వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, టెలీగ్రామ్ … ఇలాంటి సోషల్ మీడియా ఖాతాలు మీరు వాడుతున్నారా? అయితే బహుపరాక్… సైబర్ నేరగాళ్లు ఉన్నారు జాగ్రత్త.. అనునిత్యం మీ కదలికలు, ఆయా ఖాతాలను, పోస్టులను ఫాలో అవుతూ మీ వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటూ ఆనక బ్లాక్‌మెయిలింగ్‌కు దిగే ముఠాలు ఉన్నాయి. ఫేక్ ఖాతాలు ప్రారంభించి ఆడవాళ్ల ఫొటోలను ఐడిలకు పెట్టుకుంటూ చాటింగ్‌లు చేస్తారు. ఆ వలలో చిక్కుకుంటే- అసలు రూపం బయట పెడతారు. బీ కేర్ పుల్.. మీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, బ్యాంకు ఖాతాల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అవగాహనతోపాటుగా అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరాల బారి నుంచి బయటపడొచ్చు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక రకాల మెసేజ్‌లతో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. మొదట్లో ఆడవాళ్ల నుంచి స్వీట్ వాయిస్‌తో మాట్లాడతారు. ఆ తర్వాత బాతాఖానీ చేస్తారు. ఆ తర్వాత మెల్లగా మాటల్లోకి దింపి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంటారు. అంతర్ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నిరంతరం సోషల్ మీడియా వేదికలను పరిశీలిస్తూ వారి వ్యక్తిగత డేటాను తెలుసుకుంటూ మెల్లగా ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఎందుకంటే అంత దూరం బాధితులు రాలేరని వారి భావన. ఈజీమనీ కోసం ఇలాంటి కేటుగాళ్లు మన పరిసర ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. ఎక్కడో ఒకచోట వ్యక్తిగతంగానూ, లేదా బృందాలుగా కొంతమంది వ్యక్తులు ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణాలో కూడా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ వ్యవస్థలు పెద్ద ఎత్తున కృషిచేస్తున్నాయి. సైబర్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణకు, బాధితులకు అండగా ఉండేందుకు కృషి జరుగుతోంది.
ఆన్‌లైన్ చదువులు, ఉద్యోగాలు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఆశచూపి ఈ మోసాలకు తెగబడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో నిస్సహాయులుగా మార్చి రూ.లక్షల్లో లాగేసుకుంటున్నారు. బాధితులు తెలుసుకునే లోపే వారి కష్టార్జితం కొల్లగొట్టేస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఐవిఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్ ద్వారా ఎరవేసి డబ్బులు దోచేస్తుండటం వెలుగులోకి వస్తోంది. బాధితులు కళ్లు తెరిచే సరికే డబ్బు ఖాతాలు దాటిపోతోంది.
పోలీస్‌శాఖ ద్వారా ప్రధానంగా నాలుగు పద్ధతుల్లో సైబర్ నేరాల నియంత్రణకు కృషిచేస్తున్నాం.
- సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం
- బాధితులకు అండగా ఉండటం
- నిపుణులతో భాగస్వామ్యంతో పనిచేయటం
- సాంకేతిక సృజనతో నేరాల మూలాలు కనుగొనటం
అవగాహన ముఖ్యం
మా శాఖ ద్వారా సామాన్య ప్రజానీకం నుంచి అన్ని తరగతుల ప్రజలకు సైబర్ నేరాలు జరిగేందుకు ఉన్న అవకాశాలు ఎలాంటివో తెలియజేస్తున్నాం. అవగాహన లేమి కారణంగానే బాగా ఉన్నత చదువులు చదివిన వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్డెర్డ్ అకౌంటెంట్లు, ఇతర వివిధ వృత్తుల వారు బాధితులుగా మారుతున్నారు. ఉదా : ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఓటీపీలు చెప్పమని ఫోన్లు రావు. నేరగాళ్ల నుంచే ‘మీ ఖాతా ఉన్న బ్యాంకు కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ సేవింగ్, కరెంట్ అకౌంట్ల గురించి అప్‌గ్రెడేషన్ చేస్తాన్నామం’టూ ఫోన్లు వస్తుంటాయి. వారి ప్రశ్నలకు జవాబులు చెప్పటం, ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పడం వల్ల సైబర్ దొంగలు ఈజీగా ప్రతిరోజూ రూ.లక్షల్లో కాజేస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తులకు సమాధానం ఇవ్వటాన్ని మానుకోవాలి. వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించే అంశాల పట్ల జాగురూకతతో ఉండాలి.
బాధితులకు అండగా
ఇలాంటి మోసాలకు గురైనప్పుడు [email protected] లేదా 1930 ద్వారా సైబర్ కైం పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సైబర్ నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో policestation/http://cybercrime.gov.inలో రిపోర్టు చేయటం ముఖ్యం. సంఘటన జరిగిన గంట సమయంలోపుగా పోలీసులకు తెలియజేస్తే కొంతమేరకు నిరోధించే అవకాశం, చేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవలకాలంలో టెక్నాలజీని ఉపయోగించి చాలా కేసులను చేదించటం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నిందితులను గుర్తించటంతోపాటుగా, సొమ్ము రికవరీ చేయటం, అరెస్ట్ చేసిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి.
నిపుణుల భాగస్వామ్యంతో …
పోలీసుశాఖతోపాటుగా ఇతర సాంకేతిక నిపుణుల సహాయాన్ని కూడా తీసుకుని సైబర్ నేరాల నియంత్రణకు కృషిచేస్తున్నాం. సైబర్ సిటిజన్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అందరూ అందులో చేరేలా కృషి జరుగుతుంది. ఈ యాప్‌లో చేరిన వారికి ఏది అసలు ఫోన్‌కాల్, ఏది నకిలీ, అపరిచత వ్యక్తులు, యాప్స్, లింక్స్ వంటి వాటిని గుర్తించటానికి అవకాశం ఉంటుంది. ఎపి పోలీస్ ద్వారా డయల్ 100, 1930 ద్వారా కంప్లెయింట్ రిజిస్టర్ చేస్తున్నాం. ఆ తర్వాత టెక్నాలజీని ఉపయోగించి సైబర్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. నిందితులు ఎవరు వంటివి గుర్తించే పక్రియలు చేపడుతున్నాం. పలు దశల్లో ఈ ప్రక్రియలను కొనసాగిస్తున్నాం.
తగు జాగ్రత్తలతో మోసాలకు ముకుతాడు
- టెక్నాలజీని ఉపయోగించే సైబర్ దొంగలు మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నిరోధించేందుకు కూడా అధునాతన సాంకేతిక సృజనను ఉపయోగించి ఆయా కేసులను చేధించటానికి కృషి జరుగుతోంది. మా శాఖ ద్వారా సైబర్ నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఫోను వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే చాలా మోసాలను మొదట్లోనే నియంత్రించొచ్చు.
- మీకు పార్శిల్ పంపించారనీ, అందులో డ్రగ్స్, ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశామని కాల్ చేస్తే స్పందించొద్దు. తక్కువ వడ్డీకి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా లోన్ ఇస్తామని చెప్పే లోన్ యాప్‌లను నమ్మొద్దు. పార్ట్‌టైమ్, వర్క్‌ఫ్రం హోమ్ అంటూ ప్రొడక్ట్స్, హోటళ్లకు రేటింగ్, లైక్స్ ఇవ్వటం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పే యాప్స్, వెబ్‌సైట్లను నమ్మొద్దు.
- పాస్‌వర్డ్‌లను అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలు కలిపి ఉండేలా బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. తరచుగా వాడుతున్న పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండండి. కంప్యూటర్, మొబైల్‌ఫోన్, ఇతర పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు యాంటీవైరస్ ఉపయోగించి అప్‌డేట్ చేసి మాల్‌వేర్‌లను రానివ్వకుండా చూసుకోండి. అనుమానాస్పద వీడియో కాల్స్, లింక్స్, ఎపికె ఫైల్స్, యాప్స్ మాల్స్, మెసేజ్‌లను తెరవడం ద్వారా మీ ఫోన్ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి అందించకండి.
- సోషల్ మీడియా యాప్‌లో ప్రొఫైల్ లాక్‌తోపాటు టు స్టెప్ వెరిఫికేషన్ పాస్వార్డ్‌లను పెట్టుకోండి. అనుమానాస్పద లింక్స్, ఎపికె ఫైల్స్ , యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా మీ ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ‘ఆన్’లో ఉంచండి. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇతర పబ్లిక్ స్థలాల్లో వైఫైను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సెల్‌కు సొంత చార్జర్‌ను మాత్రమే వాడండి. ఫోన్ పే, గూగుల్‌పే, స్కానర్‌ల ద్వారా పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో పంచుకోకూడదు.
-ఎస్.వి.రాజశేఖరబాబు, ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్