యుద్ధమో, ఉపద్రవమో, కరువో, కాటకమో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసినప్పుడు అక్కడ ఏ పండగ వాతావరణం కనిపించదు. ఆ ప్రజల ముఖాల్లో ఏమాత్రం సంతోషం తారసపడదు. సరిగ్గా ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపిస్తోంది పశ్చిమబెంగాల్ కలకత్తా నగరంలో. సాంప్రదాయ కళలకు, సాంస్కృతిక ఉత్సవాలకు నెలవైన అక్కడ ప్రతి ఏడూ, దేశంలోనే ఎక్కడా లేనట్లుగా దసరా పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని నెలల ముందు నుండే నగర కూడళ్లన్నీ పండగ శోభతో అలరారుతాయి. దుర్గా ప్రతిమలు, పండగ డెకరేట్ ఐటమ్స్, పందిళ్లు, బట్టల షాపులు, పూజా సామగ్రి.. ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్క చోట జనాలు బారులు తీరి ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేదు.
శక్తికి మారుపేరుగా దుర్గని ఆరాధించడమే దసరా పండగ ప్రత్యేకత. వివిధ అలంకారాల్లో దుర్గా ప్రతిమలను కొలవడంలో దేశంలోనే కలకత్తా నగరం మొదటిది. సింహం, పులి వంటి క్రూరజంతువులపై స్వారీ చేస్తూ, చెడుని దునుమాడే ధీరోధాత్తగా, అత్యంత పరాక్రమవంతగా తయారైన దుర్గా ప్రతిమలు ఇక్కడ కనిపించినట్లుగా మరెక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు.. అటువంటి నగరంలో మహిళలకి సురక్షితమని భావించిన ఆ ప్రాంతంలో కొన్ని రోజుల ముందు జరిగిన యువ వైద్యురాలి హత్యాచారం అక్కడి పౌరులని దిగ్భ్రాంతికి గురిచేసింది. హత్యోదంతం తరువాత జరిగిన పరిణామాలు కూడా వారిని ఆలోచనల్లో పడేశాయి. నిందితులను అరెస్టుచేసినా వారిని ఏదో నిరాశ వెంటాడుతోంది. అందుకే పండగ వేళ ఎవరూ బయటికి రావడం లేదు. ఉత్సవాలు చేసుకోవడం లేదు. అందుకు నిదర్శనంగా ఎన్నో ఉదంతాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి.
కలకత్తా కుమార్తులి ప్రాంత వాసులు దుర్గా ప్రతిమలు తయారుచేయడంలో సిద్ధహస్తులు. రెండు దశాబ్దాలకు పైగా వందల కుటుంబాలు ఈ పనిలో నిమగమై ఉంటున్నాయి. దాదాపు 20 అడుగుల దుర్గా ప్రతిమని తయారుచేయడంలో 52 ఏళ్ల శుభదేందు పోరెల్‌ది అందెవేసిన చేయి. వందల్లో బొమ్మలు చేసి సకాలంలో అందిస్తాడని మంచి పేరుంది. అయితే ఇప్పుడతను అంత పెద్ద బొమ్మలు తయారుచేయడం లేదు. అసలు అన్ని బొమ్మలు కూడా చేయడం లేదు. ఈ పరిస్థితినే అతను ఇలా చెబుతున్నాడు. ‘రెండు నెలల ముందు నుండే నాకు పని వస్తుంది. ఆర్డరు మీద ఆర్గనైజ్‌సంస్థలకు బొమ్మలు తయారుచేసి ఇస్తాం. కానీ ఇప్పుడు అన్ని ఆర్డర్లు లేవు. చాలా తక్కువే వచ్చాయి. ఈ ప్రాంత వాసులు ఇప్పుడు పండగ జరుపుకునే స్థితిలో లేరు’ అని చెబుతున్నాడు.
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 43 వేల దుర్గా ఉత్సవాలు ప్రతి ఏడూ నిర్వహిస్తారు. ఒక్క కలకత్తాలోనే 3 వేల పైచిలుకు ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది సుమారు 6 వందలకు పైగా ఆర్గనైజ్ సంస్థలు ఉత్సవాలను జరిపేందుకు ముందుకు రాలేదు. ‘పండగ జరపకుండా వెనక్కి తగ్గడం కరోనా సమయంలోనే చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపిస్తోంది’ అంటున్నారు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజెస్‌ని నిర్వహించే అభిషేక్.
సాధారణంగా పండగకి నెల రోజుల ముందు నుండే బట్టల దుకాణాలు, మాల్స్ రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏ షాపు చూసినా జనాలు లేక వెలవెలబోతున్నాయి. ‘పండగ సీజన్‌లో మా దుకాణాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఆర్ జి కర్ హాస్పటల్ ఘటన తరువాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. మొదటి బేరం కావడానికి మేము రోజంతా ఎదురుచూడాల్సి వస్తోంది. అసలు వీధుల్లో జనాలు రావడం లేదు’ అని బట్టల షాపు యజమాని ఖాన్ అంటున్నాడు.
కలకత్తా నగరంలో జరిగే దసరా ఉత్సవాలను చూసేందుకు దేశవిదేశాల నుండి టూరిస్టులు వస్తుంటారు. ఈసారి వారి రాక కూడా కనిపించడం లేదు. ‘యాత్రికుల రద్దీతో హోటళ్లు, తినుబండారాల స్టాళ్లు ఎప్పుడూ కిక్కిరిసి ఉండేవి. క్రితం ఏడాది నగరవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారం 180 కోట్ల రూపాయలు దాటింది. కానీ ఇప్పుడు మూడొంతుల్లో రెండొంతులకు పడిపోయింది’ అంటున్నారు రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేష్.
ఉత్సవాలు ఉత్సాహంగా జరగాలంటే యువత ముందుకురావాలి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో యువత అంతా నిరసనల్లో పాల్గొంటున్నారు. సోషల్‌మీడియాలో కూడా వైద్యురాలి హత్యోదంతంపైనే కథనాలు వస్తున్నాయి. ‘ఇంతకుముందు మా కుమార్తులికి చాలామంది యువత వచ్చేవారు. మేం తయారుచేసే ప్రతిమలను వివిధ భంగిమల్లో ఫొటోలు తీసుకుని సోషల్‌మీడియాలో షేర్ చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. నగరం విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ పండగ నిశ్శబ్దంగా గడిచిపోతుంది’ అని కుమార్తులి పోరెల్ గద్గద స్వరంతో చెబుతున్నాడు.
స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందే, అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురై మరణించింది యువ వైద్యురాలు. ఆమె మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల ఆందోళనలు జరిగాయి. కొన్ని రోజుల తరువాత వాతావరణం చల్లబడింది. కానీ ఆ ప్రాంత వాసులు మాత్రం అలా ఊరుకోలేదు. దేశం నలుమూలలా వినిపించేలా ఇప్పటికీ తమ నిరసనను గొంతెత్తి నినదిస్తున్నారు. మళ్లీ మళ్లీ ఈ అన్యాయం జరగకూడదని బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే వారంతా పండగ జరుపుకోవడానికి ఇష్టపడడం లేదు. దేశంలో మహిళలు ప్రమాదంలో ఉన్న వేళ, ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయం ఇది కాదని ఆ ప్రజల్లో వచ్చిన చైతన్యం ఎంతోమందికి ఆదర్శం.