టిష్యూ పేపర్‌

Apr 12,2024 05:10 #feachers, #jeevana, #watermelon

‘నాన్నా, పక్క వీధిలో పుచ్చకాయలు అమ్ముతున్నారంట. వెళ్లి కొనుక్కుని రానా’ అని ఆరవ తరగతి చదువుతున్న చైతన్య తన తండ్రిని అడిగాడు. ‘అలాగే.. ‘నా చొక్కా జేబులో డబ్బులు, టేబులు మీద టిష్యూ పేపర్‌ తీసుకొని ప్రణవ్‌తో కలసి వెళ్లు’ అని తండ్రి సమాధానం చెప్పాడు.
తండ్రి జేబులో డబ్బులు, టిష్యూ పేపరుతో పాటు పెద్ద సంచి తీసుకొని ప్రణవ్‌తో బయటకు వచ్చాడు చైతన్య. చైతన్య మామయ్య కొడుకే ప్రణవ్‌. సెలవులు కావడం వల్ల చైతన్య ఇంటికి వచ్చాడు.
‘వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చగల అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఇందులో ఎన్నో విటమిన్లు పోషకాలు వున్నాయని మా మాస్టారు చెప్పారు’ అని రోడ్డు మీద నడుస్తూ చైతన్య ప్రణవ్‌తో మాట్లాడుతున్నాడు. ‘ఇదంతా సరే కానీ, పుచ్చకాయలు కొనడానికి, టిష్యు పేపర్‌ ఎందుకురా’ అని అడిగాడు ప్రణవ్‌. ‘పద, నువ్వే తెలుసుకుందువు’ అన్నాడు చైతన్య.
రోడ్డు పక్కన లగేజీ వ్యానులో పుచ్చకాయలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘అన్నా మంచి పుచ్చకాయ ఒకటి కోసి ఇవ్వు’ అన్నాడు చైతన్య.
‘ఇవన్నీ మా తోటలో పండినవే. మంచిదే ఇస్తాను’ అంటూ ఒక పుచ్చకాయ తీసుకొని సగంగా కోశాడు వ్యాపారి. వెంటనే చైతన్య తన దగ్గరున్న టిష్యూ పేపరుతో ఆ పుచ్చకాయ ముక్కపై రుద్దగానే టిష్యూ పేపరు ఎర్రగా మారిపోయింది. ఆ పుచ్చకాయ సహజంగా పండింది కాదని చైతన్య గ్రహించాడు.
‘అన్నా, ఈ పండుకు కెమికల్స్‌ ఇంజెక్ట్‌ చేసి ఎర్రదనం తెప్పించారు. ఇది ఆరోగ్యానికి హానికరం. నాకు వద్దు. సహజంగా పండిన పండు అయితే టిష్యూ పేపరుకు ఇలా ఎర్ర రంగు అంటుకోదని మా మాస్టారు చెప్పారు. ఇది కల్తీ పండని నేను మా నాన్నకు చెబుతాను. ఆయన ఫుడ్‌ ఇన్‌స్పెక్టరును తీసుకొని వస్తారు’ అంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు స్నేహితులిద్దరూ.
తండ్రిని పిలుచుకొని వచ్చేటప్పటికి పుచ్చకాయల బండి అక్కడ లేదు. కెమికల్స్‌ వాడిన పండ్లను అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులు శిక్షిస్తారన్న భయంతో వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చైతన్య తండ్రి ఈ సమాచారాన్ని ‘ఆహార పదార్థాల కల్తీ నివారణ సంస్థకు’ అందించారు. అవగాహనతో ఉంటే కల్తీ పదార్థాల నుంచి దూరంగా ఉండవచ్చని ప్రణవ్‌కి అర్థమైంది.

– ఓట్ర ప్రకాష్‌ రావు,
తిరుత్తణి, 097874 46026.

➡️