అలసత్వం తెచ్చిన ముప్పు

Oct 2,2024 04:08 #feachers, #jeevana, #kavithalu

పల్లె రైతు యొకడు పాడిపసుల పెంచి
పాలనమ్ముచుండె పట్నమందు
పాల చిక్కదనము వ్యాపారమును పెంచ
మంచిపేరు వచ్చె సంచితముగ

మిగులు పాలగాచి పెరుగు మిన్న చిలికి
వెన్నకాచి నేతి ఘటము పేర్మి కూర్చి
పట్నమందున అమ్మగా ప్రజలు మెచ్చె
చేయు వ్యాపారమున చాల చేయి తిరిగె

నేతి వ్యాపారమందున నీతి తోడ
రుచియు నాణ్యతలెన్నగా శుచికి తోడ
ధనము కీర్తి కూడెను చాల త్వరితముగను
శ్రద్ధయున్న చోట పెరుగు సంపదెపుడు

ఒక్కనాడు రైతు ఊరికి బోవగా
పనుల నప్పజెప్పె భార్యకపుడు
వెన్న తీయుటయన వేగిర పడుమనె
మోసగించకనెను ముక్కబెట్టి …

సేవకులకు నీవు చెప్పరాదు పనులు
నేతి కాచుటంత నీవె చేయు
తప్పు జరిగినాక తప్పించుకోలేము
శ్రద్ధ చూపుమనుచు సుద్దు జెప్పె

భర్త వెడలిపోయె పరదేశము పనుల
భార్య విడిచిపెట్టె బంటులకును
పాలు తీసి కాచి వేళకు తోడేసి
పెరుగు చిలుకు పనులు విసుగు చేత

మూడురోజులు మీగడ మురగబెట్టి
ఆరు దినముల వెన్నల నంట గాచి
తీరుబడిగ చేయ దొడగు వీరి పనుల
కంపుగొట్టె నేతి సరుకు కడవలందు

మేలుగూర్చెడి కార్యమందున
మిక్కటించెను నష్టముల్‌
కాలయాపన చేసికొన్నను
కాలదన్నును సౌఖ్యముల్‌

ఎప్పటి కప్పుడు పనులను
తప్పనిసరి చేయుచుండ తడబాటవకన్‌
తప్పించునననుకూలత
తప్పును చీవాట్లు తొలగు దారిద్య్రమ్ముల్‌

ఆలసించిన మించును కాలవశము
ఆలసించిన అమృతమ్మె ఔను విషము
ఆలసించ నశించును చాల నిజము
ఆలసించకు పనులను అహరహమును

– నాగమంజరి గుమ్మా
99856 67500.

➡️