రైలుబండి

Mar 21,2025 23:13 #Jeevana Stories

ఎక్కండి ఎక్కండి
సొగసైన రైలు
చూడండి చూడండి
ఆకు పచ్చని బైలు

ఊలేసి కదిలింది
ఊళ్ళనే దాటింది
పట్టాల పైనుండి
పరుగులే తీసింది

కొండలను చూపింది
బండలను చూపింది
పరిగిత్తినట్టున్న
తరువులను చూపింది

ఎక్కండి ఎక్కండి
సోకైన రైలు
మలుపులో చూడాలిరా
దాని స్టైలు!

గోదారి దరి దాటి
కృష్ణమ్మతటి మీటి
పచ్చపచ్చని చెట్ల
పందిళ్ళనే దాటి

రాగాలు పాడుతూ
రైతువలె కదిలింది
సాగుభూముల మధ్య
చెమటతో సాగింది!

ఎక్కండి ఎక్కండి
చక్కనౌ బండి
ప్రక్కలను పరచి
మిము జోకొట్టునండి!

బహురాష్ట్ర యాత్రికులు
భారతీయత చాటు
పెక్కు భాషల వారు
జాతీయతను చాటు

ఎక్కండి ఎక్కండి
మన రైలుబండి
ఏకతాసూత్రాన్ని
ఇది చాటు లెండి!

– కిలపర్తి దాలినాయుడు,
సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
రామభద్రపురం.

➡️