ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్‌లో ఇప్పుడు చాలా పనులు చేయొచ్చు. మల్టీమీడియా డిజైనింగ్, యూనిమేషన్, రోబోటిక్స్, ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్‌ను కూడా ఇప్పుడు అతి తక్కువ సమయంలో జరుగుతున్నాయి. ఇంటర్నెట్‌లోని ఈ సాంకేతిక సృజనపై ప్రాథమిక దశలోనైనా విద్యార్థులకు అందిస్తే వారు సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కంప్యూటర్ బోధన ఉంటున్నా అరకొరగానే సాగుతోంది. ఇలాంటి తరుణంలో విజయవాడ కెఎస్‌ఆర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలతో ఈ బోధన కొనసాగుతోంది.
విజయవాడ పటమట లంకలోని కొమ్మా సీతారామయ్య ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (కెఎస్‌ఆర్)లో గత 8 సంవత్సరాలుగా చైతన్య సారధి ట్రస్ట్ ద్వారా బాలికల కోసం కంప్యూటర్ శిక్షణ కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకూ 800 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి పిల్లలంతా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. ఇది గమనించిన స్థానికులు కొమ్మా సీతారామయ్య ముని మనవడు కొమ్మా తులసీరామ్, రావిపాటి పరంధామయ్యలు పాఠశాలలో భౌతిక వనరుల కోసం ఏటా రూ.2 లక్షలు వెచ్చించి అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.మురళీ కృష్ణారెడ్డితో పాటుగా ఉపాధ్యాయ బృందం కృషితో కంప్యూటర్ ఉపాధ్యాయిని సబీహా బేగం కంప్యూటర్ విద్యను నాణ్యతా ప్రమాణాలతో బోధిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం కోరిక మేరకు చైతన్య సారథి ట్రస్ట్ ప్రతినిధులు ఈ పాఠశాలలో కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్‌లో ఉచితంగా శిక్షణా తరగతులను అందిస్తున్నారు. ట్రస్ట్ ఫౌండర్ బిక్కసాని పూర్ణచంద్రరావు, సిఇఒ బాలమోహన్ నేమాని, కోఆర్డినేటర్ జి.నాగరాజు తదితరులు శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చెరుకూరి వెంకట వజ్రమ్మ జ్ఞాపకార్థం డాక్టర్ బాపూజీ, కమల నర్రా దాతల సహాయ సహకారాలతో ఈ శిక్షణను అందిస్తున్నారు. పాఠశాల రెగ్యులర్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బ్యాచ్‌ల వారీగా తరగతులు జరిగేవి.
ప్రస్తుతం ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ కంప్యూటర్ ఉచిత తరగతులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ 100 మందికిపైగా విద్యార్థులు ఈ తరగతులకు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ జరిగే ఈ తరగతుల్లో కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్, ఇంటర్నెట్, మానిటర్, కీబోర్డ్, మౌస్, సిపియూ, మౌస్, ప్రింటర్, స్పీకర్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి విషయాల గురించి తెలియజేస్తున్నారు. కంప్యూటర్ టైపింగ్, చిత్రాలు గీయటం, మెయిల్స్ తయారు చేయటం వంటివి తెలియజేసి స్వయంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రోత్సాహం : బిక్కసాని పూర్ణచంద్రరావు, చైతన్య సారథి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బాలమోహన్ నేమాని, ట్రస్ట్ సిఇఒ
వైద్యవృత్తిలో ఉంటూ నేను అమెరికాలో స్థిరపడ్డాను. విద్యాదానం కన్నా గొప్పది మరొకటి లేదని భావించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 45 (ఆంధ్రా 33, తెలంగాణా 12) ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చి సాంకేతిక విద్యను అందిస్తున్నాం. పేద విద్యార్థులు చాలా చక్కగా కంప్యూటర్ విద్యను అందిపుచ్చుకుంటున్నారు. కంప్యూటర్ ఉపాధ్యాయులకు కూడా మేమే వేతనాలు చెల్లిస్తున్నాం. టెక్నీషియన్‌ను నియమించాం. నిరంతర పర్యవేక్షణలో మరమ్మతులు లేకుండా వర్కింగ్‌లో ఉండేలా చేయిస్తున్నాం. గడిచిన ఎనిదేళ్లలో వేలాదిమంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు.
సమ్మర్ స్పోర్ట్స్‌కు ఆదరణ : కె.మురళీకృష్ణారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఏప్రిల్ 25 నుంచి మా పాఠశాలలో సమ్మర్ కోచింగ్ మొదలైంది. చెస్, అథ్లెటిక్స్ వంటి అంశాల్లో ఇస్తున్న శిక్షణకు బాలికలు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 6 – 7 గంటలు, సాయంత్రం 5 – 6 గంటల మధ్య నేర్పిస్తున్నాం. క్రియేటివ్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్, సింపిల్ మ్యాథ్స్ వంటి అంశాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పాలిటెక్నికల్ ఎంట్రెన్స్‌కు కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చాం. పది, ఇంటర్‌లో చదువులో మంచి ఫలితాల సాధన కోసం చదువులో వెనుకబడిన వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. కంప్యూటర్ శిక్షణకు మంచి ఆదరణ లభిస్తోంది.
టెక్నాలజీ అంశాలపై సమగ్ర అవగాహన : ఎం.సబీహబేగం, కంప్యూటర్ ఉపాధ్యాయిని
కంప్యూటర్ కోర్సులు బయట నేర్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాలి. ఇక్కడ కంప్యూటర్ సబ్జెక్టు అంశాలపై సమగ్రంగా బోధిస్తున్నాం. ఇంటర్నెట్ వినియోగం, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పెయింటింగ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి కూడా నేర్పించాం. సబ్జెక్టు అంశాలపై ప్రాజెక్టు వర్కులు పిల్లలే చేయగలుగుతున్నారు. లైఫ్‌స్కిల్స్, గోల్స్ సెట్టింగ్, అచీవ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ, ఎంఎల్ వంటి అంశాలు కూడా నేర్పిస్తున్నాం.
– యడవల్లి శ్రీనివాసరావు