నోటి లోపల చిన్న గాయం లేదా పుండ్ల రూపంలో కనిపించే మౌత్ అల్సర్లు చాలా మందిలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. తినే సమయంలో, మాట్లాడే సమయంలో ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన బాధను కలిగిస్తాయి. ఈ అల్సర్లకు కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే నివారణ, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇవీ కారణాలు..
- మౌత్ అల్సర్లకు ముఖ్య కారణం మానసిక ఒత్తిడి. ఒత్తిడిలో ఉండే వ్యక్తులకు తరచుగా ఈ అల్సర్లు వస్తూ ఉంటాయి.
- విటమిన్ బి12, విటమిన్ సి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా నోటిలో పుండ్లు రావచ్చు.
- మసాలా పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం ఎక్కువగా తినడం వల్ల అల్సర్లు రావచ్చు.
- కొంతమంది మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మౌత్ అల్సర్లు వస్తుంటాయి.
- కొన్ని మందులు మౌత్ అల్సర్లకు కారణం కావచ్చు.
ఉపశమనం ఇలా..
- ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.
- విటమిన్‌లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
- మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోక పోవడం మంచిది.
- ఫార్మసీలో దొరికే నోటి జెల్లు, మౌత్ వాష్‌లు ఉపయోగించి కూడా నోటి అల్సర్ల నుండి ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు బెంజామిన్ పెరాక్సైడ్, ఓరల్ అనిసెప్టిక్ జెల్లును వాడుకోవచ్చు.
- కొద్దిగా సోడియం బైకార్బోనేట్‌ని(బేకింగ్ సోడా) నీటిలో కలిపి గార్గిల్ చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
- అలోవిరా జెల్‌ను అల్సర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
- మౌత్ అల్సర్లు 10 రోజులకంటే ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.