ పుస్తకానికి మూడు నాటికలు రాసింది. ఈ బాల సాహిత్యకారుల్లో దాగున్న సృజనని వెలికితీయడం, ప్రోత్సహించడం వెనుక తమిళనాడుకి చెందిన 58 ఏళ్ల థామస్ కృషి ఎంతో ఉంది.
థామస్ … పిల్లలు రాసిన కథలను, పుస్తకాలను స్వయంగా తానే ప్రచురించి ప్రోత్సహిస్తారు. కథా రచయితగా అందరికీ సుపరిచితుడైన థామస్ మరో గుర్తింపు వెంట్రిలాక్విస్ట్. ఈ కళతోనే ఆయన పిల్లలకి దగ్గరవుతారు. పిల్లలతో మాట్లాడతారు. వాళ్ల భయాలు పోగొడతారు. వాళ్ల భావాలు, భావోద్వేగాలను రచనల రూపంలో రాయమని ప్రోత్సహిస్తారు. అందుకే ఈ పిల్లలందరూ థామస్‌ని ‘మాస్టారు’ అని గౌరవంగా పిలుచుకుంటారు.
‘క్యారీ విత్ లవ్’ ట్రస్టు నిర్వాహకుడైన థామస్‌కి పిల్లల్లో దాగున్న సృజనని వెలికితీయడంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. ఆ ఆసక్తితోనే పిల్లల కథల పుస్తకాలను ప్రచురించారు. 11 పుస్తకాలను స్వయంగా రాసి వెయ్యి కాపీల వరకు ముద్రించారు థామస్. ‘ప్రచురణ ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత నాకు లేదు. దీంతో నా రచన ముద్రితమయ్యేసరికి అప్పులో మిగిలిపోతాను’ అంటున్న థామస్‌కి పిల్లలకి వినోదం పంచడం కోసం విల్లుపురంలోని ‘కన్నగి నగర్’ స్లమ్ ఏరియాలో ట్రస్ట్ తరపున ఉచితంగా తోలుబొమ్మలాట సెషన్లు నిర్వహిస్తారు. విద్యాసంస్థలు, ఇన్‌స్ట్యూషన్లలో నిర్వహించే వర్క్‌షాపులకు వచ్చే మొత్తాలనే పుస్తకాల ప్రచురణకై వినియోగిస్తారు.
కోవిడ్ సమయంలో థామస్ కృషి దేశ సరిహద్దులు కూడా దాటింది. పిల్లల కోసం నిరంతరం తపించే థామస్ ‘లాక్‌డౌన్ కాలంలో చాలారోజులు దుర్భరంగా గడిపాన’ని చెబుతారు. చివరికి వాట్సాప్ గ్రూపు ద్వారా ఆయన ఆ లోటుని పూర్తిచేసుకున్నారు. తమిళనాడులోని సేలం, విల్లుపురం వంటి వివిధ జిల్లాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన తమిళ కుటుంబాల్లోని చిన్నారులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరారు. ‘వన్నతు పూచిగల్’ పేరుతో నిర్వహించబడిన ఈ గ్రూపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ గ్రూపులో 150 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఖతార్ నుండి జాయిన్ అయినవారు కూడా ఉన్నారు.
థామస్ భార్య ఎమిల్డా జ్ఞాపకార్థం ఆయన మొదటి సంకలనం ‘పిల్లల కవిత్వ వర్షం’ ప్రచురితమైంది. పిల్లల సృజనను వెలికితీయడంలో ఎమిల్డా ఎంతో చురుకుగా వ్యవహరించేదని కోల్పోయిన తన జీవితభాగస్వామిని ఆయన ఈ సందర్భంగా కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు. థామస్ తపన పిల్లల రచనలను ప్రచురించడానికే పరిమితమవ్వలేదు. డిజిటల్ మ్యాగజైన్, యూట్యూబ్ ఛానెల్, పోడ్‌కాస్ట్, వెబ్‌సైట్‌ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
తిరువన్నమలైకి చెందిన 15 ఏళ్ల సహానాకి ‘తమిళ కురల్స్’పై ఉన్న ఆసక్తితో థామస్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందులో పిల్లలకి సంబంధించిన వీడియోలు తనని చాలా ప్రభావితం చేశాయి. ఎంతగా అంటే ‘తిరుక్కురల్’లోని ‘కురల్స్’ మొత్తం 1330ని తండ్రి సాయంతో రాగి పత్రాలపై ముద్రించింది. వాటిని మ్యూజియంలో ప్రదర్శించాలని కూడా ఆశ పడుతోంది.
పిల్లలతో తరచూ తనకు ఎదురయ్యే అనుభవాలని థామస్ ఇలా చెబుతున్నారు. ‘పిల్లలు తమ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛా వాతావరణం అన్ని చోట్లా ఉండదు. ఒకసారి నేను తోలుబొమ్మలాట ప్రదర్శన చేస్తున్నాను. వాటికి కథలు రాయమని పిల్లలని ప్రోత్సహించాను. అయితే ఎక్కడ తనతో కథలు రాయిస్తారో, తప్పులు వస్తాయన్న భయంతో 12 ఏళ్ల జ్యోతి శ్రీ ఆ షోకి రావడమే మానేసింది. తన భయాన్ని పోగొట్టేలా మాట్లాడాను’ అని చెబుతున్న థామస్ మాటల్లో పిల్లల్లో దాగున్న సృజనని వెలికితీయడంలో ఆయన తపన అర్థమవుతుంది. మాస్టారు ఇచ్చిన ధైర్యంతో జ్యోతి శ్రీ ఏకంగా మూడు డ్రామాలకి కథలు అందించింది. రెండు కథలు కూడా రాసింది. తన ‘వెట్రిప్ప’ కథ ‘కథల పండగ’ సంకలనంలో కూడా ప్రచురించబడింది.
ఐదేళ్ల పిల్లల నుండి కూడా రచయితలను తయారుచేయవచ్చు అంటారు థామస్. పిల్లల ఆలోచనలే కథల రూపంలో బయటికి వస్తాయంటారు. వాటిల్లో పెద్దలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దంటారు ఆయన. పిల్లలు రాసే కథల్లో నైతికత ఉండేలా చూడడమే పెద్దల పని అంటారు.
పిల్లలు ముభావంగా ఉంటున్నా, ఎవ్వరితో కలవకుండా దిగులుగా కూర్చొంటున్నా వాళ్లతో కథలు రాయించమని చెబుతున్నారు. అలా చేస్తే పిల్లలు ఒత్తిడి నుండి దూరమవుతారు. రచనలు వారికి మంచి వైద్యంలా పనిచేస్తాయి అంటున్నారు. ఈ సందర్భంగా13 ఏళ్ల అగళ్య తల్లి లేని ఒంటరి తనపు మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించిందో చెబుతారు. ‘అగళ్య తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. అప్పుడు తను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ తరువాత సవితి తల్లికి పుట్టిన చెల్లితో అగళ్య బంధం పెనవేసుకుంది. ఈ అనుభవాలనే తన కథల్లో రాసింది. వాటిని చదివిన అగళ్య సవితి తల్లి, ఆ చిన్నారి పడిన వేదనని అర్థం చేసుకుంది. ‘ఇంతలా తనని బాధ పెట్టానా’ అని విచారించింది. ‘ఇక నుండి తన భావాలను అర్థం చేసుకుంటాన’ని అగళ్యని దగ్గరకి తీసుకుంది. ఇప్పుడు అగళ్య ఎంతో సంతోషంగా ఉంది’ అని చెబుతున్న థామస్, ‘పిల్లలు తరచూ తమ చుట్టూ ఉండేవారి గురించి, ఆ బంధాలతో వాళ్లు పెనవేసుకున్న ఆప్యాయతలు, కోపాలు, అలకలు వంటివన్నీ రచనల్లో రాస్తుంటారు. వాళ్ల పేర్లు కూడా యథాతథంగా అలానే రాసేస్తారు. వాటిని మార్చి రాయడమే నేను చేస్తుంటాను. మిగతాదంతా అలాగే ఉంచేస్తాను. ఆ రచనల్లో వాళ్ల సృజనని వెలికితీయడమే నా పని’ అంటున్నారు.
జువైనల్ హోమ్‌కి వెళ్లి అక్కడి పిల్లలతో కూడా రచనలు చేయించారు థామస్. ’16 ఏళ్ల ఓ బాలనేరస్తుడు తను, తన స్నేహితులు ఎదుర్కొన్న శిక్షని, విచారణలని, తీర్పులని ఒక్కొక్కటిగా తన రచనల్లో రాశాడు. అవి చదువుతున్నప్పుడు ఆ పిల్లలు పడ్డ మానసిక వేదన మనకి తెలుస్తుంది’ అని చెబుతున్నారు. పిల్లల గురించి ఇంతలా ఆలోచిస్తున్న థామస్, పిల్లల కోసం వీధి లైబ్రరీ నిర్మించాలని ఆశపడుతున్నారు. పిల్లల రచనలతో అది నిండిపోవాలని తపన పడుతున్నారు. ఇప్పటికే రచనల వేట మొదలుపెట్టారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. థామస్ ‘మాస్టారు’ సాధ్యమైనంత త్వరగా తన లక్ష్యం చేరుకోవాలని కోరుకుందాం.